లోక్‌సభ ఎన్నికలలో సాంకేతికంగా గెలిచినప్పటికీ రాజకీయంగా, నైతికంగా, వ్యక్తిగతంగా కూడా తిరస్కరణకు గురైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో కనీసం ఇప్పటికైనా కొంత మార్పు రావచ్చునని ఆశించినవారికి అటువంటి సూచనలేమీ కన్పించటం లేదు. జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన అదే రాత్రి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు.
తర్వాత రోజులలో పార్టీ ఎంపీలను, ఎన్డీయే ఎంపీలను కలిపి సంబోధించి మాట్లాడారు. ఎక్స్ వేదికగా ఒక ప్రకటన కూడా చేశారు. ఆ వివరాలన్నింటిని గమనించినప్పుడు ఆశాభావాలేమీ కలగటం లేదు. ఎందుకంటే, ఆ ప్రకటనలు, ప్రతిజ్ఞలు ఆయన 2014, 2019లలోనూ చేసి అందుకు భిన్నంగా వ్యవహరించారు. పరిస్థితి ఈసారి మరొకవిధంగా ఉండగలదా? కనీసం ఆయన మాటల తీరులో మాత్రం అటువంటి సూచనలు లేవు. మునుముందు ఏమైనా మార్పు ఉంటే సంతోషించవచ్చు.
PM Modi | మోదీ ప్రసంగ వివరాలలోకి వెళ్లేముందుగా మొట్టమొదట చెప్పుకోవలసింది, ఆయన బీజేపీ, ఎన్డీయేల బలం తగ్గుదల గురించి రెండు సమావేశాలలోనూ ఎటువంటి ప్రస్తావన చేయలేదు. ఆత్మ పరిశీలన తను చేసుకోలేదు సరికదా, అటువంటి శోధన అవసరమని పార్టీ నాయకులకు గాని, ఎన్డీయే ఎంపీలకు గాని హితవు చెప్పలేదు. బీజేపీ ఎన్డీయేలు మూడవసారి అధికారానికి రావటం గురించి ఘనంగా పదే పదే చాటుకోవటం, ప్రతిపక్షాలను హేళన చేయటమైతే బాగానే చేశారు. కానీ విజ్ఞత, పరిణతి గల నాయకుడి దృష్టి ఏ విధంగా ఉండాలి? ఆత్మస్తుతి, పరనిందకు పరిమితం కాకూడదు. తన పార్టీలో ఆత్మవిశ్వాసం కల్పించేందుకు పరనింద చేయటంతో పాటు, లోపాలు సరిదిద్దుకునే విధంగా తన పార్టీకి మార్గదర్శనం చేయాలి. ఎన్నికల సమయంలో మోదీ హోరెత్తించినట్లు బీజేపీకి గత పర్యాయపు 303కు మించి 370 మాట అట్లుంచి, కనీస మెజారిటీ అయిన 272 కూడా రాక 240 దగ్గర ఆగింది. ఎన్డీయే బలం 352 నుంచి 400 దాటడం గాక 294కు పరిమితమైంది. వారణాసిలో మోదీ సొంత మెజారిటీ సగానికి పడిపోయింది. దేశమంతా చర్చిస్తున్నది ఈ విషయాల గురించే. సరైన నాయకుడైతే విజయానికి ఆనందాన్ని ప్రకటిస్తూనే, ఫలితాలు ఆశించిన విధంగా రాకపోవటాన్ని సభ్యుల ముందు ధైర్యంగా నిజాయితీగా ప్రస్తావించాలి. అందుకు మనమందరం కారణాలను శోధించి దిద్దుబాట్లు చేసుకోవాలని, చేసుకుందామని, 2029 నాటికి తిరిగి పుంజుకుందామని అనాలి. కానీ మోదీ ఇటువంటి లక్షణాలు ప్రదర్శించలేదు. ఆయనకు గుజరాత్ రోజుల నుంచి కూడా నిగూఢమైన, ఒంటరి పోకడలు పోయే మనిషన్న పేరు ఉన్నది. అదే ఇప్పుడు సైతం కన్పించింది.
ప్రసంగ వివరాలలోకి వెళితే, 4వ తేదీ సాయంత్రం పార్టీ నాయకుల సమావేశంలో మోదీ ప్రసంగం మొదలైంది ‘జై జగన్నాథ్’ అనే మత పరమైన నినాదంతో. తాము ఒడిషాలో మొదటిసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటాన్ని గుర్తుచేస్తూ ఆయన ఆ నినాదం ఇచ్చారు. గెలవటం వరకు అభినందించదగ్గదే. కానీ, ఎన్నికల ప్రచారాన్నంతా మతమయం చేసి, హిందీ రాష్ర్టాలలోనూ ప్రజలను విసుగెత్తించి ఎదురుదెబ్బలు తిన్న తర్వాత, ఇప్పటికీ ఆ ధోరణిని మానుకోకపోవటాన్ని ఏమనాలి? మునుముందు సైతం తను ఇంతేనని దేశ ప్రజలు భావించాలా? అదేగాని ఆయన ఉద్దేశమైతే ప్రజలు తమ నిర్ణయాలు తాము తీసుకోవటం సహజమవుతుంది. మోదీ 2001-14 మధ్య గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు సమాజంలో, రాజకీయాలలో మతతత్వాన్ని చాలా బలంగా వ్యాపింపజేయగలిగారు. ఆ స్థితి తను అక్కడినుంచి బయటకు వచ్చిన పదేండ్లుగా కూడా అంతే బలంగా కొనసాగుతున్నది. కానీ, గుజరాత్ పరిస్థితి ఆ విధంగా పరిణమించటానికి గల కారణాలు మోదీ కన్న చాలాకాలం ముందు నుంచి ఉన్నాయి. ఆ పునాదులపై ఆధారపడి ఆయన ఆ పని చేయగలిగారు.
అదే మతతత్త్వ ప్రాజెక్టును దేశవ్యాప్తం చేసేందుకు తను గత పదేండ్లుగా ప్రయత్నిస్తున్నారు. అది కొంతకాలం ముఖ్యంగా హిందీ రాష్ర్టాలలో బాగానే ముందుకుసాగినా, అందుకు గల పరిమితులేమిటో ఈ ఎన్నికలలో ప్రజలు రుజువు చేశారు. దాన్ని బట్టి ఆయన తన ప్రాజెక్టును, ధోరణిని సవరించుకోవటం అవసరం. అటువంటి గుర్తింపు బీజేపీలో, సంఘ్ పరివార్‌లో కలుగుతున్నట్టు వింటున్నాము. దేశంలో హిందూ రాష్ట్రం ఏర్పడాలనే ఆశయం బీజేపీ, సంఘ్పరివార్లకు ఎప్పటినుంచో ఉన్నదే. అయితే అందుకోసం మోదీ తరహా తీవ్రవాద ధోరణిని వారు ఇంతకుముందు చూపలేదు. దీనంతటి మధ్య మరొక అభిప్రాయం కూడా వినవస్తున్నది.
హిందుత్వం పేరిట మోదీ చేస్తున్నది వాస్తవంలో స్వీయాధికార సాధన కోసమేనని, అందుకే లోగడ గుజరాత్లో, ఇప్పుడు జాతీయస్థాయిలో సంఘ్ పరివార్‌ను, బీజేపీ సీనియర్లను సైతం ధిక్కరించటం కనిపిస్తున్నదని. ఈ స్థితిలో, ఈ విధమైన ఎన్నికల ఫలితాల మధ్య కూడా ఆయన తన తీవ్ర మత తత్త ప్రాజెక్టును వదలుకోని పక్షంలో, మునుముందు ప్రజల వైపు నుంచి గాని, పరివార్ నుంచి గాని ఎటువంటి పరిస్థితులు ఎదురుకావచ్చునో చూడవలసి ఉంటుంది.
తక్కిన ప్రసంగ విషయాలకు వస్తే గుర్తించవలసినవి కొన్నున్నాయి. ఒకటి, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దేశాభివృద్ధి కోసం అందరితో కలిసి పని చేయగలమనటం. రెండు, ఈ విడత పాలనలో భారీ నిర్ణయాలు తీసుకోగలమనటం. మూడు, అవినీతి నిర్మూలనకు తీవ్రమైన చర్యలు ఉండగలవనటం. నాలుగు, రాజ్యాంగమే తనకు దిక్సూచి కాగలదనటం. అయిదు, గ్రీన్ ఎకనామీ, పర్యావరణ పరిరక్షణల ప్రస్తావన. ఆరు, అన్ని నిర్ణయాలు సమిష్టిగా తీసుకోవటం. ఏడు, అన్ని మతాలు సమానమనేది తమ సిద్ధాంతమనటం. స్థూలంగా ఇవీ ఆయన పేర్కొన్న విషయాలు. ఇవి తప్పకుండా ప్రశంసించదగ్గ ఆలోచనలే. సమస్య ఉత్పన్నమయేది ఆచరణలో. వాస్తవానికి తన ప్రకటనలలో కొత్త ఏమీ లేదు. మనం 2014, 2019లలో విన్నవే ఇవి. కాకపోతే, ఈసారి బీజేపీకి సొంత మెజారిటీ లేనందున, బలమైన నాయకత్వం గల ప్రాంతీయ పార్టీలపై ఆధారపడవలసి ఉన్నందున, సమిష్టి నిర్ణయాలు తప్పకపోవచ్చు. లోగడ వాజపేయి నాయకత్వాన ఎన్డీయే కూటమి ప్రభుత్వం 1998-2004 మధ్య ఉండినపుడు పలు అంశాలలో కూటమి భాగస్వాముల అంగీకారంతో తప్ప ముందుకు వెళ్లలేకపోవటం, కొన్ని నిర్ణయాలను వారి వ్యతిరేకత వల్ల ఉపసంహరించుకోవలసి రావటం తెలిసిందే. అయితే, వాజపేయికి, మోదీకి తేడా ఉందని, మోదీ మొండి పట్టుదల మనిషని అంటారు. యథాతథంగా అది నిజమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల మధ్య ఆయన తన పట్టుదలను వదులుకోక తప్పదు. అందువల్ల, కూటమి భాగస్వాములకు అంతగా ఆసక్తి ఉండని విదేశ వ్యవహారాలు, రక్షణరంగం, అంతర్గత భద్రత వంటి రంగాలను మినహాయిస్తే, సాధారణంగా సమిష్టి నిర్ణయాలే జరుగవవచ్చు. పోతే, మతం, అల్పసంఖ్యాకవర్గాలకు సంబంధించిన విషయాలలో సున్నితమైన స్థితి ఎదురవుతుంది. ఇందులో ఒకవైపు మోదీ, మరొకవైపు చంద్రబాబు, నితీశ్‌ల మధ్య పూర్తి ఏకాభిప్రాయం గాని లేదా పూర్తి భిన్నత్వం గాని ఉన్నట్టు మనం ఇంతవరకు గమనించినదాన్ని బట్టి తోచదు. అది వారి మధ్య ఒక దోబూచులాట వంటిది. కనుక, ఏమి జరగవచ్చునన్నది క్రమంగా కాని బోధపడదు.
పోతే, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేశాభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేయగలమంటున్న మోదీ, 2014లోనూ సహకార ఫెడరలిజం అంటూ మాట్లాడారు గాని, దానిని ఆచరణలో చూపలేదన్నది తెలిసిందే. అందుకు విరుద్ధంగా ఇతర పార్టీ ప్రభుత్వాల పట్ల చాలా వివక్ష చూపారు. తన క్రోనీ క్యాపిటలిజం, క్రోనీ క్యాపిటలిస్టు మిత్రుల ప్రయోజనాల కోసం దేశ సమతులనాభివృద్ధిని, రాష్ర్టాల ప్రయోజనాలను పణంగా పెట్టారు. వీటి ప్రభావంతో అనేక అభివృద్ధి సూచీలలో, ముఖ్యంగా మానవాభివృద్ధి, ఆకలి, ఆరోగ్యం వంటి సూచీలలో దేశ స్థాయి క్రమంగా పడిపోతూ వస్తున్నది. ఇప్పుడాయన దేశాన్ని అయిదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చి ప్రపంచంలో మూడవస్థానానికి తీసుకువెళ్లగలమంటున్నారు. అటువంటి స్థానాలు నిజంగా సాధించినా ధనిక-పేద తారతమ్యాలు మరింత పెరగటం మినహా సామాన్యుల నికర జీవితాలు మెరుగుపడబోవన్నది నిపుణుల హెచ్చరిక. ఇటువంటి స్థితిలో, గత అనుభవాల దృష్ట్యా మోదీ ఈ విడత పాలనలో అభివృద్ధి అనే మాటకు అర్థం, ఆచరణ ఏమిటన్నది వేచి చూడవలసిన విషయం. అంతేముఖ్యంగా, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలన్న 2014 నాటి హామీ గాలికిపోగా, జరుగుతున్నదంతా ఉద్యోగ ఉపాధులు లేని ఆర్థికాభివృద్ధి (జాబ్‌లెస్ గ్రోత్) అయినప్పుడు, మోదీ విధానాలు గాని, అధికార కూటమి ఉమ్మడి నిర్ణయాలు గాని గతం కన్న భిన్నంగా ఉండగలవా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఈసారి భారీ నిర్ణయాలు అంటున్న ప్రకటన దేశాన్ని మూడవ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించటం కోసమేనా లేదా ఈ అసమానతలు, నిరుద్యోగం, అభివృద్ధి సూచీల పతనంపై దృష్టి పెట్టేందుకు కూడానా అన్నది మరొక పెద్ద ప్రశ్న.
విచిత్రమేమంటే, మోదీ అవినీతి నిర్మూలన అంటూ భీషణమైన ప్రతిజ్ఞలు చేసిన ప్రతిసారీ, తీవ్రమైన అవినీతి ఆరోపణలపై తన ప్రభుత్వమే కేసులు పెట్టిన అనేకమంది ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకోవటం, కేసులు మూలన వేయటం లేదా రద్దు చేయటం, అగ్రస్థాయి పదవులు కట్టబెట్టడం అనివార్యంగా గుర్తుకువస్తుంది. ఈ వికృత స్థితిని ఎవరెన్నిసార్లు ఎత్తిచూపినా, ప్రధాని మోదీ ఒక్కసారంటే ఒక్కసారైనా అందుకు సాకుల రూపంలోనైనా స్పందించలేదు. మరొకవైపు లొంగిరాని ప్రత్యర్థులపై వివిధ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూనే ఉన్నారు.
అటువంటప్పుడు ఇప్పుడు మరొకసారి చేస్తున్న అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞను చూసి నవ్వువస్తుంది. తను నడుపుతున్న క్రోనీ క్యాపిటలిస్టు వ్యవస్థ, అటువంటి వర్గపు విచ్చలవిడి అవినీతిని పైకి కానరానివిధంగా ప్రోత్సహిస్తూనే ఉంది. రాగల కాలంలో మరొకవిధంగా జరగగలదని గాని, అటువంటి విధానాలను కూటమి భాగస్వాములు వ్యతిరేకించగలరని గాని భావించగలమా? దీనికి సంబంధించే, దేశ వనరులను, పర్యావరణాన్ని ఆయా వర్గాలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఏ విధంగా కొల్లగొడుతున్నాయో, ధ్వంసం చేస్తున్నాయో నిపుణులు ఎత్తిచూపుతూనే ఉన్నారు. తాజాగా, సున్నితమైన లద్దాఖ్ వంటి సరిహద్దు ప్రాంతంలో గల అరుదైన లోహ నిక్షేపాల కోసం మొదలైన ప్రక్రియను అక్కడి స్థానికులే గాక, స్వయంగా బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్యస్వామి వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. తనది అన్నిమతాలు సమానమనే సిద్ధాంతమంటూ ప్రవచించిన మోదీ ఒక్క ముస్లింకైనా క్యాబినెట్లో చోటు కల్పించకపోవటాన్ని బట్టి తన నిజ స్వరూపం అర్థమవుతున్నది. అందువల్ల, పైన పేర్కొన్న రెండు ప్రసంగాలలో మోదీ ప్రస్తావించిన వివిధ అంశాలు, రాజ్యాంగ పరిరక్షణ సహా, అన్నింటిలోనూ విశ్వసించదగ్గది ఒక్కటైనా కన్పించటం లేదు.
– టంకశాల అశోక్