చాలా రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్న రైతులకు మొన్న అర్ధరాత్రి ఇనుపబూట్ల శబ్దం వినపడకుండా ఉంటుందా? వెలుగులు ఆపేసి, నోళ్లు కట్టేసి, గడప, గడపలోకి తుపాకులు తొంగి చూస్తుంటే.. ఆ పల్లెల గుండెలు ఎంత గాయపడి ఉంటాయో కదా..? ఏడాది కిందట ఇంటింటికీ గ్యారెంటీ కార్డులు
పంచిన రేవంత్‌రెడ్డి.. రాత్రంతా ప్రతి రైతుకు బేడీలు పంపిస్తుంటే వారు ఎంత బాధపడి ఉంటారో కదా. లగచర్లలో జరిగిన రైతుల నిరసన ఉద్యోగుల గాయాలకు దారితీయడం అవాంఛనీయమే. ప్రభుత్వ ఉద్యోగులపై దాడిని ఖండించాల్సిందే. అయితే, ఆవేదన అనుకోకుండా అంటించిన ధర్మాగ్నికి కుట్రకోణం
ఆపాదించి, నిర్బంధం నీడలో అనుకున్నది నెరవేర్చుకునే నక్కజిత్తులమారితనమే అందరికీ అసహ్యం కలిగిస్తున్నది.
సొంత ఇలాకాలో కల్లోలం సృష్టించి, కర్షకుల కన్నీరును పారించిన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ‘మీ కన్నబిడ్డలా తోడుంటా’నని నమ్మబలికితే.. కల్వకుర్తి నుంచి వచ్చినా రేవంత్‌ను కొడంగల్ కడుపులో పెట్టుకున్నది. మళ్లొక్కసారి దీవిస్తే నియోజకవర్గానికి పెద్ద పదవి వస్తుందని చెప్పగానే భుజానికెత్తుకొని అందలమెక్కించారు అక్కడి ప్రజలు. ఆ పెద్ద పదవే ప్రాణసంకటంగా దాపురిస్తుందని వారు ఆనాడే ఎలా ఊహించగలరు..?
తెలంగాణ ఏర్పాటుకు మునుపు ఉమ్మడి పాలమూరు జిల్లా పడిన వేదన, ఆ జిల్లా వాసుల వలసల బతుకులు అందరికీ తెలిసిందే. అందులోనూ కొడంగల్ నియోజకవర్గానిది మరింత దుర్భిక్ష పరిస్థితి. కొసలో విసిరేసినట్లు, ప్రభుత్వాల కంటికే కానరానట్లుగా కొడంగల్ కన్నమ్మ కష్టాలు మోసింది. అప్పులు పెంచిన అమాయకులు, ఆకలి మింగిన బక్క జీవుల కేంద్రం కొడంగల్. గిరిజనులు, దళితులు, బలహీనవర్గాలు అత్యధికంగా నివసించే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి మాట దేవుడెరుగు ధైర్యంగా జీవించడమే గగనం. అలాంటి ప్రాంతాన్ని పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం పచ్చదనానికి, ప్రజా వికాసానికి వేదికగా మలిచింది. రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ తదితర 450 సంక్షేమ పథకాలు బీదరికంతో తలపడుతున్న కొడంగల్ ప్రజానీకానికి కొండంత భరోసాను కల్పించాయి. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలతోనే సరిపెట్టకుండా నాటి కేసీఆర్ ప్రభుత్వం కొడంగల్‌ను కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఇంకా ఎన్నో విధాల ఆసరాగా నిలిచింది.
గిరిజనులైన లంబాడీలు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో కొడంగల్ కూడా ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి.. ‘మా తండాలో మా రాజ్యం’ అనే దశాబ్దాల వారి స్వయం పాలనా ఆకాంక్షను సాకారం చేశారు కేసీఆర్. ఆ నియోజకవర్గంలోని ఒక్క ఉమ్మడి బొమ్మరాస్ పేట్ మండలంలో దాదాపుగా 76 లంబాడీ తండాలుంటే, వాటిలో 23కు పైగా తండాలు గ్రామ పంచాయతీలుగా కొలువుదీరాయి. ప్రతి తండాకు రోడ్లు, త్రీ ఫేస్ కరెంట్ సరఫరా, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగునీరు తదితర అనేక శాశ్వత కీలక మౌలిక సదుపాయాలను కేసీఆర్ సర్కార్ కల్పించింది.
నియోజకవర్గ కేంద్రంలో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలతో పాటు సేవాలాల్ బంజారా భవన్ నిర్మించి, గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం బాటలు వేసింది. లంబాడీలతో పాటు మొత్తం కొడంగల్ నియోజకవర్గానికే కొత్త చరిత్రను దిద్దింది బీఆర్ఎస్ సర్కార్. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నియోజకవర్గంలోని 100కు పైగా పెద్ద చెరువుల్లో పూడిక తీసి వాటిని పునరుజ్జీవింపజేసింది.
అంతేకాదు, దౌల్తాబాద్ పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి పరిచింది. తద్వారా ఈ చెరువుల కింద వేలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి, సిరులు పండాయి. పదేండ్లలోనే వికారాబాద్ జిల్లాలో అత్యధిక వరి పండించే నియోజకవర్గంగా కొడంగల్ కొత్త పొద్దుకు సద్దిమూటగా మారింది. రైతుల కష్టానికి అండగా ఉండేందుకు కొడంగల్ కేంద్రంలో నూతనంగా మార్కెట్ యార్డును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. అలాగే మాతాశిశు మరణాల రేటు అత్యధికంగా నమోదవుతూ, దుఃఖాన్ని కంటు న్న కొడంగల్‌లో 100 పడకల దవాఖాన, కోస్గి లో 50 పడకల ఆసుపత్రులను ప్రారంభించింది. అంతేకాదు, గ్రామ పంచాయతీలుగా అవస్థలు పడుతున్న కొడంగల్, కోస్గి పట్టణాలను నూతన మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కొడంగల్ పట్టణానికి నీటి ఇక్కట్లు లేకుండా చేసేందుకు శాశ్వత నీటి సరఫరా వ్యవస్థను గులాబీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దుద్యాల, గుండుమాల్, కొత్తపల్లి అనే మూడు నూతన మండలాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు, ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచింది.
మూలకు విసిరేసినట్లు, ఏ ఎదుగుదల లేని కొడంగల్ పల్లెలు పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎంతో పురోగతి సాధించాయి. ఊరూరా రహదారులతో పాటు మన్నెగూడ నుంచి మాతా మాణికేశ్వరి ఆలయం వరకు రాష్ట్ర హైవేను పూర్తి చేయడంతో రవాణా సౌకర్యాలే కాదు, భూము ల విలువ వందల రెట్లు పెరిగాయి. పదేండ్లకు మునుపు ఎకరానికి రూ.5 లక్షలు కూడా పలకని భూముల విలువ 2023 నాటికి ఎకరం రూ.30-50 లక్షలకు చేరుకున్నది. కొడంగల్ పట్టణానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఎకరా ధర రూ.2 కోట్లకు ఎగబాకడంతో అక్కడి భూములు బంగారమయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా శాశ్వత కరువు విముక్తి కోసం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల ను 95 శాతానికి పైగా కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసింది. తద్వారా కొడంగల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 1.30 లక్షల ఎకరాలకు సాగునీరందేలా చేసింది. ఇలా ఎన్నో విధాల అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిని పారించినట్లే.. కొడంగల్ నియోజకవర్గాన్ని సైతం ప్రగతి పథాన నడిపించింది కేసీఆర్ సర్కార్. అట్టడుగున ఉన్న కొడంగల్ నియోజకవర్గాన్ని ఆకాశమే హద్దుగా ఎదిగేందుకు బాటలు వేసిన బీఆర్ఎస్ అక్కడి జనానికి ధర్మ యోధుడవుతుందే తప్ప, రేవంత్ రెడ్డి ఆరోపించినంత మాత్రాన కుట్రదారిగా కనిపించదు కదా..!
పదేండ్ల కేసీఆర్ పాలనలో కుదుటపడి, విలువను సంతరించుకున్న కొడంగల్ ప్రాంతాన్ని ఏడాదిలోపే కొట్లాటకు కేంద్రంగా రేవంత్‌రెడ్డి సర్కార్ మార్చడం విషాదం. పాలు పోసిన చేతికే కాటు వేసినట్టు.. గెలిపించిన నియోజకవర్గ రైతులనే దురాశతో మట్టికరిపించాలని అనుకోవడం ఏ రాజకీయ సంస్కృతికి నిదర్శనమో కాంగ్రెస్ పాలకులకే తెలియాలి. ‘మా భూమి మాకేనని’ తిరగబడ్డ రైతులపై కుట్రదారులని అభియోగం మోపి హత్యాయత్నం సహా అనేక కేసులు నమోదు చేయించి, జైలుకు పంపించడం దుర్మార్గపు పాలనకు నిదర్శనం.
నిజానికి అసలు కుట్రదారులెవ్వరు..? 12 వేల ఎకరాల భూమి సేకరించి, ఫార్మాసిటీ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ఫార్మాసిటీని రద్దు చేసి, ఫార్మా కంపెనీ పేరిట కొడంగల్ రైతుల నుంచి విలువైన 1200 ఎకరాలను సేకరించాలని అనుకోవడమే కుట్ర కదా? కంపెనీల ఏర్పాటు అవసరమే. కానీ, కుటుంబ సభ్యులను కార్పొరేట్ శక్తులుగా మలిచేందుకు, వేలాది మంది ఫార్మర్ల ఫ్యామిలీలపై ఫార్మా బాంబులేయడం అమానవీయ సర్కార్ విధానాలకు అద్దం పడుతున్నది కదా..!
అయినా ‘చేరుకోలేనంత దుర్భేద్యం కాను, కలుసుకోలేనంత దూరం కాను’ అంటూ గప్పాలు కొట్టిన ముఖ్యమంత్రికి సొంత నియోజకవర్గ రైతుల ఆవేదన వినేందుకు మనసు రాకపోవడం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో అందరికీ అర్థమైపోయింది. ఆరు నెలల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న కొడంగల్ అన్నదాతల వేదన వినేందుకు కూడా మనసురాని ముఖ్యమంత్రిని ఏ పేరుతో పిలవాలి..? అల్లుడి కళ్లలో ఆనందం కోసం అన్నదాతలను కారాగారంలోకి నెట్టివేసే ప్రభుత్వం ఎంత కర్కశమైనదో కదా..! ప్రాణం కంటే విలువైన వారసత్వ పొలాలు వదిలేయాలంటే రైతులు ఎంత విలవిల్లాడుతారో పోలీస్ పటేల్ వారసత్వం ఉన్న పాలకులకు అర్థమవుతుందని అనుకోవడం మూర్ఖత్వమే. ఇప్పటికీ కనీసం సొంత నియోజకవర్గ రైతులనే కనికరం కూడా లేకుండా, తల్లి పిల్లలను ఎత్తుకెళ్లి కటకటాల్లోకి నెడుతున్నారు. చివరికి రైతుల పక్షాన మాట్లడినందుకకు మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి పైశాచికత్వం ప్రదర్శించారు. ఇదేం పాలన..? సర్కారే రెక్కలు చాపిన పంజరమై రైతులోకాన్ని చెరసాలల పాలుచేస్తున్నది.
ఆవేదనతో కూడిన రైతాంగం పోరాటం చూస్తున్నప్పుడు ఏడాది కిందట ఇంద్రవెల్లి స్మారక స్థూపం పరిసరాల్లో సభ పెట్టి రేవంత్ రెడ్డి పలికిన ప్రగల్భాలు ఎవరికైనా గుర్తుకురాకుండా ఉంటా యా? జీవనాధారమైన తమ భూములు అన్యాక్రాంతమవుతున్న అన్యాయానికి నిరసనగా 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో నిరసన సభకు ఆదివాసీ రైతులు పిలుపునిచ్చారు. ఆ సభపై నిషేధం విధించిన నాటి కాంగ్రెస్ సర్కార్ వెల్లువలా తరలివస్తున్న రైతాంగంపై తూటాల వర్షం కురిపించింది.
ఆ పోరాటంలో అమరులైన వారి స్మారకార్థం నిర్మించిన స్థూపం ముందు నిలబడి నాడు రేవంత్‌రెడ్డి పలికిన ప్రగల్భాలు గుర్తొస్తే నవ్వు, దానివెంటే బాధ కలుగకమానవు. నాటి ఇంద్రవెల్లి దుర్మార్గం నుంచి నేటి లగచర్ల దాష్టీకం వరకు రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీది రాబందు దృష్టికోణమేనని తేటతెల్లమైంది. నాడు ఇంద్రవెల్లి దుర్ఘటనకు ముందు, తర్వాత ఆ ప్రాంతంలో అమలైన నిర్బంధమే నేడు కొడంగల్ నియోజకవర్గమంతా అమలవుతున్నది. కొడంగల్‌లో మాత్రమే కాదు, రాష్ట్రమంతటా ప్రకటిత, అప్రకటిత పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నది. బాధితులను కలిసే వీలులేదు, నిరసనలకు చోటేలేదు.
ఆట, మాట, పాటపై అక్రమ కేసుల ఆంక్షల వల వేసేసింది కాంగ్రెస్ సర్కార్. ఇంత దుర్మార్గపు పాలన కొనసాగుతుంటే.. కూనమనేని సాంబశివరావు, కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సర్కార్‌కు కాపలాగా కొడవలి పట్టుకొని నిలబడుతుండటమే విచిత్రంగా ఉంది. బండి సంజయ్ లాంటి నేతలు రేవంత్‌రెడ్డి చేతిలో కమలం పెట్టి కథలు చెబుతుండటమే ఆవేదన కలిగిస్తున్నది. అందుకే ఇప్పుడు తెలంగాణ తల్లడిల్లుతున్నది.
వివాదమే విధానంగా అలవర్చుకొని, వికాసమెరుగని పాలనను సాగిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అబాసుపాలైపోయింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. కానీ, ఆగమైపోతున్నది పోరాడి తెచ్చుకున్న స్వరాష్ట్రం. అందుకే ఇప్పుడు నాలాంటి తెలంగాణవాదులకు బాధ కలుగుతున్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
– డాక్టర్ ఆంజనేయగౌడ్