డబుల్ ఇంజిన్ సర్కార్ పాలిస్తున్న రాష్ర్టాల్లో పాలన అద్భుతం అంటూ ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ ఊదరగొట్టారు. కేంద్రంలో అన్ని రంగాల్లో పరుగులు పెడుతూ ఆర్థిక వ్యవస్థ స్వర్ణయుగంలో నడుస్తున్నదని, తొందర్లోనే ప్రపంచ ఆర్థిక అగ్రగామి దేశంగా భారత్ ఎదుగుతుందని కొందరు మేధావులు విశ్లేషణలతో చెప్పుకొచ్చారు. ఎన్నికల మాయలో పడిన ప్రజలు ఓట్లను వేసి గెలిపిస్తే వారం తిరగకముందే.. మోదీ అసలు సంగతి బయటపెట్టారు. దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నదని, ప్రజలు పొదుపు సూత్రాలు పాటిస్తూ దేశభక్తిని చాటుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు. 12 ఏండ్ల తన పాలనతో దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన మోదీ.. సమస్యకు పరిష్కారం చెప్పకుండా, ప్రజలకు నీతి వచనాలు బోధించడం విడ్డూరం.
ప్రధానిగా నరేంద్రమోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవన విధానంపై సరైన ప్రణాళికలు నిర్మించకపోవడంతో.. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అరకొర పథకాలను కూడా సమగ్రంగా అమలు చేయకపోవడం ఇందుకు తోడయింది. నిజంగానే మోదీకి దేశభక్తి ఉంటే భారత ఆర్థిక, వ్యవసాయ, అనుబంధ రంగాలను, దేశీయ ఉత్పత్తులను, చిన్న వ్యాపారస్తులను చిన్నాభిన్నం చేసే అమెరికా ట్రేడ్‌డీల్ చేసుకునే వారే కాదు. అప్పుడేమో విదేశీ ఒప్పందంపై హడావుడి చేసి, ఇప్పడు విదేశీ వస్తువుల పట్ల వ్యతిరేకత, స్వదేశీ వస్తువుల వాడకంపై సూక్తులు చెప్పడం ఏంటో!
మోదీ తెలంగాణకు వచ్చి ఇక్కడి ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తారని బీజేపీ శ్రేణులు ప్రచారం చేశాయి. కానీ దేశం ఆర్థిక సంక్షోభంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని వాపో యి, ప్రజలకు షాక్ ఇచ్చారు. మోదీ చేసిన తొమ్మిది సూచనలపై సామాన్య ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేయాలని, బంగారం కొనవద్దని, విదేశీ టూర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్‌లపై మోజులు వదిలిపెట్టాలని, మధ్యతరగతి వర్గాలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తిని వదులుకోవాలని, సొంత వాహనాలు వదిలి మెట్రో, బస్సుల్లో తిరగాలని, వంట నూనెలు, ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనేది మోదీ సలహాలు. దేశభక్తి పేరుతో భౌతిక, అభౌతిక అంశాలను జోడించడం గాల్లో దీపం పెట్టి ఆరిపోకుండా ప్రార్థన చేయడం లాంటిదే.
దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన మోదీ పాలనలో రాజకీయ నేతలు, ధనవంతులు, బడా కార్పొరేట్ కంపెనీల యజమానులకు మోదీ సూచనలు ఎందుకు చేయడంలేదు? ప్రభుత్వ ప్రాజెక్టుల్లో అవినీతి పర్సంటేజ్‌లు తీసుకోకపోవడం, రాజకీయ నేతలు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలు వాడటం, ఎన్నికల సమావేశాలు, బహిరంగ సభల పేరుతో దుబారా చేయకపోవటం, ప్రధాని, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు విదేశీ పర్యటనలు నిలిపివేయడం వంటి చర్యలు ఎందుకు తీసుకోవద్దు? ప్రజల సొమ్ముతో విలాసవంతమైన సౌకర్యాలు అనుభవించకుండా వారి నెలవారి ఖర్చులను రాజకీయ నాయకులు తగ్గించుకోవాలి. పూర్తిగా వదులుకోవాలి. పాలకులు కూడా ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలి. ఇవన్నీ ముందు రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు పాటించేలా మోదీ చర్యలు తీసుకోవచ్చు కదా!
బంగారం కొనుగోలు చేయొద్దంటూ చెప్తున్న మోదీ.. బంగారం, వెండి దిగుమతి సుంకం, సెస్సులను ఏకంగా 6 నుంచి 15% పెంచితే బంగారాన్ని కొనకుండా ఉంటారా? ఆర్థిక శాస్త్రంలో సాధారణంగా ఏదైనా వస్తువు ధర పెరిగితే దాని డిమాండ్ తగ్గుతుంది. కానీ దానికి విరుద్ధంగా గిఫెన్ వైపరీత్యంలో విలువైన వస్తువుల ధర ఎంత పెరిగితే అంత డిమాండ్ పెరుగుతుంది.
అది బంగారం, వెండి, మద్యం, పెట్రోల్, డీజిల్, ఇతర విలువైన విలాస వస్తువుల విషయంలో వాటి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. ఇది కాదనలేని అర్థశాస్త్ర సూత్రం. దీన్ని మోదీ ప్రభుత్వం గ్రహించే ప్రజల సొమ్మును ముక్కు పిండి వసూలు చేయాలని ఆ వస్తువుల ధరలు పెంచింది. ఇప్పటికే డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో దిగజారి, 100కు చేరువలో ఉన్నది. రోజురోజుకు దిగజారిపోతున్న దేశ ఆర్థిక పరిస్థితి స్థానం పతనావస్థలో ఉండడంతో, మోదీ పెట్టుకున్న లక్ష్యమైన 500 బిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు చేరువవుతుంది ?
మోదీ సూచించిన తొమ్మిది సూత్రాలు దేశంలో మరో విపత్కర పరిస్థితికి దారితీయవచ్చు. పెద్ద కంపెనీలు వస్తువుల కృత్రిమ కొరతను కల్పించే ప్రమాదమున్నది. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా వస్తు సరఫరా లేకపోవడంతో ధరలు పెంచి లాభాలు పొందే అవకాశమున్నది. దాంతో ద్రవోల్బణం పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల ఆదాయానికి కార్పొరేట్ కంపెనీల ఆదాయానికి మధ్య తీవ్రమైన వ్యత్యాసాన్ని సూచిస్తూ ఊహించని నష్టాన్ని కలగజేస్తుంది. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం కారణంగా అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి దిగజారుతున్నాయి. ఈ పరిస్థితులు ఇంకా కొనసాగితే ప్రజల జీవన విధానాలు స్తంభించి, మరో తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ప్రపంచం ఎదుర్కొనక తప్పని పరిస్థితి వస్తుంది.
– డాక్టర్ మండ్ల రవి 91777 06626