‘నగరానికి మన కూతుర్ని పంపి తప్పు చేశామా? అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. మన ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వారిని ప్రజలు క్షమించరు. ఈ పరిస్థితిని మారుద్దాం. ప్రభుత్వాన్ని మారుద్దాం. ఈసారి మోదీ ప్రభుత్వం తెద్దాం’ 2014లో అధికారంలోకి రావడానికి ముందు బీజేపీ ఇలా ఊదరగొట్టింది. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు మనకొద్దంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసింది. ఆ తర్వాత బీజేపీ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. అయితే, ఆడపిల్లల విషయంలో పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా.. మరింత దిగజారింది.
భారత కీర్తి ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికలపై సగర్వంగా చాటిన మహిళా రెజ్లర్లకు దేశ రాజధానిలో ఎదురైన అవమానం చూసిన అమ్మాయిల తల్లిదండ్రులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. తమ పిల్లల్ని క్రీడల్లోకి పంపాలంటే పరిపరి విధాలా ఆలోచిస్తున్నారు. న్యాయం కోరుతూ మే 28న జంతర్‌మంతర్ నుంచి కొత్త పార్లమెంటు భనవం వరకు మార్చ్ చేపట్టిన రెజర్లను పోలీసులు ఎత్తిపడేసిన తీరు చూశాక పునరాలోచనలో పడ్డారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ వారు చేసిన ఆక్రందనలు గాల్లోనే కలిసిపోయాయి. అక్కడితో ఆగలేదు సరికదా బాధితులపైనే పోలీసులు తమ ప్రతాపం చూపించారు. అరెస్టులు, తోపులాటలు, లాఠీచార్జీలతో విరుచుకుపడ్డారు. వారిని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సరిపోరన్నట్టు సీఆర్పీఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దింపారు. చివరికి ఒత్తిళ్లో, బెదిరింపులో తెలియదు కానీ బాధిత రెజ్లర్లు తమ ఆందోళన విరమించుకున్నారు. ఇక విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని ప్రకటించారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి హత్య కేసు సహా పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడు. అయితేనేం.. మేమొస్తే ఆడపిల్లలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటామన్న బీజేపీ.. సొంత ఎంపీ కావడంతో అతడిపై ఈగ వాలకుండా చూసుకుంటున్నది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. లైంగిక వేధింపులు ఎపుడో జరిగితే ఇప్పుడెందుకు ఆందోళనకు దిగారని, దానివెనక ఉన్న మతలబేంటని నిలదీస్తూ బాధితులను మరింత కష్టపెట్టారు కొందరు. అంతేకాదు, రెజ్లర్ల ఆందోళనకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నమూ జరిగింది.
2002 గుజరాత్ అల్లర్లలో ఐదు నెలల గర్భవతి అయిన బిల్కిస్ బానో, ఆమె తల్లీ, సోదరిపై అత్యాచారానికి తెగబడి, ఆమె కండ్లముందే ఆమె మూడేండ్ల చిన్నారి సహా కుటుంబాన్ని దారుణంగా హత్యచేసి జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడిచిపెట్టడంతోనే ఆడపిల్లల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో దేశ ప్రజలకు అర్థమైంది. అంతేనా.. నిందితులందరూ అగ్ర కులాల వారని, సంస్కారవంతులని, దేశభక్తులని గోద్రా బీజేపీ ఎమ్మెల్యే సీకే రౌల్జీ చేసిన వ్యాఖ్యలు వెగటు పుట్టించాయి.
హర్యానా మంత్రి, జాతీయ హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్‌సింగ్ ఓ మహిళా కోచ్‌ను లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఆయనను వెంటనే క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అయినా సరే హర్యానా ముఖ్యమంత్రి, బీజేపీ నేత మనోహర్‌లాల్ ఖట్టర్ వాటిని తోసిపుచ్చారు. ఆరోపణల ఆధారంగా తొలగించబోమని, సిట్ వేస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు. హత్రాస్ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితుల్లో ముగ్గురు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ ఘటనలపై నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా మాట్లాడుతూ.. వేధించేవారికి, లైంగిక వేధింపులకు గురిచేసే వారికి ప్రభుత్వం బహిరంగంగా మద్దతునిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
జనవరి 2020లో కతువాలో ఎనిమిదేండ్ల బాలికపై అత్యాచారం, హత్యకేసులో నిందితులకు మద్దతుగా బీజేపీ నాయకులు క్యాండిల్ మార్చ్ నిర్వహించిన విషయాన్ని అన్నీ రాజా గుర్తు చేశారు. అత్యాచార నిందితుడిపై పోలీసు చర్యను ‘జంగల్ రాజ్’గా మంత్రులు అభివర్ణించారు. రెజ్లర్లను కించపరిచే ప్రయత్నంలో ప్రభుత్వం వారిపై నకిలీ వార్తలు ప్రచారం చేసిందని, బెదిరింపులకు దిగిందని మానవహక్కుల ప్రచారకర్త షబ్నమ్ హష్మీ పేర్కొన్నారు. దేశానికి బంగారు పతకాలు సాధించినప్పుడు వారితో కలిసి ఫొటోలు దిగిన మోదీ.. న్యాయం కోసం పోరాడినప్పుడు మాత్రం వారిని దేశ వ్యతిరేకులుగా ముద్రవేశారని అన్నీ రాజా చెప్పుకొచ్చారు. వారు తమ నిరసనను విరమించుకునేంతగా బెదిరింపులకు గురయ్యారని అన్నారు.
వేధింపులకు గురిచేసే వారికి, ప్రాణాలు హరించే వారికి ప్రభుత్వ యంత్రాంగం నుంచి రక్షణ లభిస్తున్నదని, కానీ వేధింపులు ఎదుర్కొంటున్న వారికి మాత్రం ఎలాంటి రక్షణ లేదని అన్హద్ (యాక్ట్ నౌ ఫర్ హార్మోనీ అండ్ డెమోక్రసీ) సహ వ్యవస్థాపకురాలు, హత్యకు గురైన ఫైర్‌బ్రాండ్ యాక్టివిస్ట్ సఫ్దర్ హష్మీ సోదరి షబ్నమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో మహిళలు రెండో తరగతి పౌరుల్లా జీవించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. బ్రిజ్‌భూషణ్‌సింగ్‌కు లభిస్తున్న రక్షణ, బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల వంటివి లింగ సమానత్వం కోసం శతాబ్దాలుగా జరుగుతున్న పోరాటం కొనసాగించాలని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. రెజ్లర్లకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవచ్చని, రేపిస్టును అరెస్ట్ చేయమని ఆదేశించవచ్చని, కానీ బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించడం ద్వారా ద్వారాలు మూసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
– గురులింగాచారి కొత్తుర్తి