ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 12న రవీంద్రభారతిలో మాట్లాడుతూ గొప్పమాట ఒకటన్నారు. ‘తాను అబద్ధాల ప్రాతిపదికన రాష్ర్టాన్ని నడపబోనని, వాస్తవాలను చెప్పి తెలంగాణను ప్రగతిపథంలోకి నడిపించేందుకు కృషిచేస్తా’నని ప్రకటించారు. అటువంటి స్పష్టతకు ఆయనను అభినందించాలి. ఆ మాట విన్నప్పుడు ఒకటనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి ఎప్పటికైనా తన ‘ఆత్మకథ’ రాయాలి. లేదా మరెవరి చేతనైనా తన ‘జీవిత కథ’ను రాయించాలి. ఎందుకంటే, గొప్పవారందరి విషయంలోనూ అది జరుగుతుంది. ఆ కథలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శనం చేస్తూ స్ఫూర్తిదాయకమవుతాయి. అయితే, తను రాసినా, ఇతరులు ఆ పనిచేసినా అందుకు ఉపయోగపడేట్టు ఆయన ‘ఆత్మకథ’ నోట్స్ మాత్రం ఎప్పటికప్పుడు రాసి పెట్టుకోవాలి.
ఇప్పుడు రేవంత్‌రెడ్డి రవీంద్ర భారతి ప్రకటనకు వెళ్దాము. ఆ సందర్భం ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేయటం. టీచర్లు పిల్లలకు చెప్పే ముఖ్యమైన నీతి పాఠాలలో ఒకటి, ‘అసత్యములాడరాదు’ అని. బహుశా దానిని దృష్టిలో ఉంచుకునే కావచ్చు ఆయన అబద్ధాల ప్రాతిపదికన రాష్ర్టాన్ని నడపబోనన్నారు. అట్లాగే, టీచర్లు ఉద్యోగులు గనుక వారి జీతభత్యాల చెల్లింపు సమస్యల విషయాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు వారికే అప్పజెప్తామని, దేనికెంత పంచాలో వారే చెప్పాలన్నారు. సమస్యలకు కారణం గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్ల రుణభారం మిగిల్చిపోవటమని మరొక మారు యథావిధిగా ఆరోపించారు. మరొక ఐదు రోజుల తర్వాత రూ.8 లక్షల కోట్లకు పెంచారు.
ఈ సందర్భాలను పురస్కరించుకొని భవిష్యత్తులో తన ‘కథ’ కోసం నోట్స్ ఈ విధంగా రాసుకోవాలి. ‘నేను 2025 మార్చి 12న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో టీచర్ల నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో మాట్లాడుతూ, అబద్ధాల ప్రాతిపదికన రాష్ర్టాన్ని నడపబోనని అన్నాను. అదే సభలో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పుచేసిందని కూడా అన్నాను. అట్లా ఎన్నిసార్లు అబద్ధమాడానో లెక్కలేదు. కానీ, అప్పులు అందులో సుమారు సగం మాత్రమేనని రిజర్వ్ బ్యాంక్ అప్పటికే గణాంక వివరాలతో స్పష్టం చేసింది. అయినప్పటికీ నేను ఆ స్పష్టీకరణ తర్వాత కూడా అదే అబద్ధం చెప్తూ పోయాను. నన్ను బట్టి నా ఇతర మంత్రులు, మా కాంగ్రెస్ నాయకులు కూడా అదే పని చేశారు. 7 లక్షల కోట్లు నిజం కాదని నాకు రవీంద్రభారతి కార్యక్రమం కన్నా ముందే కూడా తెలుసు. కానీ, రాజకీయాలలో ఎన్నికలు గెలవటం కోసం అబద్ధాలు ఆడవలసివస్తుందని, ప్రజలు కూడా అబద్ధాలను నమ్మి ఓటేసే పరిస్థితి ఉందని నేను గతంలో ఒకసారి అన్నాను. అదే మాట ప్రకారం టీచర్లను నమ్మించేందుకు రవీంద్ర భారతిలో మరొకమారు అబద్ధమాడాను. నా అబద్ధాలు నమ్మనందున టీచర్ల ఎమ్మెల్సీకి మేము ఓడిపోయామన్నది వేరే విషయం. అయినప్పటికీ ఆ తర్వాత కూడా ఆడాను. బహుశా ఇంకా తర్వాత సైతం ఆడవలసి రావచ్చునని అప్పుడే అనుకున్నాను. ఎందుకంటే, నిజం ఒప్పకున్నట్లయితే ప్రజల నుంచి హామీల అమలు ప్రశ్నలు మరింత తీవ్రమవుతాయి. అందుకు సమాధానం నా వద్ద గాని, నా ప్రభుత్వం వద్ద గాని లేదు. మరొకటి చెప్పాలి. అప్పులు ఏడు లక్షల కోట్లు కాదని, దానిపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నాయకులు పలుమార్లు సవాలు చేశారు. కానీ, నేను ముందుకురాలేదు. అందుకు కారణం చెప్పనక్కరలేదు. అందరూ గ్రహించగలదే. రవీంద్ర భారతిలో ఉండిన టీచర్లకు సహజంగానే అర్థమై ఉంటుంది.
అదే కార్యక్రమంలో నేను ఉద్యోగుల వేతనాల చెల్లింపు సమస్యలను ప్రస్తావించాను. గత ప్రభుత్వం వేతనాలు, డీఏలు వగైరా సమయానికి చెల్లించటం లేదని ఎన్నికల ప్రచారంలో చాలా చెప్పాను. అధికారానికి వచ్చినట్టయితే అన్ని చెల్లింపులు సక్రమంగా చేస్తామన్న హామీ ఇచ్చి గెలిచాను. ఇప్పుడు ఆ ప్రకారం చేయలేకపోతున్నాను. ఆ నిందను గత ప్రభుత్వంపైకి తోయక తప్పదు కదా. కనుక, కొంతకాలంగా చేస్తున్న ఆ పనిని రవీంద్ర భారతిలోనూ చేశాను. అట్లా చేయటం వల్ల నా అప్పుల అబద్ధానికి బలం చేకూరుతుంది. కానీ, హామీల అమలుకు ఇపుడు టీచర్లు, ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారన్నది వేరే విషయం.
నా ఆత్మకథలో వివరించవలసిన విషయాలు ఇటువంటివి అనేకం ఉన్నాయి. అవన్నీ ఇక్కడ రాయటం సాధ్యం కాదు గనుక ముఖ్యమైనవి కొన్ని చెప్తాను. అన్నింటికన్న ముందు మాట్లాడుకోవలసింది, అబద్ధాల ప్రాతిపదికన రాష్ర్టాన్ని నడపబోనని రవీంద్రభారతిలో ఎంతో గంభీరంగా ప్రవచించిన నేను, అసలు అధికారానికి వచ్చిందే అబద్ధాల ప్రాతిపదికన. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన గురించి ఏడు లక్షల కోట్ల అప్పులన్న తరహాలోనే తోచిన అబద్ధమల్లా ఆడటం ఒక్కటైతే, అమలు చేయలేమని తెలిసినా అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు ఆరు గ్యారెంటీల పేరిట ఎడాపెడా అబద్ధపు హామీలివ్వటం మరొకటి. ప్రజలు అబద్ధాలను నమ్ముతారని కూడా అప్పుడు అన్నాను. అటువంటి మోసపూరిత విద్యలలో హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలలో అనుభవం గడించిన పండితులు మాకందులో తోడ్పడ్డారు. ఇటువంటి అబద్ధాలు, వాటితో అధికారం సంపాదించటం, వాటిని అమలుచేయకపోయినా చేశామంటూ మరిన్ని అబద్ధాలు, బుకాయింపులు, ఎదురుదాడులు మాకు మొదటి పదిహేను మాసాల కాలంలో మామూలు అయిపోయాయి.
మేము కనుగొన్న మరొక పద్ధతి గురించి కూడా చెప్పాలి మీకు. అది, ప్రజల చేత పాత అబద్ధాలను మరిపించేందుకు కొత్త అబద్ధాలాడటం. ఇటువంటి నీతి గురించి చాణక్యుడు అయినా రాసినట్లు లేదు. ఆరు గ్యారెంటీలను మరిచిపోయేందుకు మరింత ఆకర్షణీయమైన సరికొత్త గ్యారెంటీలివ్వటం ఆ పద్ధతి. అబద్ధపు గ్యారంటీలు మా ఎన్నికల విజయంలో అన్నింటికన్న ముఖ్యపాత్ర పోషించినందున, నేను రాసే ‘ఆత్మకథ’లో, లేదా ఇతరులెవరైనా రాయగల నా జీవిత చరిత్రలో ఇదొక ప్రముఖమైన ప్రత్యేక అధ్యాయం కావాలి. మా ఆరాధ్యనీయుడు గాంధీజీ జీవిత కథ ‘మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్స్’ సరసన ‘మై ఎక్స్పెరిమెంట్స్ విత్ అన్ ట్రూత్స్’ పేరిట అది కలకాలం నిలిచిపోవాలి. అట్లా జరుగకుండా పది వేల మంది కేసీఆర్లైనా ఆపలేరన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఆ విధంగా ‘నా కథ’, ముందుతరాలకు అనుసరణీయమవుతుంది. నా కథను నేను గాక మరెవరైనా రచించిన పక్షంలో ఈ మాటలను వారు ప్రత్యేకంగా నొక్కి చెప్పాలి. గోబెల్స్ బతికి ఉంటే ముందుమాట ఆయనతో రాయించేవాడిని.
ఇందుకు పొడిగింపుగా రాయవలసిన మరొక విషయం ఉంది. హామీల అమలు గురించిన అబద్ధాలను నేను మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి పట్టుదలగా ప్రచారం చేశాను. అక్కడి హామీల అమలు నా బాధ్యత అన్నాను. వాటిని అక్కడి ఓటర్లు నమ్మారు కూడా. మహారాష్ట్రలో మా పార్టీకి పోయినసారి కన్న తక్కువ సీట్లు వచ్చి ఓడిపోయి ఉండవచ్చుగాక. అదేవిధంగా ఢిల్లీలో గత రెండుసార్ల వలె ఈసారి కూడా సున్నా సీట్లు మేము తెచ్చుకొని ఉండవచ్చుగాక. కానీ, నేను ఓటర్లను భ్రమ పెట్టేందుకు అబద్ధాలు ఆడకపోతే, వాటిని ఓటర్లు నమ్మి ఉండకపోతే, కేవలం మా రాహుల్‌గాంధీని నమ్మి ఆ మాత్రపు ఓట్లు అయినా వేసి ఉండేవారు కాదని నేను అనేక వర్గాల నుంచి విన్నాను. పైన సూచించిన అధ్యాయంలో ఇదికూడా భాగం కావాలి. అయితే నాకొక ధైర్యం ఎప్పుడూ ఉండటం గురించి చెప్పుకోవాలి. ఎన్నికల గ్యారెంటీలు అమలుకు వీలుకానివని, అధికారం కోసం చెప్పే అబద్ధాలని మా ఢిల్లీ నాయకత్వానికి ముందే తెలుసు. కనుకనే, అవి అమలుగాక ప్రజలు గగ్గోలెత్తుతున్నా వారు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు తప్ప, చిన్నపిల్లవాడు ఫోన్‌చేసినా పరుగెత్తుకురాగలమని, ఢిల్లీలో మేమే మీ ప్రతినిధులమని చేసిన ఆర్భాటాల ప్రకారం ఇటువైపు మొహమైనా చూపలేదు. అనగా వారికి అబద్ధాల గురించి తగు అవగాహన ఉందన్నమాట. పెద్ద నాయకులను ఏమీ అనగూడదు గాని, మేము తోడు దొంగలమనాలి. నా ధీమా కూడా అదే. నాకూ, వారికీ కావలసింది ఏదో ఒకవిధంగా అధికారం సంపాదించటమే గదా.
అబద్ధాలు ఒకసారి ఒక ధోరణిగా మారినప్పుడు ఇక అన్నీ అదే మార్గంలో సాగాలని లేదు గాని, సాగించుకునే వెసులుబాటు మాత్రం నాకు లభించింది. ఆ మాటను మొదటి 15 నెలల కాలంలోనే కనుగొన్న నాకు ఎంతో ఆనందం, కించిత్ గర్వం కలిగాయి. అందుకే, ‘అబద్ధాలు నడిపే అధికారం’ అన్నది ఒకసారి నమూనాగా స్థిరపడిపోవటంతో రవీంద్రభారతిలో ఒకవైపు అబద్ధాలు చెప్తూనే, అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపబోనంటూ ధైర్యంగా ప్రకటించగలిగాను. అదొక కళ. అది చతుష్షష్ఠి కళలలో ఉందో లేదో గాని, లేనట్లయితే చేర్చవలసి ఉంటుంది. అది నా కాంట్రిబ్యూషన్.
ఇదే అబద్ధాల సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గత కొద్ది రోజులలో మరొక రెండు పనులు చేశాము. బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి ఈ నెల 14వ తేదీన అసెంబ్లీలో స్పీకర్‌ను ఏకవచనంతో సంబోధించకున్నా సంబోధించినట్టు, రికార్డులలో లేకపోయినా, ఆ పనిచేసినట్టు అబద్ధపు ఆరోపణ చేస్తూ, అధికారం ఉంది గదానని ఆయనను సస్పెండ్ చేశాం. ఆ మాటలు అన్నట్టు రికార్డయిందేమో చూపమన్నప్పటికీ చూపలేదు. లేక, అట్లా లేదు గనుక చూపలేకపోయామనుకోవచ్చు. అబద్ధాలను మెజారిటీలు నిజాలుగా మార్చటం ఎప్పుడూ ఉన్నదే కదా. అదే నీతిని పాటించాము మేము. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడిపే సమర్థత, నడపగలనన్న ఆత్మవిశ్వాసం నాకు పూర్తిగా ఉన్నాయనేందుకు కేసీఆర్ విషయమై నేను చూపజూసిన చమత్కారాలు తార్కాణం. నేను ఈ నెల 12న అదే రవీంద్రభారతి కార్యక్రమంలో యథేచ్ఛగా మాట్లాడుతూ, ‘మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉన్నదని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉన్నదని విర్రవీగితే, స్ట్రెచర్ మీదకు పంపించిన్రు, ఇట్లే చేస్తే తర్వాత మార్చురీకి పోతరు’ అనే కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాను.
దానిపై అదే 12వ తేదీ నుంచి విమర్శలు చెలరేగాయి. అవి 13న, 14న, 15వ తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగాయి. బీఆర్ఎస్ వారు 14న ఒక పోలీస్‌స్టేషన్‌లో నాపై ఫిర్యాదు కూడా చేశారు. నేను 15న అసెంబ్లీలో స్పందిస్తూ, నేను ఉద్దేశించింది వ్యక్తిగతంగా కేసీఆర్‌ను కాదు, ఆయన పార్టీనని వివరణ ఇవ్వబూనాను. అది అసత్యపు వివరణ కాని పక్షంలో ఆ వివరణను విమర్శలు వచ్చిన 12వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యాహ్నం నాలుగు రోజుల కాలంలో ఎప్పుడైనా ఇచ్చి ఉండేవాడిని. కేసీఆర్ గురించి, ఆయన పాలన గురించి ఎన్నికల ప్రచారం మొదలుకొని మొత్తం 18 నెలలపాటు నూటొక్క విషయాలపై ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేశాను గదా నేను.
అయితే, నా సంస్కారం నాగరికమైనది అయినట్టు నా మాటలలో ప్రతిఫలించటం మొదటినుంచీ లేదని, లోపాలకు సవరణలు చేసుకొనే లక్షణం కూడా లేదని అందరికీ తెలిసిందే. పైగా అన్నది అనలేదని బుకాయించటం కూడా సంస్కారంలో భాగమైపోయింది. నా భాష సంస్కారవంతమైనది కాదని నాకు తెలుసు గనుకనే అసెంబ్లీ ఫలితాలు వెలువడిన వెంటనే నేను మా కార్యకర్తలతో మాట్లాడుతూ, ఇదివరకటి భాషను నా నుంచి ఇకముందు ఆశించవద్దని కోరాను. కానీ, ఒక వ్యక్తికి మొదటినుంచి అబ్బిన భాష, సంస్కారం సాధారణంగా పోయేవి కావు. అందువల్ల తర్వాత 15 మాసాలుగా, ఇంతవరకు దేశంలోని ఏ ముఖ్యమంత్రి విషయంలోనూ లేనివిధంగా, అందరూ ముక్కున వేలువేసుకొని రోతపడే తీరుగా నా భాష మార్పులేకుండా కొనసాగుతూనే వస్తున్నది. నేను మాత్రం అది నాకు గర్వకారణమని నమ్ముతాను. ఓటుకు నోటు కేసు నాకు మెడల్ అయినట్లు గానే. నా జీవిత కథను మరెవరైనా రాసిన పక్షంలో, వారు నా వ్యక్తిత్వం, భాష, సంస్కారం ఇట్లా ఎందుకు రూపుదిద్దుకున్నాయో పరిశోధించినట్లయితే, నా గురించి అందరితో పాటు నాకు కూడా తగిన అవగాహన ఏర్పడుతుంది. నాకది జన్మజన్మల సార్థకథ అవుతుంది కూడా.’