తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. పాలమూరుకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆయన ప్రెస్‌మీట్‌ను చూసి రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రివర్గం మొత్తం ఆగమాగమైపోయింది. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టు వెంటనే ఒకరి తర్వాత ఒకరు మీడియా సమావేశాలు నిర్వహించి బొక్కబోర్లా పడ్డారు.
అధికారంలో తామే ఉన్నామనే విషయాన్ని కాంగ్రెస్ ఇంకా తెలుసుకోవట్లేదు. తెలంగాణ అభివృద్ధిని గాలికొదిలేసి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సర్కార్ పనిచేస్తున్నట్టు అనిపిస్తున్నది. కాంగ్రెస్ పాలకులు పాలనను పక్కనపెట్టి కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలడమే పనిగా పెట్టుకున్నారు. ఈ మధ్య కేసీఆర్‌ను చూసినా, ఆయన పేరును తలచినా చాలు వాళ్లు జంకుతున్నారు. అందుకే ప్రస్ట్రేషన్‌లో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.
కేసీఆర్.. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మనీషి. తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన వ్యక్తి. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఊరుకోరు. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లపాటు తెలంగాణ నీటి వైపు ప్రత్యర్థులు కన్నెత్తి చూసే సాహసమూ చేయలేదు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను వాడుకోకుండా తన గురువు చంద్రబాబుకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఈ ద్రోహంపై బీఆర్ఎస్ పోరు జెండా ఎత్తుకోగానే నీళ్లు నములుతున్నారు. తెలంగాణ నీళ్లపై అవగాహన లేని వ్యక్తి ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ రైతాంగం చేసుకున్న దురదృష్టం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏది పడితే అది మాట్లాడితే దాన్నే నిజమని కేంద్రంలోని పెద్దలు నమ్ముతారు. గతంలో ఒకసారి ‘కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్వోసీ ఇవ్వండి. ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి’ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన తీరుని చూసి సాగునీటిరంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటివాటా ఉండేది. కానీ, తమకు 45 టీఎంసీలు చాలని కేంద్రానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ రాసి తెలంగాణ నీటిహక్కులను కాలరాసింది. అప్పటికే ఆరు అనుమతులు వచ్చిన ఈ ప్రాజెక్టు డీపీఆర్ ఎందుకు వెనక్కి వచ్చింది? ఇదంతా కుట్రకోణంగానే కనిపిస్తున్నది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేద్దామనే ప్రయత్నంలో ఇది భాగమా? ఒకవేళ ఆ ఆలోచన మీకు ఉంటే మీరు చెరిపేస్తున్నది కేసీఆర్ ఆనవాళ్లను మాత్రమే కాదు, పాలమూరు ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా. అయినా ప్రజల హృదయాల్లో పెరిగిన వ్యక్తిని తగ్గించడం అంటూ ఉండదు. కేసీఆర్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎప్పుడో పెరిగారు. ఆయన కీర్తిని తగ్గించాలనుకోవడం అవివేకమే కాదు, అజ్ఞానం కూడా.
నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకే నాడు ఉద్యమం జరిగింది. సాధించుకున్న తెలంగాణలో సాఫీగా ప్రయాణం సాగుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మళ్లీ మన ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నాన్ని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలంతా ఏకమై తిప్పికొట్టే సమయం ఆసన్నమైంది.
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాలు బహిర్గతం అవుతుండటం, ఒక్కొక్కటిగా కాంగ్రెస్ బండారాలు బయటపడుతుండటం, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కుదురుకునే సమయం ఇద్దామని కేసీఆర్ ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. పాలమూరు విషయమై కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టగానే కాంగ్రెస్ నాయకులు తేలు కుట్టిన దొంగల్లా ఆగమాగమయ్యారు. ఆరు గ్యారెంటీల పేర తాము మోసపోయామని ప్రజలు తెలుసుకున్నారు. ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసాలను కేసీఆర్ వివరిస్తే రేవంత్ రెడ్డికి అంత అక్కసు ఎందుకు ? ప్రశ్నించడం ప్రతిపక్షం హక్కు కదా..! అబద్ధాలతో రేవంత్ రెడ్డి ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మభ్య పెట్టగలరు? అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా ఇంకా కేసీఆర్‌పై నిందలు వేస్తూ కాలం గడిపితే ప్రజలు నమ్ముతారనుకోవడం మూర్ఖత్వమే.
ఉద్యమం నుంచి నేటి వరకు ఎన్నో ఎత్తుపల్లాలను, కేసులను, నిర్బంధాలను దాటి వచ్చిన ధీరోద్ధారకుడు కేసీఆర్. తెలంగాణ పట్ల స్పష్టమైన అవగాహన, తెలంగాణ నీళ్ల విషయంలో అణువణువు తెలిసిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ పట్ల ఏమాత్రం అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టల వల్ల తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి దాపురించింది. మీ చేతగానితనం ఏపీ ప్రభుత్వానికి అదనుగా మారింది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం జోలికిరాని చంద్రబాబు.. తన శిష్యుడు రేవంత్ రెడ్డి అండ చూసుకొని తెలంగాణ నీళ్లను దోపిడీ చేసేందుకు బయలుదేరారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతున్న కేసీఆర్ నేడు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ రైతాంగం, మేధావులు, యువకులు, విద్యావంతులు ఆయనకు మద్దతుగా నిలవాలి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అందరం ఏకమై ఈ మాయదారి కాంగ్రెస్ నడ్డి విరిచి బుద్ధి చెప్పాలి.