అహింసతో ఆయుధాలను విరిచి, బోసి నవ్వులతో ఆధిపత్యాన్ని కూల్చివేసిన మహాత్మా గాంధీ కర్ర చేతబట్టుకొని నడిచే దేశాన్ని వెలుగుల బాటలోకి అడుగులు వేయించాడు. దక్షిణాఫ్రికా గర్భాన అగ్గిదేవుడిలా జన్మించి, నల్లనయ్యలనందరినీ ఎరుపెక్కించిన నెల్సన్ మండేలా కూడా కట్టె చేత బట్టే చీకటి ఖండంలో సూర్యోదయాన్ని పండించాడు. అంతెందుకు వెలివాడల్లో సిరా నదులు పారించిన అంబేద్కర్, దక్షిణ దేశంపై నిలబడి, దిక్కుల చెవులన్నీ పగిలేలా, ఆత్మగౌరవ దండోరా మోగించిన పెరియార్.. ఇలా ఎందరో భానులు కట్టె పట్టుకొనే కోట్లాది జనాన్ని విముక్తి దారిలోకి పరుగులు తీయించారు.కొన ఊపిరి దాకా జన వికాసాన్ని శ్వాసించే విప్లవ మూర్తులు ఎందరో ఊత కర్రతోనే విప్లవాగ్నులు వెలిగించారు.
Telangana | ఈ వాస్తవం మరుగుజ్జు మనస్తత్వం కలిగిన రేవంత్‌రెడ్డి లాంటి పాలకులకు తెలిసే ఆస్కారమే లేదు. అందుకే కట్టె లేకుండా నిలబడు చాలంటూ కారణజన్ముడైన కేసీఆర్‌పై నోరు పారేసుకున్నాడు. సొంత కాళ్లపై నిలబడి, దేశమే తలెత్తిచూసేలా నిటారుగా నిలబడ్డాడు కేసీఆర్. ఆజన్మాంతం తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లు ఆ చరిత్రలో ఒక్క పేజీని కూడా సంపాదించలేరు. అయినా, ప్రమాదవశాత్తు జారిపడి, అనుకోకుండా అవసరం పడ్డ కర్రను, కేసీఆర్ త్వరగానే విసిరేసి, కారును జోరుగా నడిపే వీడియోలు తెలంగాణ మొత్తం నెలల కిందటనే చూసింది.
ఆ సంగతి పక్కనపెడితే, కట్టె కథ తెలియని ముఖ్యమంత్రి చరమాంకంలో ప్రతి మనిషికీ ఆసరాగా తప్పని మానవీయ స్థితిపై వెక్కిరింపునకు పాల్పడ్డాడు. కట్టె పట్టుకొని జీవితాన్ని ఈదడం తప్పని వయో వృద్ధులు, వికలాంగులను సైతం అవమానించేలా రేవంత్ రెడ్డి నీచంగా మాట్లాడాడు. శుక్రవారం నాడు సీఎం రేవంత్ మొగలిగిద్దలో శునకానందాన్ని నమ్ముకున్నాడు. కపిలవాయి లింగమూర్తి రాసిన ‘పాలమూరు గ్రామ నామాలు-ఒక పరిశీలన’ అనే గ్రంథంలో చెరువులో మొగలిపూలు పూయడం వల్ల, ఆ గ్రామానికి మొగలిగిద్ద అనే పేరొచ్చిందని రాశారు.
చెరువులో మొగలిపూలు విరబూసిన ఊరిలో నిలబడి, కుసంస్కారి నోటిలో మోరి ఎలా పరవళ్లు తొక్కుతుందో రేవంత్ రెడ్డి బయటపెట్టి చూపించాడు. దీంతో యథావిధిగా మళ్లీ రాష్ట్ర ప్రజలందరి ఎగతాళికి గురయ్యాడు. అసలు నేను కొడితే మామూలుగా ఉండదని కేసీఆర్ అన్న మాటల వెనుక రాజకీయ పోరాటం, అన్యాయమైన సర్కార్‌పై ప్రజాస్వామిక ఎదురుదాడి అనే భావోద్వేగ భావమే కదా ఉన్నది!.
నిజానికి నీళ్లల్లో నిప్పులు రాజేసి, పల్లెల్లో పిడికిళ్లు మొలిపించి, పొలిమేరల అవతలకి ద్రోహులను తరిమేటందుకు, తెలంగాణను సాకారం చేయడానికి కేసీఆర్ కొట్టిన కొట్టుడు ఎలా ఉండిందో జాతీయ పార్టీలకు, జాదూ పార్టీలకు మరిచిపోదామన్న మరుపునకు రాని చరిత్రనే.భంగపడ్డ రైతులు జహీరాబాద్ నుంచి మళ్లీ తమ భవిష్యత్తును వెతుక్కుంటూ కేసీఆర్ కోసం కాలినడకన వందల కిలోమీటర్లు నడిచొచ్చారు.
ఆ సందర్భంగా వారందరితో కేసీఆర్ ఇచ్చిన సందేశం నిమిషాల్లోనే సోషల్ మీడియా ద్వారా, రాష్ట్ర సకలజనులకూ చేరి భరోసాను కల్పించింది. అలాగే కేసీఆర్ ఇచ్చిన ఆ సందేశం, విఫల సర్కార్ చెంపలనూ బాగా గట్టిగానే చరిచింది. దీంతో ఉలిక్కిపడిన ఉత్త చేతుల భిక్షపతి, ఆగమై అరిచినట్టు రేవంత్ రెడ్డి అడ్డగోలుగా గొంతు చించుకున్నాడు.
దీంతో ఎంత ఎత్తయిన కుర్చీలో కూర్చున్నా, కుసంస్కారం మరుగుజ్జులానే ప్రవర్తిస్తుందని అందరూ మళ్లీ ముచ్చటించుకున్నారు. ఎంత ఖరీదైన మైకు ముందు నిలబెట్టినా, వరాహం అరుపులో అణువంతైనా వినసొంపును కూడా ఆస్వాదించలేమనే వాస్తవం తేట తెల్లమైపోయింది. అంతేకాదు, విష కురుపు వీపు మీద పండితే, కంపే కొడుతుందనేదీ అందరికీ పూర్తిగా అర్థమైపోయింది. దీంతోపాటు నిన్న మొగలిగిద్దలో ముఖ్యమంత్రి మూర్ఖాభినయం చూసిన తర్వాత, వికృతం నోట్లో చిక్కిన హస్తం పార్టీ భవిష్యత్తును ఊహిస్తేనే, ఆలోచనా పరులందరికీ జాలేస్తున్నది. మాటలతో ముంచుతూ, చేతలతో చంపుతూ, కాంగ్రెస్ పార్టీ భవితవ్యాన్ని సమాధిలో నిర్మిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఏ గ్రామంలో అడిగినా, కాంగ్రెస్ పార్టీ సర్కార్‌ను నెత్తినెక్కిన శని అనే కదా అంటున్నారు.
దురదృష్టవశాత్తు దొరికిన ఈ అవకాశాన్ని జనానికి మేలు చేసేందుకు ఉపయోగించి ఉంటే, కాంగ్రెస్ సర్కార్‌ను ఇంతలా ప్రజలెందుకు దూషిస్తారు? ఎవరిని కదిలించినా, జేబులో రూపాయి రోడ్డు మీద పారవేసుకుంటిమనే ఆవేదన అలుముకొని పోయింది. దాన్ని అర్థం చేసుకునే హృదయం లేని హస్తం పార్టీ పాలకులు, సమయాన్నంతా బీఆర్ఎస్ను తూలనాడేందుకు ఖర్చు చేసేస్తున్నారు. పదేండ్లు బాగా బతికి, కాంగ్రెస్ అన్యాయమైన విధానాల వల్ల మళ్లీ రుణరోగంతో సతమతమవ్వలేక రైతులు, ఆటోడ్రైవర్లు చివరికి రియల్టర్లు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో పెరిగిపోతున్న ఈ దుర్వార్తలే కేసీఆర్‌ను, బీఆర్ఎస్ శ్రేణుల హృదయాలను కలచివేస్తున్నాయి. దానివల్లనే కదా అవసరమైతే ప్రజా పోరాటాలు ఉధృతం చేసైనా సరే, రాష్ర్టాన్ని ఒరిగిపోనీకుండా కాపాడుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు.
14 నెలలుగా రాష్ట్రంలోని ఒక్కో ప్రాధాన్య రంగాన్ని తిరోగమన దిశలో పరుగులు తీయిస్తూ, రాష్ట్రం పరువును తీసేశారు. హమీల అమలు మాట దేవుడెరుగు కొత్త కొత్త సమస్యలు సృష్టించి, ప్రజల దృష్టిని దారి మళ్లించాలనే పాత రోత కాంగ్రెస్ రాజకీయాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల సతీమణులు, సోదరీమణులు, బంధుగణాలు భుజాలకు సంచులేసుకొని, కమీషన్ల కోసం, సెటిల్మెంట్ల కోసం చకోర పక్షుల్లా జల్లెడ పడుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ కవి అలిశెట్టి ప్రభాకర్ కవిత్వంలో ‘బూటుకాల్నించి/ టోపివరకున్న అధికారం/ ‘టోకు’ నించి చిల్లరకూ దిగజారితే అనర్థం’ అన్నట్టు సీఎం నుంచి మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి పరివారం అక్రమార్జనపై పడి అన్నిరంగాల వారికి ఆపదగా మారిపోయారు.
పెరిగిన ఈ పాపాలే ప్రజలందరిలో ప్రభుత్వంపై పట్టరాని కోపం పెంచాయి. దాని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో, స్వయంగా నిర్వహించిన పోల్ పందెంలో బొక్క బోర్ల పడ్డారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా భుజం కాస్తున్నా, సోషల్ మీడియాలో సామాన్యులు సర్కార్‌కు చుక్కలు చూపెడుతుండటంతో, తాజాగా ఆపుకోలేక సీఎం రేవంత్ రెడ్డిసోషల్ మీడియాపై కూడా విషం కక్కేశారు. రేవంత్‌రెడ్డి సెలవిచ్చిన మేరకు, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలకు వచ్చే సోషల్ మీడియా లైక్‌లు కూడా రాఖీ సావంత్‌కు వచ్చే లైకులుగానే చూడాలేమో ? దారితప్పిన పాలన, మతిలేని మాటలతో హస్తం పార్టీ ప్రభుత్వం యావత్తూ బజారున పడిపోయింది.
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఫీనిక్స్ పక్షిలా జవసత్వాలు సముపార్జించుకుంటే, 14 నెలల కాంగ్రెస్ సర్కార్ ఏలుబడిలో దిగులంటుకున్న పావురాల్లా నలిగిపోతున్నారు. ఇది దీర్ఘకాలికంగా తెలంగాణ ఆత్మ విశ్వాసంపై విషపూరిత ప్రభావం చూపెడుతుంది. చూస్తూ పోతుంటే మేస్తూనే పోతుంటారు, అందుకే తిరగబడక తప్పదు. ఇప్పటికే గ్రామ సభల్లో జనం గుండె మంటను కాంగ్రెస్ సర్కార్ రుచిచూసింది. ఇకపై కాంగ్రెస్ సర్కార్‌కు ప్రతిరోజూ ప్రజా గండమే.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
-డాక్టర్ ఆంజనేయ గౌడ్