రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా 370కి పైగా స్థానాల్లో గెలుస్తామని, కూటమి పార్టీలతో కలిపి 400 సీట్లు సాధిస్తామని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఊదరగొడుతున్నది. అయితే ఈ ప్రకటన కేవలం మేకపోతు గాంభీర్యంగానే కనిపిస్తున్నది. ఒకవేళ అదే నిజమైతే ఆ పార్టీ కుట్ర రాజకీయాలకు ఎందుకు తెరలేపినట్టు? కూటముల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నట్టు? పైకి గప్పాలు కొడుతున్నారే గానీ, బీజేపీ పాలకులకు కూడా ఓటమి భయం వెంటాడుతున్నది. ఎన్నికల వేళ విపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తుండటమే అందుకు నిదర్శనం.
BJP | ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి సహా బీజేపీకి చెందిన హేమాహేమీలు ఎంతగా ప్రచారం చేసినా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌ను అడ్డుకోలేకపోయారు. రోజురోజుకు బలపడుతూ పంజాబ్‌లోనూ అధికారం చేజిక్కించుకోవడమే కాకుండా పక్క రాష్ర్టాలకు ఆప్ విస్తరిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ దూకుడును కట్టడి చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించినట్టు ఆరోపణలున్నాయి. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయగా, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వం కూడా రద్దయింది. దీనంతటి వెనుక బీజేపీ వ్యూహం ఏమంటే మూడోసారి కూడా దేశంలో అధికారంలోకి రావడమే.
కేవలం ప్రతిపక్ష నేతలపైనే విరుచుకుపడే దర్యాప్తు సంస్థలు.. అధికార పార్టీ నేతలపై అసలు కేసులే నమోదు చేయడం లేదు. ఒకవేళ నమోదైనా ఎలాంటి విచారణ జరగదు. ఇంకా విచిత్రం ఏమంటే ఎన్ని అవినీతి కేసులున్నా బీజేపీలో చేరిన వెంటనే అవి మాఫీ అవుతాయి. హిమంత బిశ్వశర్మ, సువేందు అధికారి, సుజనాచౌదరి, సీఎం రమేష్, గాలి జనార్దన్‌రెడ్డి, అజిత్ పవార్ ఇలా ఎందరో నేతలు కమలం తీర్థం పుచ్చుకొని పునీతులైనవారే.
నాయకులే కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించిన వెంటనే పలు కంపెనీలు కూడా బీజేపీకి దాసోహమవుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఆ పార్టీకి భారీగా నిధులు ఇచ్చి తమపై వచ్చిన ఆరోపణల నుంచి ఉపశమనం పొందుతున్నాయి. సీబీఐ, ఐటీ, ఈడీ లాంటి సంస్థలు కేసులు నమోదు చేసిన 41 కంపెనీలు రూ.2,471 కోట్లను బీజేపీకి విరాళంగా ఇచ్చిన విషయం ఎన్నికల బాండ్ల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇదంతా నాణేనికి ఒకవైపు కాగా.. నాణేనికి మరోవైపు దేశంలోని చిన్నాచితకా పార్టీలను నయానో, భయానో లొంగదీసుకొని తనవైపు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. గత వైరాలను కూడా మర్చిపోయి పాత మిత్రులను బీజేపీ అక్కున చేర్చుకుంటున్నది. వాటితో పొత్తు కోసం వెంపర్లాడుతున్నది. అజిత్ పవార్‌పై ప్రధాని మోదీ అవినీతి ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆయన బీజేపీ కూటమిలో చేరిపోయారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని గతంలో ఆరోపించి.. నేడు ఆ పార్టీతో కలిసి బీజేపీ ఏపీలో పోటీ చేస్తున్నది. బీహార్‌లో నితీశ్‌తో, యూపీలో చిన్న పార్టీలతో కమలం పొత్తు పెట్టుకున్నది.
400 సీట్లు గెలిచే అవకాశం ఉన్నప్పుడు పార్టీలతో పొత్తులెందుకు? ఓవైపు ఎన్డీయే కూటమిలో కొత్త మిత్రులను కలుపుకొంటూనే.. ప్రతిపక్షాలను విచ్ఛిన్నం చేసే కుట్రలకు తెరలేపారు. తెలంగాణలో బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు బెడిసికొట్టడానికి కమలం అధిష్టానమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు పార్టీల మధ్య పొత్తు పొడవకుండా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఆయన బీఎస్పీని వీడాల్సి వచ్చింది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 108 స్థానాల్లో గెలుపొందింది. ఆ రాష్ట్రంలో గతంలో వచ్చినట్టు ఈసారి బీజేపీకి భారీగా ఎంపీ సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మహారాష్ట్రలో పార్టీల చీలికలతో బీజేపీపై మరాఠాలు గుర్రుగా ఉన్నారు. అక్కడ కూడా గతంలో సాధించిన సీట్లను తిరిగి చేజిక్కించుకునే పరిస్థితుల్లేవు. పదేపదే కూటముల మార్పుతో నితీశ్ ప్రతిష్ట దెబ్బతిన్నది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు గణనీయమైన ఓట్లు, సీట్లను సాధించాయి. గుజరాత్లో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇద్దరు పోటీ నుంచి తప్పుకొన్నారంటేనే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం ఢిల్లీ, పంజాబ్ రాజకీయాలపై పడొచ్చు. ఇక దక్షిణాది సంగతికి వస్తే.. కర్ణాటకలో పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నా.. తెలంగాణలో గతంలో వచ్చిన సీట్లు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. పైకి ప్రచారం చేస్తున్నట్టు.. దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితులు లేవనే చెప్పాలి. అందుకే మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే కూటములు కడుతూ, ప్రతిపక్ష పార్టీలను చీలుస్తూ, విపక్ష నేతలను అరెస్టు చేయిస్తూ అడ్డదారిలో వెళ్తుండటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.
– ప్రశాంత్ సాగి 70955 83999