చంద్రబాబు వద్ద పాలనను నేర్చుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మధ్య ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. సమస్యలు తీర్చలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, యుద్ధాన్ని ఎదుర్కోలేని సమయంలో మీడియా ప్రచార సహకారంతో చంద్రబాబు అందరి దృష్టి మళ్లించేవారు. ఫలితం వ్యతిరేకంగానే వచ్చినా అదే వ్యూహాన్ని నమ్ముకునేవారు. ఆ సమయంలో బాబుకు మరో మార్గం లేక అలా చేసేవారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సరిగ్గా అదే చేస్తున్నారు.
హామీలను అమలు చేయలేని స్థితి. నిధులు లేవు, పాలనా సామర్థ్యం లేదు. నిధులు సమీకరించే తెలివితేటలు లేవు. హైకమాండ్ గాలికొదిలేసింది. సీనియర్లు విమర్శలు మొదలుపెట్టారు. అంతా ప్రశాంతంగా ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి ఏమిటి? ఇంకెప్పుడు అమలు చేస్తారు? అని విపక్షాలు, ప్రజలు ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించకుండా ఉండాలంటే ఏదో ఒక సంచలన వార్తలతో అందరి దృష్టి మళ్లించాలి. మీడియాకు సంచలన వార్తలు కావాలి తప్ప, హామీల అమలుపై అంత ఆసక్తి ఉండదు. అందుకే, ఉమ్మడి రాష్ట్రంలో బాబు వ్యూహాన్నే రేవంత్ అనుసరిస్తున్నారు. ఈ వ్యూహం పన్ని గురువు దెబ్బతిన్నారని తెలిసినా మరో మార్గం లేదు. హామీలను అమలు చేయలేని నిస్సహాయ స్థితి నుంచి బయటపడటం కోసం ఏదో ఒక దానిపై విచారణ పేరిట మీడియా ప్రచారంతో బతికేస్తున్నారు. ఈ 20 నెలల్లో ఇది చేశామని చెప్పుకోవడానికి ఏదీ లేదు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేసింగ్, కాళేశ్వరం పేరు మీద కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ పరువు పోతే పోయింది కానీ, ఫోన్ ట్యాపింగ్, హీరోయిన్లు.. ఈ రెండింటిని జత చేస్తే మీడియాకు మంచి మాస్ మసాలా వార్తలు అవుతాయని, మీడియాలో ప్రాధాన్యం లభిస్తుందని రేవంత్ బృందానికి తెలుసు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామాల ద్వారా కేసీఆర్ పోరాటాన్ని ఉధృతం చేసేవారు. ఉప ఎన్నికలను తెలంగాణ ఉద్యమానికి, అన్ని పార్టీలపై ఒత్తిడికి ఉపయోగించుకునేవారు. ఉద్యమ కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయింది. తెలంగాణలో ఎన్నికలు ఎదుర్కోలేమని నిర్ణయించుకున్న బాబు.. మీడియా ద్వారా అందరి దృష్టి తెలంగాణ నుంచి, ఉప ఎన్నికల నుంచి మరల్చాలని వ్యూహం పన్నారు. 2006లో కరీంనగర్ పార్లమెంట్, తర్వాత ఇతర అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలో ఇదే వ్యూహాన్ని అనుసరించారు. కేసీఆర్ రాజీనామాతో కరీంనగర్ ఉప ఎన్నిక వస్తే బీడీ కట్టల మీద పుర్రె గుర్తు వేయడానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో మీడియాలో మొత్తం బీడీ కట్టల మీద పుర్రె బొమ్మ ఉద్యమానికి సంబంధించిన వార్తలే. ఉప ఎన్నికలు పక్కన పెట్టేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగినప్పుడు మళ్లీ ఇదే వ్యూహం. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ఎడారి అవుతుందని చంద్రబాబు, పయ్యావుల కేశవ్‌తో పాటు టీడీపీ హేమాహేమీలు మహారాష్ట్ర మీదికి యుద్ధానికి వెళ్లారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేస్తే, అప్పటికప్పుడు జైలు గోడల మధ్య బాబు ఉన్న పోస్టర్లతో హైదరాబాద్‌ను నింపేశారు. మీడియా ఈ ఉప ఎన్నికలను పక్కకుపెట్టి పుర్రె గుర్తు, బాబ్లీని తెరమీదికి తీసుకువచ్చి హడావుడి చేసినా తెలంగాణ ప్రజలు మాత్రం ఈ జిమ్మిక్కులను నమ్మలేదు. తెలంగాణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
ఇప్పుడు రేవంత్‌రెడ్డి సరిగ్గా ఇదే వ్యూహాన్ని నమ్ముకున్నారు. పింఛన్లను రూ.4 వేలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా రూ.2 వేలే ఇస్తున్నారు. కల్యాణలక్ష్మిలో తులం బంగారాన్ని అటకెక్కించారు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చే స్థితిలో లేరు. ఉద్యోగులు డీఏల గురించి అడిగితే ‘దివాళా తీశాం, డబ్బులు లేవు, మమ్ములను దొంగల్లా చూస్తున్నారు’ అని ఏడుపు మొదలుపెట్టారు. మీడియాలో ప్రచారం కోసం విచారణలు, కమిషన్లు, లీకేజీలు ఉపయోగపడవచ్చు. కానీ, వీటి భ్రమలో పడిపోయి ప్రజలు హామీలను మరిచిపోయేంత అమాయకులు కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఏం చేశారు? అనేది చూస్తారే తప్ప, మీడియాలో వార్తలను ఎలా మేనేజ్ చేశారనేది చూడరు. తమ పాలన మీద కాంగ్రెస్‌కు అంత నమ్మకం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఇప్పటికైనా ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది. హామీలు అమలు చేయకుండా మీడియాలో ప్రచారం ద్వారా ప్రజల దృష్టి మరల్చాలనే వ్యూహం ఎక్కువ కాలం పని చేయదు.
– బుద్దా మురళి