తెలంగాణలో ఎనకటికి మా చిన్నప్పుడు తుపాకీ రాముడని గ్రామాల్లోకి వస్తుండే వాడు. ఒక చెక్క తుపాకీని భుజాన వేసుకుని ‘మా రాజా.. మా రాజా మాది ఇంత, అంత.. వాడు దొంగ.. వీడు దొర’ అని అన్ని అబద్ధ్దాలు చెబుతూ గారడీ చేసేవాడు. తెలియనివారు అతని మాటలు నమ్మేది. తెలిసిన వారు నవ్వుకునేది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అబద్ధ్దాలు చెప్పి బతికే కొందరు మోపయ్యారు.. ఎంతలా అంటే కండ్ల ముందు కనబడుతున్న సాక్ష్యాలను కూడా ‘నిజం కాదు’ అని నమ్మించేంతలా..ఒక అబద్ధ్దాన్ని పదే పదే చెబితే నిజం అవుతుందన్నట్టు. రాష్ట్రంలో అబద్ధ్దాల మాటున పరిపాలన సాగుతోంది. కానీ ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజం నిలకడ మీద తెలుస్తుంది. చివరికి సత్యమే గెలుస్తుంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్పై, ఆయన చేసిన అభి వృద్ధిపై అదే పనిగా అసత్య ప్రచారాన్ని చేపట్టారు. ప్రాజెక్టులు పనికిరావని, కేసీఆర్ ఏం అభివృద్ధి చేయలేదని నీలాపనిందలు వేశారు. విష ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధ్దాలను నిజమేమో అని ప్రజలు నమ్మి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక కూడా పరిపాలన పక్కన పెట్టి కేసీఆర్పై, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకూ పనికి రాదని, రాష్ట్రంలో, కేసీఆర్ ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని నిత్యం అనేక వేదికలపై పచ్చి అబద్ధాలు మాట్లాడటం మొదలుపెట్టారు.
నోరు తెరిస్తే బూతులు, కేసీఆర్ చేసిన అభివృద్ధిపై అబద్ధాలతో రెండేండ్లు కాలం వెళ్లదీశారు. రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు అదే పనిగా రేవంత్ రెడ్డి మాజీ సీఏం కేసీఆర్పై నిందలు మోపడం ప్రజలకు నచ్చలేదు. ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తుండటం, కేసీఆర్ చేసిన అభివృద్ధి కండ్ల ముందు ఉండటం, వాటి రిబ్బన్ కటింగ్ల కోసం రేవంత్ రెడ్డి వెళ్లడంతో ప్రజలకు వాస్తవాలు పూర్తిగా అవగతమయ్యాయి.. ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి మళ్లీ అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారంటే ఆయన వక్రబుద్ధి అర్థం చేసుకోవచ్చు.
కాలం గొప్పది..ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా కచ్చితంగా వాటికి సమాధానం చెబుతుంది. ఇది చాలా విషయాల్లో రుజువైంది. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పే రేవంత్ రెడ్డి అదనపు టీఎంసీల కోసం పనులు చేపట్టాలని, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఎత్తిపోయాలని అధికారులకు ఆదేశించినట్టు వార్తను చూశాం. మరి కాళేశ్వరమే కూలిపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? కేసీఆర్ను బద్నాం చేయాలని, కాళేశ్వరం లాంటి మహా ప్రాజెక్టును అభాసుపాలు చేయాలని ప్రయత్నించి సీఎం రేవంత్ రెడ్డే అభాసుపాలయ్యారు.
కేసీఆర్ ఎంతో దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. రైతులు తమ నీటి అవసరాలు తీర్చిన కేసీఆర్ను నేడు తలచుకుంటున్నారు. కేసీఆర్ ఉంటే కుంగిన పిల్లర్లు రిపేర్ చేపించి మరింత సాగునీరు అందించేవారని రైతాంగం సర్వత్రా చర్చించుకుంటోంది. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఖ్యాతిని తగ్గించాలని చూసి చివరికి ఒక పిల్లర్ రిపేర్ చేయలేని అసమర్థుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోయారు.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెట్ రన్ నిర్వహించిన చనాక కొరాట, సదర్మాట్ బ్యారేజీలను తానే కట్టినట్టు బీరాలు పలికారు. కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టుల శిలా ఫలకాల మీద పేర్లు మార్చి తానే వాటిని కట్టినట్టు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ముమ్మాటికీ చనాక కొరాట కేసీఆర్ ఘనతనే. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది.
కాకతీయుల కాలం నాటి చెరువులను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. అయితే మిషన్ కాకతీయతో వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆరే. అలాంటి నాయకునిపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, బూతులు వల్లెవేస్తే జనం నమ్ముతారు అనుకుంటే అది ఎప్పటికీ మూర్ఖత్వమే అవుతుంది.
ఒక సాగునీటి రంగమే కాదు..అన్ని రంగాల్లో కేసీఆర్ పూర్తి చేసిన పనులను, కార్యక్రమాలను తనవిగా చెప్పుకుంటూ కేసీఆర్ ఏం చేయలేదని అదే పనిగా అబద్ధాలు చెబుతున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలనలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి, ఎన్నికలు వచ్చాయని నియామక పత్రాలు అందజేయలేదు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేసి తానే వాటిని ఇచ్చినట్టు చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అప్పుల విషయంలోనూ అదేపనిగా అబద్ధాలు చెబుతున్నారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చేసిన అప్పు అక్షరాల రూ.4.17 లక్షల కోట్లు అని కాగ్ రిపోర్టు చెప్పినా, నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి అధికారిక వేదికలపై పచ్చి అబద్ధాలు మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనంగా చెప్పవచ్చు. రూ.4 లక్షల కోట్ల అప్పు చేసిన బీఆర్ఎస్ అంతకు రెట్టింపు సంపదలను సృష్టించింది. అనేక ప్రాజెక్టులను నిర్మించింది, పరిశ్రమలను స్థాపించింది.
స్టార్టప్లకు చేయూతను అందించింది. రైతులకు పెట్టుబడి సాయం అందించింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ తన పాలనలో అమలు చేశారు. దీంతో దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. ఇన్ని ఫలితాలు ప్రజల కండ్ల ముందు కదలాడుతున్నాయి. మరి రెండేండ్లలో రెండు లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసిన రేవంత్ సర్కార్ కొత్తగా కట్టిన ప్రాజెక్టు ఏమిటి? కొత్తగా నిర్మించిన భవనాలెన్ని? కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు ఏవి? అభివృద్ధి ఎక్కడ? మరి రెండు లక్షల కోట్ల అప్పు ఏమైనట్టు? దీనికి ముఖ్యమంత్రి దగ్గర సమాధానం ఉందా? అభివృద్ధిని పక్కన పెట్టి అడ్డదారులు వెతుకుతూ,
అవినీతి పాలన సాగిస్తూ కేసీఆర్ను నిందించడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి చరిత్రను తుడిచేద్దామని అనుకుంటే.. కాలం మాత్రం చరిత్రను గుర్తుంచుకుంటుంది.. ప్రజల కండ్ల ముందు ఉంచుతుంది. మిగిలి ఉన్న మూడేండ్ల రేవంత్ రెడ్డి పాలనలో కొత్తగా చేయాల్సినవి ఏమీ లేవు.. కేసీఆర్ మొదలు పెట్టి పూర్తి చేసిన పనులకు రిబ్బన్ కటింగ్లు చేసేసరికి టర్మ్ పూర్తి అవుతుందని జనంలో చర్చ నడుస్తోంది.
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటూ వేదికలపై రేవంత్ రెడ్డి ప్రసంగాలు చేస్తున్నారు. ‘చెరిపేయడానికి కేసీఆర్ అంటే ఆనవాళ్లు కాదు.. ఒక చరిత్ర.. శిలాఫలకంపై పేర్లు మార్చినంత మాత్రాన చరిత్రను తుడిచేయగలం అనుకుంటే అది అమాయకత్వమే అవుతుంది.
తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ చరిత్ర పదిలం. ఎందరొచ్చినా దానిని చెరిపేయలేరు. చేతనైతే రేవంత్ రెడ్డి కూడా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి కాని, కేసీఆర్ చేసిన పనులు తనవిగా చెప్పుకుని కాదు. ఎన్నికల ముందు గాలి మాటలు మాట్లాడి, అన్ని వర్గాల ప్రజలకు మాయమాటలు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారినే మోసం చేస్తూ ఉంటే అది ఎంతో కాలం నడవదు.. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మాటలు నీటి మూటలని అర్థం చేసుకున్నారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వేసినవి నీలాపనిందలే అని ఒక్కొక్కటిగా రుజువవుతున్నాయి. ఇకనైనా రేవంత్ రెడ్డి కేసీఆర్ను విమర్శించడం మానేసి, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. కేవలం వ్యక్తిగత ద్వేషంతో పరిపాలన సాగించడం ఎప్పటికీ సాధ్యం కాదు.
-తెలంగాణ విజయ్ ,9491998702