ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోవటం ఆంధ్రులెవరికీ ఇష్టం లేదు. ఎంతకాలం గడిచినా ఈ అయిష్టతకు శాంతి కలుగదు. దానికి కారణం హైదరాబాద్. అన్ని విధాలుగా అభివృద్ధికి అవకాశాలున్న ప్రాంతం కావటం వల్ల ఇక్కడ ఆంధ్ర పెట్టుబడిదారులు ఎన్నో సంస్థలను స్థాపించారు. అపుడు వారి పాలకులే ఉన్నందున హైదరాబాద్‌లో స్థిరాస్తులను పెంచుకున్నారు. రాజకీయ పెత్తనంతో పాటు వారి చేతుల్లోనే కొన్ని పత్రికలు, సినిమారంగం ఉన్నాయి. స్థానిక రాజకీయ నాయకులు, ఉద్యోగులను ఎదగనీయకుండా అడ్డుపడటమే కాకుండా తెలంగాణ భాషా సంస్కృతులను దెబ్బతీసే పని నిరాటంకంగా సాగింది. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక అప్పటివరకు క్షణాల్లో మంజూరయ్యే ఆయా వర్గాల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో వారికి కాలు, చేయి ఆడటం లేదు. తెలంగాణలో ఉండి ఇక్కడి వారికి దయతలిచి ఇవ్వటమే తప్ప..అడుక్కునే అలవాటు లేని బతుకులు వారివి.
2014 నుంచి తెలంగాణ ప్రజలు స్వీయ పాలనలో రాష్ట్ర పునర్నిర్మాణంలో నిమగ్నమయ్యారు. ప్రజల అవసరాలు తీర్చే దిశగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు, పథకాలను రచించి ఆచరణలో పెట్టింది. మరోవైపు విడిపోయిన తెలంగాణపై మళ్లీ తమ పెత్తనం ఎలా సాధించుకోవాలనే ఆలోచన ఆంధ్రా పాలకులను తొలుస్తున్నది. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కానీ, రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక బాబు రెండు కండ్ల సిద్ధాంతానికి మళ్లీ ప్రాణమొచ్చింది.
చంద్రబాబు రెండోసారి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయ్యాక 2024 జూలైలో అధికారికంగా తెలంగాణ ప్రజాభవన్‌ను సందర్శించారు. ఆయన రాకకు చాలా ఆర్భాటంగా ఏర్పాట్లు జరిగాయి. ఇక్కడి మంత్రులు పోటీపడి బాబుకు స్వాగతం పలికారు. తన శిష్యుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన ఆనందం బాబు ముఖంలో తొణికిసలాడింది. ఆంధ్ర పాలకుల పీడన నుంచి తెలంగాణను కాపాడిన ఉద్యమస్ఫూర్తి ఉన్నవారికి తల్లి కోడి జాగ్రత్తలు తెలుస్తాయి. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆడించిన ఆధిపత్య తోకలను కేసీఆర్ వెంటనే కత్తిరించి రాష్ట్రంలో మళ్లీ ఆ పోకడలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ రేవంత్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో మళ్లీ ఆంధ్ర ముద్రకు అడుగులు మొదలయ్యాయి.
పదేండ్లుగా లేని సినిమా అవార్డుల ప్రకటన మళ్లీ వచ్చింది. సినిమాలంటేనే నూటికి తొంభై మంది ఆంధ్రావాళ్లు. వీటికి గద్దర్ పేరు పెట్టి తెలంగాణ ప్రజల నోళ్లు మూయించారు. రవీంద్రభారతిలో ప్రభుత్వ లాంఛనాలతో జరుపవలసిన అవార్డు ప్రదానోత్సవాన్ని కోట్లు ఖర్చు చేసి వైభవంగా జరిపారు. తెలంగాణ అవార్డులంటే తెలంగాణ సినిమాలు, తెలంగాణ కళాకారులకు ఇవ్వాలి. కానీ వేదికపై ఉన్న వారిని, వారి సంతోషాన్ని చూస్తుంటే తెలంగాణ సొమ్ముతో ఆంధ్రుల కోసం పండుగ చేసినట్లుంది.
తెలంగాణ గద్దర్ సినీ అవార్డులకు సినిమాలు ఎంపిక చేసేవారు కూడా ఆంధ్రులే. తొలి ప్యానల్లో బీ నర్సింగరావు, అల్లాణి శ్రీధర్ తదితర తెలంగాణ దర్శకుల పేర్లు కనిపించాయి. చివరకు ఏమైందో తెలియదు.. తొలి అవార్డుల ప్రకటన చాలామంది తెలంగాణ సినీజీవులకు మనస్తాపం కలిగించింది. అలా వచ్చిన విమర్శలను సర్దుకొని ఈ యేడాది ఉగాది నాడు అందించిన అవార్డుల్లో తెలంగాణకు కొంత ప్రాధాన్యత పెరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు పిలిచిన చోటికల్లా వెళ్తున్నారు. వహ్వా అంటూ వారిని పొగిడేస్తున్నారు. కోకాపేటలో ఓ సినిమా హాల్ ప్రారంభోత్సవానికి వెళ్లి రేవంత్ సీఎం హోదాను తగ్గించారు. అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. ఏపీలో తెలంగాణ వారి విగ్రహాలు లేనప్పుడు హైదరాబాద్‌లో ఆంధ్రుల విగ్రహాలు ఎందుకు? అనే చర్చ కూడా వచ్చింది.
ఆ సందర్భంగా పత్రికల్లో వచ్చిన ప్రకటనల్లో నిర్వాహకులు ముఖ్యమంత్రి చిత్రాన్ని ఓ సినిమా కటౌట్లా మార్చేశారు. ఆంధ్ర నిర్వాహకుల ఫొటోలు పెద్దగా, ఇక్కడి రాష్ట్ర మంత్రుల ముఖాలు చిన్నగా ఇచ్చి తెలంగాణను అవమానపరచారు. రాజకీయ విశ్లేషకుడు ప్రొ.నాగేశ్వర్ ఇటీవల ఓ టీవీ చానల్ చర్చలో పాల్గొని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ కేంద్రమంత్రిని కలిసినట్లు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆనాటి తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. సమాచార తప్పిదం వల్ల అలా మాట్లాడానని బేషరతుగా ఆయన మన్నింపులు కోరారు. అంతటితో ఆ తంతు ముగిసినా ఆ తర్వాత ప్రొ.నాగేశ్వర్ ఇంటికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చారు. అయితే, ఆ వెంటనే తెలంగాణ పోలీసులు కూడా రావటంతో ప్రొ.నాగేశ్వర్‌కు ఆంధ్ర పోలీసులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. వాస్తవానికి ఈ విషయంలో ఏపీలోని ఇంద్రపాలెం, బందరు, సర్పవరం పోలీసుస్టేషన్లలో ఎఫ్ఐఆర్లు సిద్ధమయ్యాయి. వీటిలో రెండింటిలో ప్రొ.నాగేశ్వర్ పేరున్నది.
ఇదిలాఉండగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ నిర్వహించాలని సంకల్పించారు. తెలంగాణ ఆవిర్భావంపై వ్యతిరేక ప్రకటనలు చేసిన ఆంధ్ర బిడ్డ తెలంగాణపై ఏం మాట్లాడుతారు? నవ నిర్మాణమంటే అందులోని మతలబు ఏమిటి? ఇప్పటికే రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో పచ్చజెండాలకు జై కొడుతుంటే ఈ కొత్త సంకల్పమేమిటి? ఇదంతా చూస్తుంటే రేవంత్ పుణ్యాన తెలంగాణ ఆంధ్రుల చేతిలో ఆటవస్తువయ్యేలా కనిపిస్తు న్నది. శాంతిభద్రతల దృష్ట్యా పవన్ సభకు ఇపుడు దొరకని అనుమతి తర్వాతైనా దొరకవచ్చు. ఇదంతా చూస్తుంటే ఆంధ్ర పీడ మనల్ని వదిలేలా లేదు. అది రేవంత్, బాబు, పవన్ ఇలా ఏ రూపంలోనైనా రావచ్చు. పుట్టిన నేలకు ద్రోహం చేసే స్వార్థపర ముఠా వారికి వత్తాసు పలుకవచ్చు. వీటన్నిటినీ తిప్పికొట్టే శక్తియుక్తులు తెలంగాణ యువతకు ఆవశ్యకం. తెలంగాణ కళలు, భాషా, సంస్కృతుల సమ్మిళిత అస్తిత్వాన్ని నిరంతరం కాపాడుకోవాలి.