డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయం కలిగించిన స్ఫూర్తితో డాలర్ బలపడటం అందుకు ప్రధాన కారణం. విశ్వ విపణిలో డాలర్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్నది. మరోవైపు మన దేశంలోని విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాలను వేగంగా వదిలించుకుంటున్నారు. దీనివల్ల గత అక్టోబర్‌లో 11 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఎగిరిపోయాయి.
నవంబర్‌లో మరో 2 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. భారతీయ షేర్ల ధరల అతి ఉగ్గడింపు, 2వ త్రైమాసికంలో లాభాలు తగ్గిపోవడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరచడం లేదు. వీటన్నింటి ప్రభావం వల్ల నవంబర్ 12వ తేదీన రూపాయి మారకం విలువ రూ.84.40కు పడిపోయింది. స్థిరీకరణకు రిజర్వ్ బ్యాంకు చర్యలు చేపడుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో రూపాయి మారకం విలువ మరింతగా ఒత్తిడి ఎదుర్కోక తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ గెలుపు భారత్‌కు సవాళ్లతో పాటు అవకాశాలను ఆవిష్కరిస్తున్నదని అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఎస్బీఐ రూపొందించిన నివేదిక తెలిపింది. ట్రంప్ రెండో విడత పాలనాకాలంలో రూపాయి విలువ 8-10 శాతం తగ్గిపోతుందని అంచనా వేసింది. అమెరికా ఎన్నికల పర్యవసానంగా భారీగా తగ్గిన రూపాయి విలువ డాలర్ మారకంలో మొదట్లో తగ్గినా తదనంతర కాలంలో అది పుంజుకుంటుందని ఎస్బీఐ నివేదిక ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. ప్రపంచంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీల్లో డాలర్‌కు ప్రత్యేక స్థానమున్నది. అంతర్జాతీయ వాణిజ్యానికి డాలర్‌నే ఎక్కువగా వినియోగిస్తుంటారు. భారత్ కూడా డాలర్ మీదే అధికంగా ఆధారపడుతున్నది. రకరకాల సమస్యల కారణంగా డాలర్ మారకం నుంచి బయటపడే ప్రయత్నాలు ఇటీవలి కాలంలో ఊపందుకున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్ వేదికగా ఇందుకు సంబంధించి స్పష్టమైన ఎజెండా రూపుదిద్దుకుంటున్నది.
అక్టోబర్ 24న రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత్ సహా సభ్యదేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయం గురించి ఒక ప్రకటన చేశాయి. సభ్య దేశాల్లోని కేంద్ర బ్యాంకుల సమన్వయంతో కొత్త చెల్లింపుల వ్యవస్థ ఏర్పాటుచేయాలని తీర్మానించుకున్నాయి. తమ మధ్య వాణిజ్యానికి డాలర్ బదులుగా తమ తమ సొంత కరెన్సీల్లో చెల్లింపులు జరపడం ద్వారా ఇది సాధ్యమని భావిస్తున్నాయి. ఇది అమెరికాకు ఏ మాత్రం ఇష్టం లేదు.
డాలర్‌ను ఇండియా వదిలేస్తే దిగుమతులపై వంద శాతం సుంకం విధిస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ బెదిరించారు. అమెరికా ఆంక్షల కారణంగా రష్యా నుంచి రూపాయి మారకంతోనే భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్నది. చైనా కూడా తన కరెన్సీని వినియోగించి రష్యా వద్ద చమురు కొంటున్నది. ఇటీవలే బ్రిక్స్ సభ్యత్వం తీసుకున్న మరో చమురు దేశం ఇరాన్‌కూ ఇదే విధానాన్ని విస్తరించే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలికంగా తమ తమ కరెన్సీలను బలోపేతం చేసే దిశగా భారత్ సహా బ్రిక్స్ దేశాలు అడుగులు వేయడం శుభపరిణామం.