‘తెలుగుదేశం ఒక అద్భుతమైన పార్టీ. అలాంటి పార్టీని తెలంగాణలో లేకుండా చేశారు’ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని ఎద్దేవా చేస్తూ, పావురాల గుట్టలో పావురమైపోయారని రేవంత్‌రెడ్డి అవమానకరంగా మాట్లాడారు. శత్రువు కూడా మరణించినవారిని, మరణించిన విధానాన్ని అవమానించరు. కానీ రేవంత్‌రెడ్డి గతంలో అనేకసార్లు శవం కూడా దొరక్కుండా దిక్కులేని చావు చచ్చారని చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. అదే వైఎస్ఆర్ను ఇప్పుడు బహిరంగ సభలోనే ఆకాశానికి ఎత్తేస్తూ నివాళి అర్పించారు. అయితే, ఇలా ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడటానికి రేవంత్‌రెడ్డి అమాయకుడేమీ కాదు.
కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడానికే పుట్టిన టీడీపీని ఆకాశానికెత్తడం, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ప్రేమ ఒలకబోయడం వెనుక రేవంత్‌రెడ్డి వ్యూహం రేవంత్‌రెడ్డికి ఉండవచ్చు.కాంగ్రెస్‌లో సీనియర్లను తొక్కుకుంటూ వచ్చి, వారిని డమ్మీలుగా మార్చి పార్టీలో చేరిన రెండేండ్లకే సీఎం పీఠం మీద కూర్చోవడమంటే మామూలు విషయం కాదు. అందుకే అమాయకుడేమీ కాదని అంటున్నా. టీడీపీలో ఉన్నా, కాంగ్రెస్‌లో ఉన్నా, సీఎం పీఠం మీద కూర్చు న్నా.. ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ఆయన వ్యూహమే ఆయనకు ముఖ్యం. కాంగ్రెస్ మునిగినా, తేలినా ఆయనకు సంబంధం ఉండదు. తానేం చేసినా రాహుల్‌గాంధీ అనుమతితోనే చేస్తానని ఓ సందర్భంలో అసెంబ్లీలోనే రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో పుట్టిన టీడీపీని పొగడటం, ఆంధ్రలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ తండ్రి వైఎస్‌ను మెచ్చుకోవడం రేవంత్‌రెడ్డి సొంత వ్యూహమా? లేక రాహుల్‌గాంధీ అనుమతితో అనుసరిస్తున్న వ్యూహమా? రేవంత్‌రెడ్డి వ్యూహా న్ని రాహుల్‌గాంధీ అర్థం చేసుకున్నారా? అన్నది తెలియాలి.
ఏకచ్ఛత్రాధిపత్యంగా దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లకు మాత్రమే పరిమితం కావడం, కాంగ్రెస్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంపై ఎప్పుడూ ఆవేదన చెందని రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఏర్పాటుకు చివరి వరకు అడ్డుపడిన టీడీపీ తెలంగాణలో లేకుండాపోయిందని ఆవేదన చెందడం విచిత్రమే.
ఒకవైపు టీడీపీని, మరోవైపు వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అవకాశం వచ్చినపుడల్లా ఆకాశానికెత్తుతూ తన సొంత ఎజెండా తయారు చేసుకుంటున్నారా? తెలంగాణలో టీడీపీ, వైఎస్ఆర్ అభిమానులను కాంగ్రెస్ వైపు తిప్పాలని చూస్తున్నారా? లేక ఆ వర్గాలను తన సొంత ఓటుబ్యాంకుగా మార్చుకోవాలని చూస్తున్నారా? తెలంగాణ సీఎంగా ‘జై తెలంగాణ’ అని పలికేందుకు కూడా ఇష్టపడని రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వారిని తన ఓటుబ్యాంకుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుండటం ఇక్కడ విశేషం.
ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక సిద్ధాంతం ఉంటుంది. లెఫ్టిస్ట్ సిద్ధాంతమో, రైటిస్ట్ సిద్ధాంతమో అన్నది వేరే విషయం. చివరకు సిద్ధాంతమంటే ఏమిటో తెలియని పవన్ అభిమానులు సైతం పవనిజం అని తమ సిద్ధాంతానికి ముద్దుగా పేరు పెట్టుకొంటారు. టీడీపీ ఆవిర్భావ సమయంలో కాంగ్రెస్ వ్యతిరేకతే తమ సిద్ధాంతమని తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ప్రకటించారు. టీడీపీ ఇప్పటికీ కాంగ్రెస్ వ్యతిరేకతే తమ సిద్ధాంతమని గర్వంగా ప్రకటించుకుంటుంది. కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తానని, ఆ పార్టీని పూర్తిగా నిర్మూలిస్తానని ఎన్టీఆర్ ఎన్నో సార్లు ప్రకటించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ కూటమి కూడా ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్‌ను ఎన్టీఆర్ నిర్మూలించలేకపోయినా తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆంధ్రలో కాంగ్రెస్, తెలంగాణలో టీడీపీ వాటంతట అవే అంతర్థానమైపోయాయి. ఆంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం వల్ల కాంగ్రెస్ అడ్రస్ లేకుండాపోయింది. దేశంలో ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ ఒక్క రాష్ర్టానికే పరిమితమవుతుంది. అలాగే టీడీపీ ఆంధ్రకు పరిమితమైంది. పోనీ ఆంధ్రలో అధికారంలో ఉన్న టీడీపీ.. కాంగ్రెస్‌కు అండగా ఉంటుందా? అంటే అదీ లేదు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి టీడీపీ మద్దతే కీలకంగా మారింది. మోదీ ప్రభుత్వానికి ఊపిరిగా నిలిచిన టీడీపీకి తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అండగా నిలిచారు. తెలుగునాట కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని కలలు కన్న ఎన్టీఆర్ తన కలలను సాకారం చేసుకోలేకపోయారు. కానీ, నరేంద్ర మోదీ దాదాపుగా ఈ కలను సాకారం చేసుకున్నారు. టక్కుటమార విద్యలన్నీ ప్రయోగించి కాంగ్రెస్‌ను మోదీ మూడు రాష్ర్టాలకే పరిమితం చేశారు.
కేసులను బయటకు తీసి, కొరడా ఝళిపించి మూడు రాష్ర్టాల నుంచి కాస్తా ఒక్క రాష్ర్టానికి పరిమితం చేయడం మోదీకి పెద్ద కష్టమేమీ కాదు. ఏ ఆధారం లేని చోట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను జైలుకు పంపిన మోదీకి.. ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలతో దొరికి జైలుకు వెళ్లి బెయిల్‌పై ఉన్న రేవంత్‌రెడ్డిని ఇబ్బంది పెట్టడం పెద్ద సమస్య కాదు.
అయితే, కాంగ్రెస్‌ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న మోదీ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్న టీడీపీని తెలంగాణలో తిరిగి బతికించాలని రేవంత్‌రెడ్డి కలలు కంటున్నారా? ఒకవైపు టీడీపీని, మరోవైపు వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అవకాశం వచ్చినపుడల్లా ఆకాశానికెత్తుతూ తన సొంత ఎజెండా తయారు చేసుకుంటున్నారా? తెలంగాణలో టీడీపీ, వైఎస్ఆర్ అభిమానులను కాంగ్రెస్ వైపు తిప్పాలని చూస్తున్నారా? లేక ఆ వర్గాలను తన సొంత ఓటుబ్యాంకుగా మార్చుకోవాలని చూస్తున్నారా? తెలంగాణ సీఎంగా ‘జై తెలంగాణ’ అని పలికేందుకు కూడా ఇష్టపడని రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వారిని తన ఓటుబ్యాంకుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుండటం ఇక్కడ విశేషం.
– బుద్దా మురళి