మాటలకు మామిడిచెట్ల పూతలు
చేతలకు మొద్దువారుతున్న కొడవళ్లు
కామారెడ్డి డిక్లరేషన్ని గద్దలెత్తుకపాయే
మార్చురీ గదుల్లో కమిటీలు కులగణనలు
అబద్ధాల నాటకాలకు తెరతీయండి
ముఖాలకు రంగులు పులమండి
బంగారు కిరీటాలకు మెరుగులు దిద్దండి
రాజకీయాలెప్పుడూ మోసాలేనా…
మేమెప్పుడూ ప్రేక్షకులుగానేనా…
చాతాడు తెగి బావిలో పడ్డట్టు
ఏ పునాదికీ రాళ్లెత్తని వాళ్లు
రాజులై భోగిస్తున్నారు
ములుగర్రలతో రథాలను ఉరికిస్తున్నారు
శతాబ్దాలుగా పెద్దోళ్ల ముంగిటిలో వెలుగులు
పేదల వాకిళ్లలో చీకట్లు
నమ్మకాల గోడలకు పర్రెలు
వాడిపోయిన పూల ఆశయాలు
స్వప్నాల మొగిలిపొదలో బుసబుసలు
చరిత్రలకో పేజీలేకుండా
చెరువుల్లో అలరాకుండా
రచ్చకట్టిన కుర్చీ దక్కనీయకుండా
బీసీల ప్రాతినిధ్యాల్ని అణచేస్తున్నారు
ఎన్నాళ్లీ బురద రాజకీయాలు?
కాల్చిన చింతోల కాయలు
గంపకెత్తిన ఎండు చాపలు
కడవల కొద్దీ కల్లు ముంతలు
కాలిన చేతుల్లో రాతికడీలు
బీగాలు పెట్టెలు పూసలు అద్దాలు
విరిగిన మగ్గాలు తొవ్వలేని గొర్ల మందలు
వొట్టి యాదులేనా?
ఎంతకాలమీ వంచనలు
బీసీలంటే బువ్వకుండలు
కల్లుగీతలు కుంపటీలు కొలుములు,
వడ్ల దాకలి చాకలిరేవులు
మంగలి అసిపెలు.
కొండంత సమూహ శక్తులు
స్వాతంత్య్రం తెచ్చుకున్నది
రాజ్యాంగం రాసుకున్నది కొందరికేనా
కుర్చీలు మీకే కాదు
మాకూ కావాలి!
ఏ లెక్కలూ తప్పవు
బీసీ జనాభా లెక్కలు తికమక
నలభై రెండు శాతం రిజర్వేషన్లు
స్థానిక కోటాకై కదలండి
చట్టసభలల్లో సమానతకై
కలాలను ఝళిపించండి
బహుజన కళలకు గళమెత్తండి
దేశం వర్ణమాలకు వ్యాకరణం మనమే
– వనపట్ల సుబ్బయ్య 9492765358