మరో పదిహేను రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరు నెలల క్రితం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన మరిచిపోయారు. ఎవరూ గుర్తు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, తమ సత్తా చూపిస్తామని మీడియా సమావేశంలో సవాల్ చేసినవాళ్లు తోక ముడిచారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఏమవుతుందో, ఫలితాలెలా ఉంటాయో అన్నది అందరికన్నా అధికారంలో ఉన్నవాళ్లకే బాగా తెలుసు. అందుకే వాళ్లు ఎన్నికల ఊసెత్తడం లేదు.
పదిహేను రోజుల మాట దేవుడెరుగు, ఇంకా మిగిలి ఉన్న మూడేండ్ల కాలంలో కూడా ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం కాంగ్రెస్ సర్కారుకు లేదు. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా పంచాయతీ ఎన్నికల నిర్వహణ పట్ల ఆసక్తి చూపదు. ‘ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు అందరూ మా వారే’ అని టీడీపీ ఆవిర్భావానికి ముందు సీఎంగా ఉన్న టి.అంజయ్య ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు ఎలాగూ పార్టీ రహితంగా జరుగుతాయి. అంజయ్య తరహాలో ‘గెలిచినవాళ్లంతా మా వాళ్లే’ అని చెప్పుకోనైనా ఎన్నికలు జరపవచ్చు. కానీ, రేవంత్ ప్రభుత్వం ఆ ధైర్యం కూడా చేయడం లేదు.
అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఇంతటి వ్యతిరేకతను గతంలో ఏ ప్రభుత్వమూ మూటగట్టుకోలేదు. ఆరు గ్యారెంటీల అమలు మాట దేవుడెరుగు, బీఆర్ఎస్ అమలుచేసిన పథకాలు సైతం ప్రజలకు అందడం లేదు. విద్యు త్తు కోతలను ప్రజలకు తిరిగి రుచి చూపిస్తున్నారు. హామీల అమలుకు దిక్కు లేదు. గత ప్రభుత్వ హయాంలోని పథకాలు అటకెక్కాయి. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే, కాంగ్రెస్ పాలకులు జంకుతున్నారు. ఓ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీలో కుక్క కూర్చున్న ఫొటో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది. సర్పంచ్ కుర్చీ ఖాళీగా ఉన్నా, అందులో కుక్కలు కూర్చున్నా ఎన్నికలు నిర్వహించేందుకు పాలకులు ఆసక్తి చూపరని అర్థమవుతున్నది.
పంచాయతీ ఎన్నికల మాట ఎలా ఉన్నా, అసలు రాష్ట్రంలో పాలన ఉందా? అనే అనుమానం కలుగుతున్నది. రిటైరై ఏడాది గడిచినా ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ దక్కడం లేదు. రిటైర్మైంట్ బెనిఫిట్స్ రూ.10 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, అప్పులు చేద్దామన్నా ఎవ్వరూ నమ్మడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభల్లో చెప్తున్నారు. ఓ వైపు అప్పు కోసం వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్లే దొంగలా చూస్తున్నారని గత నెలలోనే చెప్పిన ఆయన, రాష్ర్టావతరణ వేడుకల్లో మాత్రం 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తానని ప్రగల్భాలు పలికారు. నెల రోజుల్లో తెలంగాణలో ఏం మారిందో మరి? సీఎంకు ఉపన్యాసాలు రాసిచ్చే పీఆర్వోలు మారి ఉండవచ్చు. అంతేతప్ప, చెప్పులు ఎత్తుకెళ్లే దొంగల స్థితి నుంచి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చే పునాదుల నిర్మాణమే జరగలేదు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంగ్రెస్ హై కమాండ్‌ను మచ్చిక చేసుకోవడం, కాంగ్రెస్ సీనియర్ల బలహీనతలపై సీఎంకు బాగానే అవగాహన ఉండవచ్చు. కానీ, తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చే వ్యూహం, అవగాహన, ప్రణాళిక ఆయన వద్ద లేవు.
కోటి మంది మహిళలను వచ్చే మూడేండ్లలో కోటీశ్వరులను చేసేస్తామని హామీ కూడా ఇచ్చేశారు. కల్యాణలక్ష్మితోపాటు ఇస్తామన్న తులం బంగారం అడిగితే డబ్బులు లేవని చెప్తున్నారు. తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ, మూడేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారట. విజన్-2047 కూడా రేవంత్‌రెడ్డి సొంత డైలాగ్ కాదు. గతంలో విజన్-2020 అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు 2047 అంటున్నారు. రేవంత్‌రెడ్డి, ఆయన ప్రచార బృందం 2047 నినాదాన్ని సైతం బాబు బృందం నుంచి అరువు తెచ్చుకున్నది. మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఎలా ఉన్నా రేవంత్ పదవి మరో మూడేండ్లు ఉంటుందనే గ్యారెంటీ కూడా లేదు. కాంగ్రెస్‌లో ఏమైనా జరగవచ్చు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నించినా రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ లభించడం లేదనే వార్త బలంగా ప్రచారంలో ఉన్నది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎప్పుడంటే అప్పుడు రాహుల్‌గాంధీని కలుస్తున్న ఫొటోలు మీడియాలో వస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు కుటుంబంతోపాటు రాహుల్‌గాంధీని కలుస్తున్నారు. రేవంత్‌రెడ్డికి మాత్రం ఆ భాగ్యం దక్కడం లేదు. రేవంత్‌రెడ్డి మీద హైకమాండ్ పెట్టుకొన్న ఆశలు నీరుగారిపోవడం వల్లనే ఇలా జరుగుతున్నదనేది ప్రచారం. ఈ ప్రచారం రేవంత్‌రెడ్డికి తెలియదని కాదు.
‘నేను ఫొటోలు దిగి ఎవరికో నిరూపించాల్సిన అవసరం లేదు’ అని చెప్తున్నారు తప్ప, అపాయింట్మెంట్ సాధించి ఆ ప్రచారానికి మాత్రం ఆయన చెక్ పెట్టలేకపోతున్నారు. వచ్చే మూడేం డ్లు తన పదవికే గ్యారెంటీ లేని ముఖ్యమంత్రి 2047 నాటికి, అంటే ఇంకో 22 ఏండ్లలో ఏం చేస్తారో చెప్తున్నారు. ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే అదే అద్భుతం. చంద్రబాబు అయినా, మరో ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినా విజన్-2020, విజన్-2047 అని ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీ వారి చేతుల్లోనే ఉంటుంది. మరో 50 ఏండ్ల తర్వాత విజన్ గురించి కూడా వాళ్లు చెప్పుకోవచ్చు.
కాంగ్రెస్‌లో హై కమాండ్ ఇష్టాలే తప్ప, సొంత ఇష్టాయిష్టాలు ఏముంటాయి? ‘రాష్ట్ర అధికారిక చిహ్నంలోని చార్మినార్, కాకతీయ తోరణాలు రాచరికానికి చిహ్నాలు. నాకు నచ్చలేదు. వాటిని మారుస్తాను’ అని అధికారంలోకి రాగానే సీఎం ప్రకటించారు. హై కమాండ్ అక్షింతలతో ఆ మార్పు నిరవధిక వాయిదా పడింది. అధికార చిహ్నంపైనే అధికారం లేని సీఎం 2047 వరకు ఏం చేస్తారో చెప్పడం హాస్యాస్పదం. మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేద్దురు కానీ, ముందు ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించండి.
-బుద్దా మురళి