పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరగడంతో ఆందోళనతో ఆ రాష్ట్రం అట్టుడుకుతున్నది. వైద్య విద్యార్థులు ప్రారంభించిన ఆందోళన కాస్త బీజేపీ శ్రేణుల రంగప్రవేశంతో రాజకీయ ఉద్యమంగా మారిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో పరోక్షంగా బెంగాల్ అత్యాచార ఘటనను ప్రస్తావించారు. దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగికదాడుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమపై లైంగికదాడులు జరుగుతున్నాయని అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన, ఒలింపిక్స్‌లో సత్తాచాటిన మన క్రీడాకారిణులు ఢిల్లీలో నడిరోడ్డుపైకి వచ్చి నెలల తరబడి ఆందోళన చేసినా చలించని ప్రధాని నరేంద్ర మోదీ.. పశ్చిమబెంగాల్ ఘటనపై స్పందించడం గమనార్హం.
సొంత పార్టీ బీజేపీ ఎంపీ సాగించిన అకృత్యాలను మహిళా క్రీడాకారిణులు బయటపెట్టినప్పుడు ప్రధాని అసలు స్పందించకపోవడం ఏ రకంగా రాజధర్మం అవుతుందో? మణిపూర్‌లో మహిళలను వివస్త్రను చేసి రోడ్డు మీద ఊరేగించడం దేశ గౌరవాన్ని పెంచడం అవుతుందా? మన దేశమే కాదు, అనేక దేశాలు స్పందించినా ప్రధాని మాత్రం మౌనంగానే ఉన్నారు. ఈశాన్య రాష్ర్టాల ప్రజలను దేశంలోని చాలామంది ‘చైనీయులు’ అని అనుకుంటారు. అక్కడివారు సైతం తాము భారతీయులం కాదన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. దేశం నివ్వెరపోయే విధంగా మణిపూర్‌లో అత్యాచారాలు జరిగినా, హింసాకాండలో వందలాది మంది మరణించినా ప్రధాని మౌనంగా ఉండటమంటే.. ‘మేం ఈ దేశం వాళ్లం కాదు’ అనే అభిప్రాయాన్ని వారిలో మరింత బలంగా నాటుకుపోయేలా చేయడమే. ఇలాంటి సందర్భంలోనే యావత్ దేశం వారికి అండగా ఉందని చెప్పడం ద్వారా వారికి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. కానీ, మతం, కులం ఆధారంగా ఓట్ల లెక్కలు చూసుకొని పాలకులు స్పందిస్తున్నారు. నిర్భయ ఘటన గుర్తుందా? 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో ఒక బస్సులో వైద్య విద్యార్థినిని ఆరుగురు ఇనుప కడ్డీతో దారుణంగా కొట్టి అత్యాచారం చేశారు. 13 రోజుల చికిత్స తర్వాత ఆమె మరణించారు. ఈ ఘటనను నిరసిస్తూ దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా ఉద్యమించారు. తర్వాత ఈ ఉద్యమంలోకి బీజేపీ అనుబంధ సంస్థలు ప్రవేశించాయి. 2012లో జరిగిన ఈ ఉద్యమంతో పాటు అన్నా హజారే జరిపిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఢిల్లీలో కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేశాయి. ఈ ఉద్యమాల కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోదీ ప్రధాని అయ్యారు. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవడంతో ఢిల్లీ పీఠంపై కేజ్రీవాల్ పాగా వేశారు.
ఢిల్లీ నిర్భయ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఉద్యమించి అధికారంలోకి వచ్చిన బీజేపీ అత్యాచారాల నివారణకు ఏమైనా చర్యలు తీసుకుందా? అంటే అలాంటిదేమీ లేదనే సమాధానమే వినిపిస్తుంది. గతంలో కంటే ప్రస్తుతం అత్యాచారాలు మరింతగా పెరిగిపోయాయని స్వయంగా ప్రధాని మోదీ తన ఉపన్యాసంలోనే చెప్పుకొచ్చారు. ప్రధాని చెప్పినట్టుగానే 2012 ఢిల్లీ ఉదంతం తర్వాత అత్యాచారాలు పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలు కూడా సూచిస్తున్నాయి. 2021 వార్షిక నివేదికలో 31,677 కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 86 అత్యాచారాలు జరిగాయి. 2020లో 28,046, 2019లో 32,033 కేసులు నమోదయ్యాయి.
తన రాజకీయ ప్రత్యర్థి అధికారంలో ఉన్న బెంగాల్లో జరిగిన ఘటనను బీజేపీ ఆ కోణంలో నుంచే చూస్తున్నది. నిర్భయ ఉదంతంపై జరిగిన ఉద్యమమే బీజేపీ అధికారం చేపట్టడానికి సహకరించింది. కనీసం అందుకు కృతజ్ఞతగానైనా అత్యాచారాల నివారణకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించాల్సింది. పదేండ్ల పాలన తర్వాత కూడా అత్యాచారాల గురించి ప్రధాని ఆవేదన చెందుతున్నారంటే మరి ఈ పదేండ్లు ఆయన ఏం చేసినట్టు?
రోజూ జరుగుతున్న వందల అత్యాచార ఘటనల్లో బెంగాల్ ఒకటి. దేశవ్యాప్తంగా ఎన్నో ఘోరాలు జరుగుతున్నా స్పందించని మోదీ దీనిపై స్పందిస్తారు. ఆ రాష్ట్ర గవర్నర్ హుటాహుటిన అత్యాచారం జరిగిన మెడికల్ కాలేజీకి వెళ్తారు. బీజేపీ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. అత్యాచారాలకు వ్యతిరేకంగా వారిలో ఈ స్పందన కనిపిస్తే అభినందించాలి. కానీ, సమస్యపై సానుభూతి కన్నా రాజకీయ ఆయుధం దొరికిందనే ఉత్సాహమే వారిలో కనిపిస్తున్నది. నిర్భయ ఉదంతం ద్వారా దేశంలో బీజేపీకి రాజకీయంగా ఎంతో కలిసొచ్చిందనేది వాస్తవం. ఇప్పుడు కూడా తన రాజకీయ ప్రత్యర్థి అధికారంలో ఉన్న బెంగాల్లో జరిగిన ఘటనను బీజేపీ ఆ కోణంలో నుంచే చూస్తున్నది. నిర్భయ ఉదంతంపై జరిగిన ఉద్యమమే బీజేపీ అధికారం చేపట్టడానికి సహకరించింది. కనీసం అందుకు కృతజ్ఞతగానైనా అత్యాచారాల నివారణకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించాల్సింది. పదేండ్ల పాలన తర్వాత కూడా అత్యాచారాల గురించి ప్రధాని ఆవేదన చెందుతున్నారంటే మరి ఈ పదేండ్లు ఆయన ఏం చేసినట్టు?
ఉమ్మడి రాష్ట్రంలో ఆయేషా మీరాపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను రాజకీయం లబ్ధి కోసం వాడుకున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆయేషా మీరా తల్లితో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేయించారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ఆ తల్లి టీడీపీ తరఫున ప్రచారం చేశారు.
తెలంగాణలో ఉప ఎన్నికలకు, ఆయేషా మీరా తల్లికి సంబంధం ఏమిటని చంద్రబాబుపై అప్పటి సీఎం వైఎస్ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం ఏమిటని అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును కడిగిపారేశారు. అత్యాచారాల ఘటనలను సైతం రాజకీయ పక్షాలు ఎలా వాడుకుంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఒక మచ్చుతునక.
రాష్ర్టాల్లో సైతం మహిళలకు సంబంధించిన అంశాలను చాలామంది రాజకీయ నాయకులు ఆయుధాలుగానే చూస్తున్నారు. అసలు మహిళల సమస్యలను తీర్చాలనే చిత్తశుద్ధి వారిలో లేనే లేదు. మహిళా కమిషన్లు ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీపై చేసే విమర్శలపై అత్యుత్సాహం చూపించడానికి బదులు మహిళల కోసం ఏమైనా సూచనలు చేయగలమా? అనే కోణంలో ఆలోచించాలి. పార్టీ కోసం ఆలోచించేవారు పార్టీల్లో లక్షలాది మంది ఉంటారు. లక్షల్లో వీరూ ఒకరిగా ఉండాల్సిన అవసరంలేదు. మహిళలపై జరిగే అత్యాచారాల నివారణకు ఏమైనా చేయగలమా? అని ఆలోచించాలి.