దావోస్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఐటీ నిపుణులు, ఉద్యోగులను దారుణంగా అవమానించారు. ఇందుకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆ వ్యాఖ్యలు కేవలం ఐటీ నిపుణులను అగౌరవపర్చడమే కాకుండా ఐటీ హబ్‌గా ఉన్న తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయంగా మసకబార్చేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతూ ప్రపంచంలో భారతదేశాన్ని సగర్వంగా నిలబెట్టేందుకు ఐటీరంగం తోడ్పడుతున్నది. అటువంటి రంగంలో పనిచేసే ఉద్యోగులు, నిపుణులను అవహేళన చేయడం ఐటీరంగం గొప్పదనాన్ని అవమానించడమే అవుతుంది.
మానవ వనరుల రంగంలో అధ్యాపకుడిగా, అభ్యాసకుడిగా ప్రతి వృత్తికి అత్యంత ప్రాధాన్యం ఉంటుందని విశ్వసించే వ్యక్తిగా సూచిస్తున్నాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (ఐపీఈ)లో అధ్యాపకుడిగా, పలు ఐటీ కంపెనీల్లో మానవ వనరుల విభాగాధిపతిగా పనిచేసిన వ్యక్తిగా ఏ ఉద్యోగ మూ అల్పమైనది, ఏ వ్యక్తీ అల్పుడు కాదని భావిస్తాను. ఐటీ ఉద్యోగులు, పరిశ్రమ కార్మికులు లేదా రైతులు ఇలా ప్రతీ ఒక్క రంగంలోని శ్రమ జీవులు సమాజ పురోగతికి తోడ్పడుతా రు. దేశ నిర్మాణం, ఆర్థికవ్యవస్థ బలోపేతంలో వారందరి భాగస్వామ్యం ఉంటుంది. మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ చెప్పినట్టుగా ఏ పనీ అల్పమైనది కాదు. మానవీయతను ఉన్నతంగా నిలిపే ప్రతీ శ్రమకు గౌరవం, ప్రాముఖ్యం ఉన్నాయి. ఆ పనిని అత్యంత నాణ్యతతో చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన చెప్పాడు.
జాతి పిత మహాత్మా గాంధీ కూడా శ్రమ గౌరవాన్ని గురించి గొప్పగా చెప్పారు. నూలు వడికే రాట్నంలోని చక్రం శ్రమ గౌరవానికి ప్రతీక అని అన్నారు. మనిషి శ్రమ, ఆత్మనిర్భరత, గౌరవానికి చిహ్నమని తెలిపారు. ఆ చక్రం సామాన్యమైన పరికరమే అయినా సమాజాన్ని మార్చగల శక్తిని కలిగి ఉందని కొనియాడారు. ఏ పని కూడా చిన్నది కాదని, ప్రతీ వ్యక్తి నిజాయితీ, అర్థవంతమైన కృషిలోనే గౌరవం దాగి ఉన్నదని వివరించారు. ఈ మాటలు ఐటీ రంగానికి, నిపుణులకు కూడా వర్తిస్తాయి. చరఖా చక్రం మాదిరిగానే ఐటీ ఉద్యోగులు, నిపుణులు నిశ్శబ్దంగా తమ సృజనాత్మకత, నిబద్ధతతో పారిశ్రామిక అభివృద్ధితో పాటు లక్షల జీవితాల్లో వెలుగులు నిం పుతున్నారు. ఆర్థిక ప్రగతి, సాంకేతిక మార్పు, దేశాభివృద్ధికి దోహదపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు, నిపుణులను పనివాళ్లు అని సంబోధిస్తూ తాజాగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వారి శ్రమగౌరవాన్ని చులకన చేయడంతో పాటు వారు మన రాష్ట్రం, దేశానికి చేస్తున్న సేవలను తక్కువ చేసి చూపినట్టుగా ఉన్నాయి. కష్టపడే ఉద్యోగులు, నిపుణుల మనోబలాన్ని దెబ్బతీయడమే కాకుండా ఐటీపరంగా అద్భుతమైన అనుకూల వాతావరణం కలిగిన, అత్యున్నత స్థాయి మేధోసంపత్తి కలిగిన తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయి. ఐటీ రంగాన్ని, నిపుణులను అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా ఐటీరంగ అభివృద్ధి అనేది న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటూ మాట్లాడారు. అభివృద్ధికి, సాంకేతికత పెంపొందించేందుకు పాటుపడిన వారి కృషిని సీఎం రేవంత్‌రెడ్డి అర్థం చేసుకోలేదని స్పష్టమవుతున్నది. సంపద సృష్టి, ఆర్థికాభివృద్ధి, సామాజిక పరివర్తనలో ఐటీరంగం కీలక పాత్ర పోషిస్తున్నది. కానీ ఆ రంగానికి తగిన గౌరవం, గుర్తింపును ముఖ్యమంత్రి ఇవ్వకపోవడం శోచనీయం.
ముఖ్యమంత్రిగా సమాజంలోని అట్టడుగు వర్గాలతో పాటు అందరి పట్ల గౌరవం, బాధ్యతతో మెలగాలి. కానీ దేశ ప్రగతికి, ప్రపంచ పురోగతికి దోహదపడుతున్న ఓ రంగం మొత్తంపై ఆయ న అసహనం, అహంకారం, అవగాహన రాహిత్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ధోరణి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఏ నాయకుడికీ సరికాదు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల తీవ్రతను, దుష్ప్రభావాలను గుర్తించి, ఆయన లోతుగా ఆలోచించాలి. ఐటీ వృత్తి నిపుణుల నమ్మకాన్ని, మనోధైర్యాన్ని నిలబెట్టేందుకు, కష్టపడి పనిచేసే తెలంగాణ పౌరుల పట్ల నిబద్ధతను నిరూపించుకునేందుకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఐటీరంగం పనిచేసే తీరును, గొప్పదనాన్ని గురించి అవగాహన కలిగించుకునేందుకు సమయం కేటాయించుకోవాలి. ఆయన ప్రసంగాల్లో సున్నితత్వం లోపించింది. కాబట్టి ఆయన మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి.
ప్రసంగాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఐటీరంగం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుతున్నది. తద్వారా సంక్షేమ పథకాల అమలుకు దోహదపడుతున్నది. దేశ నిర్మాణంలో కీలకమైన ఐటీ రంగ నిపుణులకు కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి, వారిని అవమానించడం సరికాదు. నాయకత్వానికి జ్ఞానం, గౌరవం, ప్రతీ వ్యక్తి, ప్రతీ వృత్తి విలువ ను గుర్తించగలిగే సామర్థ్యం ఉండాలి. ముఖ్యమంత్రిగా అలా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలవడం ఆయన బాధ్యత. కానీ, ఆయన చేసిన దురదృష్టకరమైన వ్యాఖ్యల వల్ల తెలంగాణ పరువు, ప్రతిష్ఠలు దెబ్బతింటున్నాయి. కాబట్టి, తెలంగాణ ప్రజలు, ఐటీరంగ నిపుణులకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే.