అంతా అనుకున్నట్టు జరిగితే ఆ 10 మందిలో ఒకరిద్దరు మంత్రులై చక్రం తిప్పేవారు. ‘కారు’ గుర్తు మీద గెలిచి చేతి గుంపులో కలిసి సర్కారు పంచన చేరి రాజ్యం ఏలుదామనుకున్నవారి కలలు చివరకు పీడకలలుగా మారిపోయాయి. ఒకరు మారితే.. వారి బాటలో మరికొంతమంది గ్యారెంటీగా వచ్చి తమ ఫిరాయింపునకు చట్టబద్ధత తెస్తారని అనుకున్నవారి ఆశలు గల్లంతయ్యాయి. కాంగ్రెస్ ఊహాగానాలు సైతం గుడ్లు తేలేశాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 66 సీట్లిచ్చి ఆశీర్వదించిన ప్రజల మద్దతు చాలు, సభలో బలం కోసం మరో పార్టీని చీల్చే ఉద్దేశం తమకు లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూన్నెళ్లలోనే మాట మార్చారు. అప్పటికే కేసీఆర్ కుటుంబంపై విషం చిమ్ముతున్న ఆయన మార్చి 2024లో తన అసలు రంగు బయటపెట్టారు. ’నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబం తప్ప మిగతా వాళ్లంతా కాంగ్రెస్‌లో చేరిపోతారు’ అని బహిరంగంగా పదే పదే ప్రకటించారు. ఆ మాటల బుట్టలో పడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కోర్టుల నిర్ణయాల మధ్య ఎటూ కాని వారిగా బతుకు గడుపుతున్నారు.
కథ ఇంత దూరం వస్తుందనుకోలేదు. ముఖ్యమంత్రిని హుషారుగా కలిసి మూడు రంగుల కండువా కప్పుకుని పండుగ చేసుకున్నప్పుడు ‘ఇంకేముంది..ఇక నుంచి మేము ప్రభుత్వంలో భాగమే’ అనుకున్నారు. తమ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఆఫీసుల్లో తమ మాటనే చెల్లుబాటు చేసుకున్నారు. ‘మీకు నేనే నాయకుడిని’ అని రెండు పార్టీల (బీఆర్ఎస్, కాంగ్రెస్) కార్యకర్తలను తికమకపెట్టారు. తమపై ఓడిన అభ్యర్థికి నిద్ర లేకుండా చేశారు. కానీ కాలం వారికి కలిసి రాలేదు. రేవంత్‌రెడ్డి అన్నట్టు కాంగ్రెస్ తలుపులు పగలూ, రాత్రీ తెరిచి పెట్టినా బీఆర్ఎస్ శాసనసభ్యుల నుంచి 11వ వ్యక్తి ఆ పార్టీ వైపు తొంగిచూడలేదు. గడప దాటిన ఆ 10 మంది ఒంటరి పక్షులయ్యారు. పుచ్చుకున్న కాంగ్రెస్ తీర్థం మింగలేక, కక్కలేక రెండు పార్టీలకు కానివారుగా కాలం వెళ్లబుచ్చుతున్నారు.
జులై 2024 నాటికి పార్టీ ఫిరాయింపు పర్వం ఆగిపోయి, గీత దాటిన వారిపై చర్య తీసుకోవాలనే గొంతులు పెరిగిపోయాయి. వారి వెనుక మరొకరు రాకపోగా ఆ జంప్ జిలానీల శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు శాసనసభ స్పీకర్‌ను కోరడం మొదలైంది. అయితే, స్పీకర్ తాత్సారం వల్ల విషయం హైకోర్టు దాకా వెళ్ళింది.
పార్టీ మారిన శాసనసభ్యుల అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు పెట్టాలని అసెంబ్లీ కార్యదర్శిని సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించింది. నాలుగు వారాల్లో తేల్చుకుని, తగిన ఆదేశాలు జారీ చేయవలసి వస్తుందని కోర్టు చెప్పింది. ఈ విషయమై అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం తరఫున పై కోర్టుకు అప్పీలు చేశారు. ఇలా స్పీకర్‌కు సమయాన్ని నిర్దేశించే అధికారం కోర్టుకు లేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. స్పీకర్‌పై కోర్టు ఒత్తిడి తగ్గడంతో ఫిరాయింపుదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కేసు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో దీని తీవ్రత పెరిగింది. పార్టీ మారిన శాసనసభ్యుల అనర్హత గురించి విన్నవించి 11 నెలలైనా స్పీకర్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు సరిగానే ఉన్నాయని నవంబర్ 2025లో తేల్చిచెప్పింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ ఆ 10 మంది శాసనసభ్యులకు నోటీసులు పంపక తప్పలేదు. పార్టీ మారినా.. ఫలితం దక్కకుండా ఏడాదికి పైగా ఎదురుచూపులతో కాలం గడిపినవారు స్పీకర్ ముందు విచారణకు హాజరై పచ్చి అబద్ధం చెప్పక తప్పలేదు. ‘అవును పార్టీ మారాను’ అని ఉన్నమాట చెప్తే శాసన సభ్యత్వం పుటుక్కున ఊడిపోతుంది. ‘నేను బీఆర్ఎస్ సభ్యుడినే, నన్ను అనర్హుడిగా ప్రకటించకండి’ అని స్పీకర్ ఎదుట వెల్లడించి గండం నుంచి బయటపడ్డారు.
ఈ నేపథ్యంలో వారు పార్టీ మారినట్టు బలమైన ఆధారాలు లేనందున వారిని సభకు అనర్హులుగా భావించలేమని స్పీకర్ తన తీర్పులో వెల్లడించారు. అయితే, అంతా బాగానే ఉంది కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న తీరు, వారి ముఖంలో ఆనందం, ఆ తర్వాత వారు మాట్లాడిన మాటలు అన్నీ పార్టీ మారినట్టు స్పష్టం చేస్తున్నాయి. తమ ప్రాంత అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలిశామంటూ ఆ సందర్భంగా ఆ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలను బయటపెట్టాలి. ఆనాటి నుంచి తమ సొంత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వివరాలు వెల్లడించాలి.
కాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై ఈ నెల చివరిలోగా విచారణ పూర్తి చేసి అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయం వెల్లడించింది. ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే దానం నాగేందర్ మినహా తొమ్మిది మంది తమ వివరణను సభాపతికి అందజేశారు. దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభకు పోటీ చేశారు కాబట్టి ఆయన అబద్ధం ఆడినా అతికేలా ఉండదు. స్పీకర్ నోటీసుకు ఏమని సమాధానం ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ఆయనది. సుప్రీంకోర్టు నిర్ణయించిన గడువులోగా దానం నాగేందర్ భవిష్యత్తును స్పీకర్ తేల్చాల్సిందే.
ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై స్పీకర్ తీర్పు ఇంకా వెలువడలేదు. కడియం శ్రీహరిని స్పీకర్ విచారించవలసి ఉన్నది. ఈ మధ్యనే అనర్హత నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌రెడ్డి కాంగ్రెస్‌పై విమర్శలు సంధించారు. తప్పటడుగు వేసి కాంగ్రెస్‌లో చేరానని, దాని వల్ల తనకు గానీ, ప్రజలకు గానీ వెంట్రుక మందం లాభం కూడా జరగలేదని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. దీనితో ఒక ఎమ్మెల్యే వెనక్కి వచ్చినట్టుగా భావించాలి.
జగిత్యాల నియోజకవర్గం పరిస్థితి మరో తీరు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాటి నుంచి అక్కడి సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఏ పార్టీలో ఉన్నారో తెలియని స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరిస్తున్నారు. మరోవైపు స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏ రకంగానూ కాంగ్రెస్ కాపాడుకునే పరిస్థితి లేదు. తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని స్పీకర్ ముందు ఒప్పుకున్న ఎమ్మెల్యేలు ప్రజల ముందుకు ఏ కండువా కప్పుకొని వెళ్తారో చూడాలి మరి.
-బద్రి నర్సన్