Khushbu Sundar | లెజెండరీ దర్శకుడు భారతీరాజా మరణ వార్తతో దక్షిణాది సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. భారతీరాజాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ సందేశాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటి కుష్బూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. భారతీరాజా మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆమె పేర్కొన్నారు. తమిళ సినీ పరిశ్రమ ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన పోస్గ్లో కుష్బూ మాట్లాడుతూ.. మనందరికీ ఎంతో ఇష్టమైన దర్శకుడు భారతీరాజా ఇక లేరనే వార్త నమ్మలేకపోతున్నాను. ఆయన మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన రూపొందించిన సినిమాలు ఒక ప్రమాణంగా నిలిచాయి. భవిష్యత్తులో వచ్చే తరాల దర్శకులకు, సినిమా ప్రేమికులకు ఆయన చిత్రాలు ఒక మార్గదర్శకంగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు. భారతీరాజాతో తనకు ఉన్న ఓ మధుర జ్ఞాపకాన్ని కూడా కుష్బూ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నన్ను రెండు జడలతో చూపిస్తూ ఒక అందమైన సినిమా చేయాలని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. ఆ ప్రాజెక్ట్ గురించి చాలాసార్లు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆ కల ఇక ఎప్పటికీ నెరవేరని కలగానే మిగిలిపోయింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
కుష్బూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అభిమానులు కూడా ఆమె పోస్ట్‌కు స్పందిస్తూ భారతీరాజా గురించి తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. గ్రామీణ నేపథ్య కథలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడిగా భారతీరాజా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రేమ, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన ఆయన చిత్రాలు తరతరాల ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. భారతీరాజా మరణంతో ఒక గొప్ప దర్శకుడి యుగానికి ముగింపు పలికినట్లైందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన సృష్టించిన పాత్రలు, తెరకెక్కించిన కథలు, తెలుగు-తమిళ సినీ పరిశ్రమలకు అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అభిమానులు పేర్కొంటున్నారు.