మనసా వాచా కర్మణా అని త్రికరణ శుద్ధి గురించి చెప్పారు పెద్దలు. మనసులో ఉండేదే బయటకు చెప్పాలి.. బయటకు చెప్పేదే చేయాలి అని దీనర్థం. ఇక చిత్తశుద్ధి అనేది లేనివారు చెప్పేదొకటి, చేసేదొకటి. ఇందుకు మన రేవంత్ సర్కారును మించిన ఉదాహరణ దొరకదు. మూసీ నది విషయంలో వేస్తున్న కుప్పిగంతులు అందుకు సరిగ్గా సరిపోతాయి. ముందుగా మూసీ సుందరీకరణ అని అన్నారు. ఆ సుందరీకరణలో ఏముంటుందో తెలియదు. దాని గురించి ఆలోచిస్తుండగానే మాటమార్చి కాదు కాదు పునరుజ్జీవమని అన్నారు. ఇప్పుడు అదీ కాదని తేలిపోయింది. కర్కషంగా హైడ్రా డైనోసార్లను తోలి ఇండ్లను కూలుస్తున్నప్పడు కొందరు ఇది వందరోజుల హామీల వైఫల్యం నుంచి దృష్టి మరల్చేందుకేనని అంచనా వేసుకున్నారు. కానీ, పేదల ఇండ్లను కూల్చడం వెనుక పెద్దలకు రియల్ ఎస్టేట్ అప్పనంగా కట్టబెట్టే కుట్ర ఉందని తాజాగా తేటతెల్లమైంది. ప్రపంచ బ్యాంకుకు సమర్పించిన ప్రాథమిక ప్రాజెక్టు రిపోర్టులో మాయల పకీరు ప్రాణం దాగున్నట్టు బహిర్గతమైంది. ఇదంతా కార్పొరేట్ సుందరీకరణ, లాభార్జన పునరుద్ధరణ తప్ప మరొకటి కాదని తెలిసిపోతున్నది. మనసులో ఉన్నది లబ్ధి, చెప్పింది పునరుద్ధరణ, చేసింది కూల్చివేతలు. మూసీనది మురికిని కడిగితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఆ మురికిలో కాసులవేటకు వెంపర్లాడటం విడ్డూరం. పుల్లాపుడకా చేర్చి నది ఒడ్డున గూడు కట్టుకున్న పేదలను దిక్కులేని పక్షులను చేయడం అంతకంటే ఘోరం.
కాంగ్రెస్ అసలు చెప్పింది ఏనాడు చేసిందని? అరచేతిలో స్వర్గం చూపింది. అందరికీ అన్నీ అని ఊరించింది. ఇదివరకటి సర్కారు సంక్షేమం కోసం కల్పిస్తున్న సాయాలను పెంచుతామని అడ్డగోలుగా హమీలిచ్చింది. మొండిచెయ్యి చూపడం కాంగ్రెస్కు మొదటి నుంచీ అలవాటే. అందుకే తనను నమ్మరేమోనని ‘గ్యారెంటీ’ అనే తోకను తగిలించింది. అదీ నమ్మరేమోనని దేవుళ్ల మీద ఒట్లదాకా పోయింది. అధికార దాహం వేయించిన వింతవేషాలు ఫలించాయి. మోసపోయి గోస పడుతున్న జనం ఏమైపోతేనేం. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనే నీతి వంటబట్టించుకున్న కాంగ్రెస్ ఒట్టు తీసి గట్టున పెట్టి మూసీలో మునకేసి కాసుల వేటకు పాల్పడుతున్నది.
తెలంగాణ సాధకుడు కేసీఆర్ ఏనాడూ కేవలం తాయిలాల హామీల మీద గెలవలేదు. మనసా వాచా కర్మణా తెలంగాణ విజయాన్ని కాంక్షించి నిలిచి గెలిచారు. రాజకీయ చతురత చూపి ఓట్ల యుద్ధంలో ఎత్తుకు పైఎత్తు వేసి విపక్షాలను చిత్తు చేశారు. ఆ మాటకు వస్తే హామీలు ఇవ్వలేదని కాదు. ఇచ్చినవీ నెరవేర్చారు. ఇవ్వనివీ చేసి చూపారు. అంతేతప్ప కాంగ్రెస్ తరహాలో కల్లబొల్లి కబుర్లు చెప్పి కన్నుగప్పి ఓటు కాజేయలేదు. రెండు ద్వితీయ విజయాలే అందుకు నిదర్శనం. మూడో విజయం ఎందుకు చేజారిందో ఇప్పుడు ప్రజలకు బాగా ఎరుకైంది. ఊరూరా బద్దలవుతున్న తిరుగుబాట్లే ఇందుకు సాక్ష్యం. ఇచ్చిన హామీలు తూచ్ అనడమే కాకుండా ధనదాహంతో మూసీని కార్పొరేట్లకు కానుకగా సమర్పించుకుంటున్న కబంధహస్తాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఓటుపోటుతో బుద్ధి చెప్పడం ఖాయం.