పాలక పెద్ద అతితెలివితేటలు ఎలా ఉంటాయంటే.. సమన్యాయం చేస్తున్నామని చెప్తూనే తనకు నచ్చని విపక్ష నేతలను నిలువునా ముంచేయటం, సహజ న్యాయసూత్రాలను తుంగలో తొక్కేయటం, హక్కులకు భంగం కలిగించటమే రేవంత్ నైజం. బట్టకాల్చి మీద వేస్తే, ఆ నిప్పు ఆర్పుకునే పనిలో ప్రతిపక్ష నేతలు ఉంటారనే చౌకబారు ఎత్తుగడలు, కుయుక్తులు రాజ్యాంగ ధర్మాసనాలైన సర్వోన్నత న్యాయస్థానాల వద్ద ఎల్లకాలం చెల్లుబాటు కావని తాజాగా కేసీఆర్, హరీశ్‌రావు విషయంలో కాళేశ్వరం కమిషన్ విచారణపై హైకోర్టు తీర్పు రుజువు చేసింది.
రేవంత్‌రెడ్డి..న్యాయం, ధర్మం పేరుతో కేసీఆర్, హరీశ్‌ను దగా చేయటానికి ఒడిగట్టిన ఒక పిట్టకథ ఇక్కడ చెప్పుకోవాలి. ఆ ముగ్గురూ అంటే.. రేవంత్‌రెడ్డి, కేసీఆర్, హరీశ్‌రావు కలుసుకున్నారని అనుకుందాం. ప్రొటోకాల్ ప్రకారం సీఎం హోదాలో ఉన్న రేవంత్, ప్రతిపక్ష నేత కేసీఆర్, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత హరీశ్‌కు..‘నువ్వు బెల్లం పట్టుకురా, నువ్వేమో కొబ్బరికాయ పట్టుకురా..నేనేమో గుండ్రాయి పట్టుకొస్తా..ముగ్గురం కలిసి కొబ్బరికాయ కొట్టి బెల్లంతో నంచుకుని సమంగా తిందాం’ అని రేవంత్ ప్రతిపాదన చేసినట్టుగానే కాళేశ్వరం వ్యవహారంపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ విచారణ తీరుతెన్నులు ఉన్నాయి. ఇది అక్షరాలా సీఎం రాజకీయ కుయుక్తుల మనస్తత్వానికి అద్దం పట్టింది.
మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణాలు చెప్పాల్సిన ఘోష్ కమిషన్ విచారణకు ముందే కుట్ర ప్రకారం కేసీఆర్, హరీశ్‌పై అవినీతి, అక్రమాలతో కూడిన అనేక ఆరోపణలను సీఎం, మంత్రులు చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది.
ఆ కమిషన్ 119 మంది సాక్షులను విచారించింది. అప్పటికే ముందే చెప్పిన ఆరోపణలకు తగినట్లుగా ఫైళ్లను కమిషన్‌కు ప్రభుత్వం ఇచ్చింది. సాక్షుల విచారణ తర్వాత కమిషన్ నలుగురిపై ఆరోపణలు ఉన్నాయనే నిర్ణయానికి వచ్చి రిటైర్డు ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసబర్వాల్‌కు ఒకే తరహాలో నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత హరీశ్, కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. అయితే, ఆ ఇద్దరు అధికారులకు ఇచ్చిన నోటీసులు, ఇద్దరు బీఆర్ఎస్ అగ్రనేతలకు జారీ చేసిన నోటీసులకు తేడాలు ఉన్నాయి. కేసీఆర్, హరీశ్ సాక్షులుగా హాజరుకావాలని మాత్రమే నోటీసులిచ్చింది. ‘మీపై ఫలానా అధికారి లేదా నాయకుడు లేదా పౌరుడు చేసిన ఆరోపణలు ఇలా ఉన్నాయనో, ఫలానా పత్రాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయనో, ప్రభుత్వ ఫైళ్ల ప్రకారం మీపై ఆరోపణలు ఇలా ఉన్నాయి’ అని చెప్పి, వాటికి వివరణ అడిగేలా కమిషన్ షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని హైకోర్టు కీలక ఆక్షేపణ. ఇది రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.
కేసీఆర్, హరీశ్‌ను సాక్షులుగా పిలిచిన కమిషన్ విచారణ సమయంలో ‘మీపై ఫలానా అభియోగం ఉంది. సదరు ఆరోపణలకు మీ వివరణ ఏమిటి?’ అని కూడా కోరలేదు. కోయిల ముందే కూసినట్లుగా ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేయకముందే ఇద్దరు బీఆర్ఎస్ అగ్రనేతలపై చేసిన ఆరోపణలకు తగ్గట్టుగానే ప్రభుత్వానికి 2025 జులై 31న నివేదిక సమర్పించింది. కొబ్బరికాయ, బెల్లం, గుండ్రాయి తీర్పుల విషయంలో అందెవేసిన రేవంత్‌రెడ్డి..చట్ట నిబంధనలను తుంగలోతొక్కే మరో అడుగు వేశారు. చట్టప్రకారం కమిషన్ నివేదిక అందుకున్నా దానిని శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించాక ఏంచేయాలో తీర్మానం చేయాలి. ఇలా చేయకుండా ఆగస్టు 4న మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించిన అంశాలను మాత్రమే సీఎం వెల్లడించారు.
కొండను తవ్వి ఎలుకను పట్టిన కమిషన్ నివేదికకు కాస్తాకూస్తో ఉన్న నిబద్ధతకు నీళ్లొదిలేశారు. ఉన్నతాధికారుల కమిటీ ద్వారా కమిషన్ నివేదికను (60 పేజీల సంక్షిప్త నివేదికను) మీడియా ద్వారా బట్టబయలు చేయటమే కాకుండా వెబ్సైట్లో పొందుపర్చిన 25 రోజులకు అంటే ఆగస్టు 31న శాసనసభలో ప్రవేశపెట్టారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని మాత్రమే అసెంబ్లీ నిర్ణయించింది. దీనిపై అప్పటికే హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై వెలువరించిన తీర్పుతో ప్రభుత్వానికి బైర్లుకమ్మింది. హైకోర్టు తీర్పు కేవలం ఒక నివేదికను కొట్టివేయటం మాత్రమే కాదు, ప్రభుత్వ ధోరణిని దుమ్మెత్తిపోసింది.
కేసీఆర్, హరీశ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చెవి కోసిన మేకలా దుమ్మెత్తిపోసే విమర్శలకు తగ్గట్టుగానే కమిషన్ నివేదికలో ఏకపక్షంగా తీవ్ర పదజాల అభియోగాలు ఉన్నాయని హైకోర్టు తీర్పులో కీలకాంశం. మొత్తం ప్రాజెక్టు వ్యవహారంలో విచ్చలవిడిగా, విధానపరమైన, ఆర్థిక అవకతవకలు జరిగాయని కమిషన్ ఎలా నిర్ధారణకు వచ్చిందని ప్రశ్నించింది. కమిషన్ వ్యాఖ్యలు కేసీఆర్, హరీశ్ వ్యక్తిగత ప్రవర్తనను దెబ్బతీయటమేనని చెప్పింది. మూడు బరాజ్‌ల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణల్లో కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని కమిషన్ ఎలా తేల్చుతుందని ధర్మాసనం నిలదీసింది. వారి ప్రమేయం, ఆదేశాలే మూడు బరాజ్‌ల నిర్మాణాల్లో అవకతవకలు, నష్టానికి కారణమని కూడా కమిషన్ చట్టవ్యతిరేకంగా తేల్చిందని తప్పుపట్టింది. అప్పటి సీఎంగా కేసీఆర్ తనకు నచ్చినట్లుగా మేడిగడ్డ వద్ద బరాజ్‌ను నిర్మించాలని ముందుగానే నిర్ణయించి మొండిగా వ్యవహరించారని కమిషన్ నిర్ధారణ చేయటం, వారిద్దరికీ అధికారులు సహకరించారని పేర్కొనటం చెల్లదన్నది.
ప్రైవేటు సంస్థలకు అనుచితంగా ప్రయోజనం చేకూర్చటానికి ప్రజాధనం దుర్వినియోగం చేయాలన్న ఉద్దేశం కేసీఆర్‌కు ఉన్నదని కమిషన్ ఏ ఆధారంగా నిర్ధారణకు వచ్చిందని నిగ్గదీసింది. ఈ పరిశీలనలు కేసీఆర్ ప్రవర్తనకు, ప్రతిష్టకు కచ్చితంగా హానికరమైనవేనని చెప్పిన తీర్పు కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టు అని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.
విచారణ కమిషన్ చట్టం సెక్షన్ 8బీ కింద నోటీసు జారీ చేయకుండా కేసీఆర్, హరీశ్‌పై అభియోగాలను కమిషన్ ప్రశ్నించకుండా, ఆరోపణలు చేసిన వాళ్లను వారిద్దరూ ప్రశ్నించి, క్రాస్‌ఎగ్జామ్ చేసే అవకాశం లేకుండా కమిషన్ నివేదిక ఇవ్వటం చెల్లదని పేర్కొన్నది. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ముందు వారిద్దరూ హాజరయ్యారని, వాళ్లకు అన్నీ తెలుసు కనుక నోటీసు జారీ చేయనక్కరలేదన్న ప్రభుత్వ వాదనను కొట్టేసింది. కేసీఆర్, హరీశ్‌ను విచారణకు హాజరుకావాలని నోటీసు జారీ చేయటానికి ముందు ఇతర సాక్షుల వాంగ్మూలాల నమోదు సమయంలోగాని, లిఖితపూర్వక సాక్ష్యాల సేకరణలోగాని వారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయం, ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, సంఘం పరిధి, పరిపాలనా అనుమతులు పొందారా? లేదా? ప్రాజెక్టు ప్రణాళిక, మేడిగడ్డ బరాజ్‌లో లోపాలకు కారణాలపై సెక్షన్ 8బీ కింద నోటీసు ఇవ్వకుండా కమిషన్ ఇచ్చిన నివేదిక వారిద్దరి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేదని తేల్చింది.
కమిషన్ నివేదికలో కనిపించిన పదజాలం, కేసీఆర్, హరీశ్‌పై తీవ్ర ఆరోపణలు, తప్పు చేశారంటూ ఖరారు చేసే తీరు.. కమిషన్ చట్ట నిబంధనలకు వ్యతిరేకమని, ‘తీర్పు’ మాదిరిగా కమిషన్ తేల్చటం రాజ్యాంగ వ్యతిరేకమని వెల్లడించింది. సాక్షులుగా విచారణకు పిలిచి అప్పటికే వారిపై ఉన్న అభియోగాల గురించి నోటీసుల్లో ప్రస్తావన చేయకుండా కమిషన్ ఏకపక్షంగా నివేదిక ఇచ్చినట్లు తేల్చింది. విచారణ కమిషన్ చట్టంలోని సెక్షన్ 8(బీ), సెక్షన్ 8(సీ) ప్రకారం ఇతరులు ఏమైనా ఆరోపణలు చేసుంటే.. వాటిని నోటీసుల్లో విధిగా పేర్కొన్నాకే కమిషన్ విచారణ జరుపాలి. కానీ కేసీఆర్, హరీశ్‌కు రాజ్యాంగం కల్పించిన 21 అధికరణం ద్వారా లభించిన హక్కులకు కమిషన్ భంగం కలిగించిందని వెల్లడించింది. ఈ వ్యవహారంలో వారిద్దరికీ బలమైన న్యాయ ఆధారం కల్పించింది. ఆ రెండు సెక్షన్ కింద నోటీసులు ఇవ్వకపోవటం, సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం కల్పించకపోవటంతో ఇద్దరు నేతల హక్కులకు ఉల్లంఘన జరిగిందని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదని, దీని ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టరాదని కూడా తేల్చింది.
విచారణ పేరుతో రాజకీయ అజెండాలను అమలు చేయాలనుకుంటే, అవి కోర్టుల ముందు నిలబడవని కేసీఆర్, హరీశ్‌పై వచ్చిన ఆరోపణలపై హైకోర్టు తీర్పు స్పష్టం చేస్తున్నది. న్యాయం ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియను వక్రీకరిస్తే, కోర్టులు సరిదిద్దుతాయని హైకోర్టు తాజా తీర్పు స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 కింద జీవించే హక్కులో గౌరవం, పరువు కూడా అంతర్భాగం. ఆ హక్కును ప్రభావితం చేసే ముందు తగిన రక్షణ ఇవ్వకుండా, విచారణ పేరుతో వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం చట్టబద్ధం కాదని తీర్పుచెప్పింది.
వాస్తవానికి కాళేశ్వరం వ్యవహారంపై ప్రభుత్వానికి గతంలో ఒకసారిగట్టి ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని విచారణ కమిషన్ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ కమిషన్‌ను మార్చాలని ఆదేశించటంతో జస్టిస్ ఘోష్ నేతృత్వంలో మరో కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కమిషన్ నిజాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. సాక్షులను నిందితులుగా పరిగణించే తరహాలో ఆరోపణలు చేయడానికి వీల్లేదు. తీర్పులు చెప్పే అధికారం లేదు. నిజనిర్ధారణ మాత్రమే చేయాలి. అత్యంత కీలకమైన ‘గీత’ను కమిషన్ దాటింది. రాజకీయ విమర్శల శైలిని కమిషన్ నివేదికలో ప్రతిబింబించటాన్ని హైకోర్టు ఆక్షేపించింది. విచారణ పేరుతో వ్యక్తిత్వహననం జరుగకూడదని ఇచ్చిన సందేశం ప్రభుత్వానికి చెంపపెట్టని నిపుణుల అభిప్రాయం.
-శ్రీనివాస్ పెమ్మరాజు ,99597 72949