సద్భావ రమ్య సాహితీ అరుణిమ రమణీయ హృదయ రమ నెల్లుట్ల వంశ వరిష్ఠ వనిత భాగవత పురాణాన్ని పండించిన హాలికుడు పోతన్న వారసత్వ ప్రతీక కవనపూదోట విరిసిన హాలిని కార్టూన్ ప్రక్రియ కళాజ్యోతి తెలుగు కథా రచనా విశారద సభా వేదిక వెలుగు వ్యాఖ్యాత్రి బతుకు కథనాల కాలమిస్ట్ కాళోజీ పురస్కార కిరీట ధారిణి ఓరుగల్లు గడ్డ ఎత్తిన జెండా తెలంగాణ బిడ్డ నెల్లుట్ల రమాదేవి
ఇవ్వాళ యావత్ తెలంగాణ సంబురపడుతున్నది. ఇవాళ సాహితీ ప్రపంచం సంతోషపడుతున్నది. నెల్లుట్ల రమాదేవికి ప్రతిష్ఠాత్మక కాళోజీ అవార్డు రావడాన్ని చూసి! ఉన్నత విద్యావంతురాలు, ఆంధ్ర బ్యాంక్ సీనియర్ బ్యాంక్ మేనేజర్‌గా సేవలందించిన ఉద్యోగి. అపహాస్యం కాని హాస్యం పండించడం ఆమె ప్రకృతి, సామాజిక సాహితీ సృజన ఆమె ప్రవృత్తి. నమస్తే తెలంగాణ బతుకమ్మలో వారం వారం ‘రమాయణం’ కాలమ్‌తో అందరినీ పలకరిస్తూ మంచి కాలమిస్ట్‌గా పేరు తెచ్చుకున్నా, ‘రమణీయం’ పేరుతో కార్టూన్ల పుస్తకాన్ని ప్రచురించినా, రాగతి పండరి స్మారక పురస్కారం కార్టూన్స్‌గా బాపూ రమణ అకాడమీ అవార్డును, ‘అమృతలత-అపురూప’ అవార్డును గ్రహించి కార్టూనిస్టుగా పేరు తెచ్చుకున్నా అవన్నీ ఆమె కీర్తి కిరీటంలో వెలుగులే.
‘అమ్మ నా చేతి కందిన జాబిలి/ నిండైన వాత్సల్యపు దోసిలి/ హాయినిచ్చే చల్లని పైరగాలి/ అమ్మ నీ రుణం ఎలా తీరాలి?’ అంటూ అమ్మ గొప్పతనాన్ని వర్ణించినా.. ‘ నింగి ప్రేమతో మెరుపుల సందేశాల్ని ప్రకటిస్తుంది/ నేల సంద్రపు అలల పారవశ్యంతో ఉప్పొంగుతుంది’ అంటూ నింగి నేల సంబంధాన్ని కవిత్వీకరించినా… ‘వాళ్లకు ఆట బొమ్మలు కావాలి/ ఆట వద్దు/ సౌందర్యం కావాలి/ సామర్థ్యం అవసరం లేదు/ దేశంతో పనేమిటి/ దేహం కావాలి/ పరువం ముద్దు/ పరువు కాదు’ అంటూ స్త్రీలపై జరిగే అన్యాయాలను ఖండించిన రమాదేవి కవిత్వం ఆలోచనాత్మకంగా ఉంటుంది. ‘మనసు భాష’, ‘అశ్రువర్ణం’ కవితా సంపుటాల్లో ఇటువంటి కవిత్వాన్ని చదువుతాం. ‘చినుకులు’ నానీల పుస్తకం, ‘రమాయణం-1’ వీరి ఇటీవలి పుస్తకాలు.
రమాదేవి రచించిన కథలలో పుట్టింటి మమకారం ప్రస్తావనలో స్త్రీ హృదయవేదన ఎంత సహజసిద్ధంగా ఉంటుందో ‘అమ్మ పుట్టిల్లు’ కథ, ఒడిదుడుకులు వచ్చినా కుటుంబాలను నిలుపుకోవాలని చెప్పే ‘అవసరాలు’ వంటి కథలు మనిషి జీవిత పరమావధిని చెప్తాయి. వీరి ‘తల్లి వేరు’, ‘మనసుకు మనసుకు మధ్య’ కథా సంపుటాలలో ఇటువంటి సందేశాత్మక కథలు చదువుతాం. తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘కీర్తి’, ‘ప్రతిభా’ పురస్కారాలు అందుకున్న నెల్లుట్ల రమాదేవి, ‘డి.కామేశ్వరి కథల మీద మోనోగ్రాఫ్’, ‘తెలుగు సినీ గీతాలలో తెలంగాణ మాండలికం’ విశ్లేషణాత్మక వ్యాసం, ‘తెలుగు సినీ గీత రచనలో స్త్రీలు ఎక్కడ?’, ‘మన సినిమాలలో తెలంగాణ మహిళలేరి?’, ‘దాశరథి సినీ గీతాలు – ఒక విశ్లేషణ’ దాశరథి – ‘చిల్లర దేవుళ్ళు’ వంటి వ్యాసాలూ రచించారు.
కవులు, రచయితలు సాహిత్యం అధ్యయనం విధిగా చేయాలి. అప్పుడే సమగ్ర రచన చేయగలుగుతారు. ఎత్తుకున్న సాహిత్య విశేషాలని సాధికారికంగా రాయాలంటే విస్తృత పఠనం అవసరం. చిన్ననాటి నుంచి నెల్లుట్ల రమాదేవికి ఈ రెండూ ఇష్టం. గ్రామీణ వాతావరణం విడిచి దూరం పోలేదు. ప్రకృతికి దగ్గరగా, ప్రజలకూ దగ్గరగా జీవించడం, ఒక తాత్విక కోణంలో ఆలోచించడం రమాదేవిలో సహజసిద్ధంగా ఉన్న కవయిత్రికి మరింత చేర్పునిచ్చాయి. అందుకే ఆమె కథలలోనూ, కవిత్వంలోనూ జీవం ఉట్టిపడుతుంది.
రమాదేవి మంచి వక్త. సమకాలీన సమాజంపై అవగాహన ఉన్న స్త్రీగా, తల్లిగా, ఉద్యోగినిగా, కవయిత్రిగా పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు, బ్యాంకు ఉద్యోగులకు దిశా నిర్దేశాలను వివరించేలా తరగతులు తీసుకుంటారు.వేదికపై నవ్వుల జల్లులు కురిపించే రమాదేవి ఏ సభలోనైనా మాట్లాడాలనుకున్న విషయాన్ని పక్కదోవ పట్టకుండా న్యాయం చేసే సమర్థవంతురాలు.
‘గుర్రం జాషువా’ పేరుతో పెట్టిన కవితల పోటీలో నెల్లుట్ల రమాదేవి రాసిన ‘సావు డప్పు’ కవిత ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నది. ‘కాళోజీ’, ‘దాశరథి’ పురస్కారాలు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్న నెల్లుట్ల రమాదేవిని నేడు ‘కాళోజీ పురస్కారం’తో గౌరవించుకుంటున్నాం. యువతకు దిశానిర్దేశం చేసే విధంగా కవుల బాధ్యత ఉండాలని చెప్పే రమాదేవి కలం పదునైనది. ఆమె కలం నుంచి మరెన్నో రచనలు రావాలని ఆకాంక్షిస్తూ ఆమెకు అభినందనలు.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి