ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పాలె, అభాండాలు వేయాలె, కుప్పలుతెప్పలుగా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వాలె, అలవిగాని వాగ్దానాలు చేయాలె, గ్యారెంటీలు అంటూ ఊదరగొట్టాలె, ప్రజలను ఊహల పల్లకిలో ఊరేగించాలె, అరచేతిలో వైకుంఠం చూపించాలె, మాయమాటలు చెప్పాలె, మర్మం జేయాలె.. ఏం చేసి అయినా, ఎలాగైనా అధికారంలోకి రావాలె.. ఆ తర్వాత ఇచ్చిన హామీలను ఎగ్గొట్టాలె, హామీలపై చర్చ జరగకుండా డైవర్షన్ చేయాలె, అడిగినవారిని తొక్కాలె.. ఇదీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు రేవంత్‌రెడ్డి పన్నిన కపట పన్నాగం. రేవంత్‌రెడ్డి ఆచరించిన ఈ పన్నాగం నేడు కాంగ్రెస్‌తోపాటు దేశంలోని అనేక పార్టీలకు వివిధ రాష్ర్టాల ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చేందుకు ఆదర్శంగా నిలుస్తున్నది. అబద్ధమే విస్తుపోయేలా లేనిపోని హామీలు ఇచ్చేందుకు ప్రేరణగా మారింది.
కాంగ్రెస్‌తో జట్టుకట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అబద్ధపు హామీలు ఇవ్వడంలో తన మిత్రపక్షం హస్తం పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మించిపోయారు. తాను అధికారంలోకి వస్తే ఏకంగా బీహార్‌లో ఇంటికో కొలువు ఇస్తానని, రాష్ట్రవ్యాప్తంగా మొ త్తం 3 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని కోత లు కోశారు. 2014లో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలిచిన మోదీ కూడా ఇంతకుమించి హామీలిచ్చారు. దేశవ్యాప్తంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గప్పాలు కొట్టారు. కానీ, మోదీ సర్కారు కనీసం లక్షల్లో అయినా కొలువులు ఇవ్వలేదు.
ఇక రేవంత్‌రెడ్డి విషయానికి వస్తే, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. ఇంకా పింఛన్లు రూ.4 వేలకు పెంపు, రైతుభరోసా రూ.15 వేలు, కౌలు రైతులు, రైతు కూలీలకు సాయం, రైతు రుణమాఫీ, మహిళలకు నెలనెలా రూ.2,500 ఆర్థికసాయం, విద్యార్థినులకు స్కూటీలు, విద్యాభరోసా కార్డు, నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్.. ఇలా చెప్పుకొంటూపోతే 420 హామీలున్నాయి. కానీ, అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి మడమతిప్పి మాటతప్పారు. లంకె బిందెలు దొరకలేదని సాకులు చెప్తూ సాగిలపడ్డారు. ఖజానా నింపుకోవడం చేతకాక, ఖజానా ఖాళీ అయ్యిందని చేతులెత్తేశారు. నెలకు రూ.18 వేల కోట్లు మాత్రమే ఆదాయం వస్తున్నదని, తన పొట్ట కోసినా చిల్లిగవ్వ రాదని నిస్సహాయతతో నిట్టూర్చారు. ఏం చేసుకుంటరో చేసుకోండని బెదిరింపులకు దిగారు. బజార్ల తనను ఎవ్వరూ నమ్మడం లేదని, ఢిల్లీలో అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరని, బ్యాంకులకు పోతే చెప్పులు ఎత్తుకుపోయే దొంగను చూసినట్టు చూస్తున్నారని చెప్పి తనతోపాటు తెలంగాణ పరువును తీశారు.
అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల్లోనే రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారు. గత కేసీఆర్ సర్కారు పదేండ్లపాటు కష్టపడి పోగుచేసిన తెలంగాణ సంపదను ఒకవైపు కరిగిస్తూనే, మరోవైపు అప్పుల కొండను పేరుస్తున్నారు. ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజమే. కానీ, ఆ అప్పులను ఎలా సద్వినియోగం చేస్తున్నాయన్నది ముఖ్యం. తెస్తున్న అప్పులను ఎలా వినియోగిస్తున్నారు? దేనిపై ఖర్చు చేస్తున్నారు? అన్నది కీలకం. బీఆర్ఎస్ సర్కారు పదేండ్లలో చేసిన మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులను సంపద సృష్టి కోసం పెట్టుబడి పెట్టింది. తద్వారా తెలంగాణ సంపదను పదింతలు పెంచింది. కానీ, రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్‌రెడ్డి వాటిని ఏం చేశారు? దేనిపై ఖర్చు పెట్టారు? ఆ అప్పులన్నీ ఎటుపోయాయి?
స్వరాష్ట్రంగా ఏర్పడినప్పుడు తెలంగాణ అనామక రాష్ట్రం. చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి. కొత్త రాష్ట్రం.. ఏం చేయాలో.. ఎటువైపు నడవాలో తెలియని పరిస్థితి. సాగునీళ్లకు కటకట, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, కరెంటు కోతలు, నేతన్నల బలవన్మరణాలు, వల్లకాడులా మారిన పల్లెలు.. ఇలా అనేక సమస్యలు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వాగతం పలికాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కేసీఆర్ తొణకలేదు, బెణకలేదు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను వాడుకొని అతితక్కువ కాలంలోనే దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు.
జీఎస్డీపీ, తలసరి ఆదాయం, ధాన్యం ఉత్పత్తి, చేపలు, గొర్రెలు పెంపకం, మాంసం ఉత్పత్తులు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీల స్థాపన, సర్కారు ఉద్యోగాలు, ఐటీ కొలువులు, ప్రైవేటు జాబ్‌ల కల్పన.. ఇలా అనేక రంగాల్లో తెలంగాణ 100-400 శాతం వరకు వృద్ధి సాధించింది. ఒకనాడు వలసల రాజ్యంగా ఉన్న తెలంగాణ కేసీఆర్ హయాంలో అభివృద్ధికి ప్రతీకగా మారి దేశంలో సగర్వంగా తలెత్తుకొని నిలబడింది. అనేక రాష్ర్టాలకు కేసీఆర్ మాడల్ ఆదర్శం. కానీ, నేడు రేవంత్‌రెడ్డి పాలనలో అబద్ధపు హామీలు, అలవిగాని వాగ్దానాలకు తెలంగాణ ఆదర్శంగా మారడం శోచనీయం. గతంలోనూ హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి అబద్ధపు గ్యారెంటీలను ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ చేతులు కాల్చుకుంది. రేవంత్‌రెడ్డి విధానాలను విడనాడకపోతే బీహార్‌లో కాంగ్రెస్ మిత్రపక్షం ఆర్జేడీకి కూడా ఇదే గతి పట్టే ప్రమాదం లేకపోలేదు.
– కాసర్ల నాగేందర్‌రెడ్డి