స్వరాష్ట్ర స్వప్నం సాకారమైనప్పుడు రైతుకన్నీరు తుడిచి సాగును సమున్నతంగా నిలపాలనేది కేసీఆర్ తపన. అందుకే, ఆయన పాల నాకాలంలో సాగు బాగుపడి రైతు రాజవ్వడం తిరుగులేని సత్యం. ఆ స్వప్నం నిజమైనట్టే, ఈ సత్యం పదే పదే రుజువు అవుతూనే ఉన్నది. జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన గణాంకాలు కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలు అట్టడుగుకు పడిపోయినట్టు వెల్లడించడం ఓ తాజా రుజువు. విషయం కొత్తది కాకపోయినా ధ్రువీకరణ గమనించదగ్గది. అన్నదాతల బలవన్మరణాలు 96 శాతం కనుమరుగు కావడం మామూలు విషయం కాదు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రైతు ఆత్మహత్యలు 2015లో 1,209 నుంచి 2023లో 48కి తగ్గాయి. అబద్ధాల ప్రబుద్ధులు ఎన్ని కారుకూతలు కూస్తేనేం నిజం ఎగదన్నుకు వస్తుందనేది చరిత్ర చెప్పిన పాఠం.
తెలంగాణ సాధకుడే ప్రగతి పథ ప్రబోధకుడై నడిపిస్తే తెలంగాణ తీరుతెన్నులు మారిపోయాయి. ముఖ్యంగా అన్నదాతల సంక్షేమం మహోజ్వల శకాన్ని చూసింది. అయితే, ఇదేదో రాత్రికిరాత్రే వెలిసిన మాయా ప్రపంచం కాదు. దీని వెనుక కేసీఆర్ కఠోరమైన దీక్షాదక్షతలున్నాయి. అద్భుతమైన ప్రణాళిక, అద్వితీయ కార్యాచరణతో ముందుకుసాగడంతోనే సేతానం బాగుపడి రైతు ముఖంలో ఆనంద ం వెల్లివిరిసింది. ఎన్నెన్ని విధాలుగా ఆదుకుంటే ఇది సాధ్యమైంది? చరిత్రాత్మకమైన గొలుసుకట్టు చెరువులను బాగుపరిచారు. ప్రాజెక్టులను పరుగెత్తించారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కాళేశ్వరంతో గోదావరిని పీఠభూమి ఎక్కించి తెలంగాణలో పరవళ్లు తొక్కించారు. ఉచిత కరెంటు 24 గంటలూ అందించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సీజన్‌కు ముందే దండిగా సమకూర్చారు. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీయాక్టు ప్రయోగించారు. గోదాములను యుద్ధప్రాతిపదికపై నిర్మించారు. ఊరూరా కాంటాలు పెట్టి చివరి గింజ వరకు పంట కొనుగోళ్లు చేశారు. ఆత్మ హత్యలు వద్దని అనునయిస్తూనే ఏదైనా కారణాల వల్ల రైతులు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమా అందించింది. మండలానికో ఏఈవో నియమించి, రైతు వేదికలు నిర్మించి వ్యవసా యంలో మార్గదర్శనం అందించింది. రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం సమకూర్చింది. తదేక దృష్టితో ఇలా ఒకటి వెనుక ఒకటిగా అండదండలు అందిస్తూ పోతే అంతిమంగా రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయి. ఇది చరిత్ర. ఇదే చరిత్ర.
కానీ, కేసీఆర్ అందించిన రైతు సంక్షేమ పథకాలకు మంగళం పాడిన మాయదారి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సేతానం మళ్లీ పాత రోజులకు మళ్లుతున్నది. అందుకే, రైతులు ఆందోళనలకు గురవుతున్నారు. రెండేండ్ల ఈ కాంగ్రెస్ పాలనలో 700 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు కేసీఆర్ పాలన రోజులను పదేపదే తలచుకోవడంలో, మళ్లీ కేసీఆరే రావాలని కోరుకోవడంలో వింతేమున్నది?