Telangana | సంకటాలు తగిలించుకొని మీసాలు పీక్కుంటే ఏం లాభం?.. అనేది పెద్దల ఉవాచ. లోకపు తీరుతెన్నులు సుదీర్ఘకాలంగా చూసిన అనుభవం ఆ వ్యాఖ్యలో ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సరిగ్గా సరిపోతుంది. తమకు ఇంటా వంటా అలవాటు లేని చెరువుల రక్షణ, కాలుష్య నివారణ అంటూ బయల్దేరి దాన్ని ఎలా చేయకూడదో అలా చేసి.. ఆఖరికి మింగాకక్కాలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. మొన్న హైకోర్టు వాయింపులు విన్న తర్వాత సర్కారులో మల్లగుల్లాలు మొదలయ్యాయంటున్నారు. ఏమైనా తగిలించుకున్నంత తేలిక్కాదు, వదిలించుకోవడం.
తెలంగాణ రాకముందు అనుకుంటా ఓ పాత్రికేయుడు తన వారాంతపు కాలమ్‌లో ‘తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇపుడున్నవన్నీ కూల్చేస్తారా?’ అని ప్రశ్నించాడు. సరే.. ఆయన అక్కసు ఆయనది! ఆ మాటకొస్తే అక్కసు అనే పదానికి ఆయనే ఓ బ్రాండ్ అంబాసిడర్!! అయినా తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏం కూల్చిందో.. ఏం నిర్మించిందో.. పునర్నిర్మాణం అంటే ఏమిటో ప్రజలకు, అలాగే సదరు పాత్రికేయుడికి కూడా; అనేక రూపాల్లో అనుభవంలోకి వచ్చి ఉంటుంది. కేసీఆర్ చేపట్టిన పునర్నిర్మాణంలో ఏదీ కూల్చకపోగా రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ, జలవనరుల కల్పన, తాగునీరు, సాగునీరు, వ్యవసాయ స్థిరీకరణ, రహదారుల నిర్మాణం, ఐటీ రంగ అభివృద్ధి, సీనియర్ సిటిజన్లకు భరోసా, ఉద్యోగస్థుల సంక్షేమం, చేతి వృత్తులకు చేయూత ఇలా అనేక రంగాలు దేశానికి ఆదర్శం అనే స్థాయిలో పునర్నిర్మాణం జరిగింది. మొన్నటికి మొన్న ప్రధాని మన్ కీ బాత్‌లో పేర్కొన్న పచ్చదనం పెంపు సహా ఇవాల్టికీ ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇంకా వార్తల్లోకెక్కుతూనే ఉన్నది. ఎవరికి నచ్చినా, నచ్చకున్నా.. ఎవరెన్ని వంకర అర్థాలు తీసినా అదంతా ఒక సుజల.. సుఫల.. చరిత్ర.
పదేండ్ల తర్వాత ఇపుడు తెలంగాణలో జరుగుతున్నదేమిటి? హైదరాబాద్‌లో జరుగుతున్నదేమి టి? అపుడెపుడో ఆ పాత్రికేయుడు చెప్పిన కూల్చివేతల విధ్వంసకాండే కదా! దానికి చెరువుల రక్ష ణ, పర్యావరణ రక్షణ, కాలుష్య నివారణ అనే ట్యాగ్‌లైన్. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే కర్కశంగా పేద ప్రజల జీవికను చిదిమివేసే, గూడు నుంచి తరిమేసే ప్రక్రియ. కూలిన శిథిలాలు, గుండెలవిసే పేదల రోదనలు.. కండ్లముందు గుండె బరువెక్కే దృశ్యాలు. ఇదే కేసీఆర్ హయాంలో జరిగి ఉంటే..
‘ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది?’, ‘ఇదేనా బంగారు తెలంగాణ?’ అనే సొల్లు డైలాగులు చాలా చాలా వినిపించేవి. పచ్చ టీవీల్లో మేధావులు నెత్తి గోక్కుంటూ, ముక్కుచెవుల్లో వేళ్లు దూర్చుకుంటూ చాలా చాలా ప్రవచనాలు చెప్పేవారు. పచ్చ పత్రికల ఎడిట్ పేజీలు కన్నీటి జలపాతాలు కురిపించేవి. తమాషాగా ఇపుడు అవేం లేవు. సరికదా.. ‘చాక్లెట్ తింటే జలుబు చేస్తుందమ్మా..!’ అని చిన్న పిల్లలకు గారంగా చెప్పిన రీతిలో ‘జాగ్రత్త రేవంత్… ఇలా చేయకూడదమ్మా!’ అంటూ సుతిమెత్తని సలహాలు పరిచేస్తున్నాయి. ఇంకా పచ్చ పర్యావరణవేత్తలను రంగంలోకి దింపినట్టు లేదు.
కొత్త ఎద్దు పెండ ఇంటిల్లిపాదీ పోటీ పడి ఎత్తిపోస్తారని.. ఓ పూర్వకాలపు సామెత. కొత్త కదా ఆ మోజు ఉంటుంది. రాష్ట్రంలో మంత్రులకు కూడా ఇంకా అధికారం చేపట్టిన మురిపం పాతబడినట్టు లేదు. విమర్శ ఎదురైతే చాలు ఒంటి కాలు మీద లేస్తున్నారు. ఈ విధ్వంసకాండపై జరుగుతున్నదంతా ‘బిల్డర్లు ఆడుతున్న నాటకమని’ భట్టిగారు భాష్యం చెబుతుంటే.. ‘ఆక్రమణ చేస్తే బుల్డోజర్లు రావా?’ అని శ్రీధర్‌బాబు గారు ఆవేశపడిపోతున్నారు. ‘ఐదొందలు, ఆరొందలు ఇచ్చి మాట్లాడిస్తున్నార’ని కూడా అనేశారు. పొన్నం గారు సోషల్‌మీడియా.. కేసులు అంటూ ఆయన శైలిలో స్పందిస్తున్నారు. కోమటిరెడ్డి వారు మా నల్గొండ మూసీ కాలుష్యం కడిగేద్దామంటే బీఆర్ఎస్ వాళ్లు అడ్డం పడుతున్నారనేంత దాక పోయారు. మరి అదే నల్లగొండ ఫ్లోరైడ్ బారిన పడి జీవచ్ఛవమవుతుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో! ఎలా ఆదుకుందో మాత్రం చెప్పలేదు. ఇక బాధితులతోనే ‘ఆహా ఎంత బాగా కూల్చారో’ అంటూ వాళ్ల సోషల్ మీడియా టీమ్ బైట్లతో బయటపడాలని సర్వశక్తులు ధారపోస్తున్నారు. కానీ వర్కవుటే కావడం లేదు. ఎరక్కపోయి ఇరుక్కున్న అధికారులదీ అదే సీను. ‘మూసీ మార్కింగ్‌తో మాకు సంబంధం లేద’ంటూనే ఆ బాధ్యతలు చూసే దానకిశోర్గారితో కలసి రంగనాథ్గారు గంటన్నర పాటు హైడ్రా మీద వివరణలు ఇచ్చుకున్నారు. రెండింటికీ సంబంధమే లేకపోతే ఇద్దరూ కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టినట్టు అనే ప్రశ్నకు జవాబు లేదు. ఆ మాటకొస్తే హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర కూడా జవాబులు లేవు.
‘వన్నెలమ్మను వంటకు పెడ్తే ఇంటిల్లిరాజులను ఉపాసం పండబెట్టిందని’ తెలంగాణ సామెత. ఆరు గ్యారెంటీలు అని అదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పథకాలు అమలుచేస్తారని ప్రజలు అనుకుంటే అవన్నీ పక్కనబెట్టి డ్రామాలు, డైవర్షన్లు మొదలుపెట్టారు. ఇంత విధ్వంసకాండ చేపట్టడానికి ప్రభుత్వం, మంత్రులు చెప్తున్న కారణం ఏమిటి? చెరువులు ఆక్రమించారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, కాలుష్య ప్రక్షాళన వగైరా. అసలు హైదరాబాద్ ప్రధాన సమస్య ఏమిటి? నగరంలో కురిసే వర్షపు నీరు ముంపు సమస్య లేకుండా బయటకు పోవడం. నిలిచే నీరు బయటకు వెళ్లాలంటే రెయిన్ డ్రెయిన్ నాలాలు విస్తరించాలి. అవసరమైన చోట నిర్మించాలి. అది వదిలేసి విధ్వంసాలకు దిగారు. లేదూ.. చెరువులను రక్షించడమే ప్రధానం అనుకుంటే ముందు ఆయా చెరువుల క్యాచ్మెంట్ ఏరియాల్లో ఇవాళ మారిన వాతావరణ పరిస్థితుల్లో నిజంగా అక్కడ వర్షపాతం గతంలో మాదిరిగానే ఉందా? అది ప్రవాహమై చెరువుల్లోకి చేరేంత స్థాయిలో ఉంటున్నదా? నగర విస్తరణలో భూ వినియోగంలో మార్పులు వచ్చాక ఎక్కడికక్కడ భూమి చదును చేయబడిన తర్వాత ఇపుడూ ఆనాటి పాత పరిస్థితే ఉందా? అనేది సమగ్రంగా సర్వే చేయాలి. నమ్మదగిన ప్రవాహం ఉందంటే అడ్డుగా ఉన్న నిర్మాణాలన్నీ తప్పకుండా తొలగించాలి. అలాకాకుండా గుడ్డిగా ఓ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, మూసీ ఫ్రంట్ అంటూ గీతలు గీసి ఆ పరిధిలో నిర్మాణాలన్నీ కూలిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? త్రిబుల్ వన్ జీవోయే దీనికి మంచి ఉదాహరణ. ఎలా నిర్ధారించారో తెలియదు గానీ, 500 చదరపు కిలోమీటర్ల మేర 84 గ్రామాలను ఈ జీవో కిందకు తెచ్చారు. అది 1996 నాటి జీవో. ఇవాళ 2024. ఈ సుదీర్ఘ కాలగమనంలో, మారిన పరిస్థితుల్లో పాతకాలపు వర్షపాతాలు, నీటి ప్రవాహాలు, గతంలో మాదిరిగా లేవనేది ప్రజల వాదన. అంతేకాదు, ఆ పరిధిలో భూ వినియోగంలో భారీ మార్పులు వచ్చాయంటున్నారు.
ఒకప్పుడు ఖాళీగా పడావుగా ఉన్న భూములు, బీళ్లు, మైదానాలు కూడా పంటపొలాలు, ఇతర రూపాల్లోకి మారాయంటున్నారు. గ్రామాలు కూడా బాగా విస్తరించాయని, పట్టణీకరణ ప్రభావం బాగా పెరిగిందంటున్నారు. అంతేకాదు, సాక్షాత్తూ ప్రభుత్వమే ఆ పరిధిలో రహదారులు, ఇతర నిర్మాణాలు చేసిందని కూడా చెప్తున్నారు. నగర విస్తరణకు ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఈ జీవో ప్రధాన అడ్డంకిగా మారిందంటున్నారు.
పర్యావరణ రక్షణ అవసరమే. కానీ, అది గుడ్డి గుర్రం కాకూడదు. ప్రజల కోసం చట్టాలుంటాయి తప్ప, చట్టాల కోసం ప్రజలు కాదు. ఒకప్పుడు ఈ భూగోళమంతా చెట్లు, గుట్టలు, పుట్టలు, పశుపక్ష్యాదులతో నిండి ఉండేది. ఆది మానవుని ప్రయాణం అక్కడ ప్రారంభమైంది. ఆహార సంపాదనతో మొదలైన ఆ యాత్ర; సామూహిక జీవితం, వ్యవసాయ క్షేత్రాలు, స్థిర నివాసాల ఏర్పాటు, గ్రామాలు, నగరాల నిర్మాణం వరకు చేరడం మానవజాతి చరిత్రలో ఓ మజిలీ. అంతేకాదు, ప్రతి ప్రాచీన నగరమూ నదీ తీరాల్లోనే వెలిసింది. నదీ తీరాల్లోనే నాగరికత వర్ధిల్లింది. నదీ తీరాల చుట్టే మానవుని ఉనికి కొనసాగింది. జనావాసాలు పెరిగాయి. అందువల్ల ఆ నదులేం ఇంకిపోలేదు. ఎండిపోలేదు. అలా అని ప్రాచీన కాలపు నదులన్నీ ఏ మార్పు లేకుండా ఇప్పటిదాక సజీవంగా ఉన్నదీ లేదు. మన దేశంలోనే వేదాలు ఉద్ఘాటించిన సరస్వతి నది ఇపుడు లేదు. అది లేనంతమాత్రాన ప్రపంచం మునిగిపోనూ లేదు. ఈ భూగోళం, దాని ఉపరితలం, సమస్త భూగోళాన్ని ఆవరించుకున్న పర్యావరణం, రుతుపవన చక్రం కాలానుగుణంగా వచ్చే అన్ని మార్పులను తమలో ఇముడ్చుకొని సమన్వయపరుచుకుని ముందుకుసాగుతూనే ఉన్నాయి. ఇది వేల వేల ఏండ్ల అనుభవం.
పేద ప్రజలు అనే సాకును అడ్డం పెట్టుకొని నగరంలో ఎక్కడ పడితే అక్కడ వందల గుడిసెలు వేసి అడ్డగోలు ఆక్రమణలు చేసిన ప్రఖ్యాత కాంగ్రెస్ నాయకుడెవరో, ఆ పనులు చేసినందుకు ఆయన ఏ పేరుతో ఫేమస్ అయ్యాడో ప్రజలకు తెలియదా? ఆయన కారణంగా నగరంలో ఎన్ని ప్రాంతాల్లో భూములు వివాదాస్పదమయ్యాయో తెలియదా? ఆయనొక్కడేనా? రామంతాపూర్ చెరువు ఎవరి హయాంలో ఎవరు ఆక్రమించారో అక్కడి ప్రజలకు తెలియదా? మూసీ మత్తడి నాలా మీద ఆక్రమణలు ఎవరు చేశారో తెలియదా? ఎవరి పాలనలో నాలాలు పిల్ల కాల్వలకన్నా అధ్వాన్నంగా మారాయో తెలియదా? అలాంటి అనేక చెరువుల ఆనవాలు కూడా మిగలకుండా మింగిందెవరో.. చెత్తపోసి.. మట్టిని నింపి ఒక్కో చెరువును ఎలా ఆక్రమించుకుంటూ వచ్చారో ఎక్కడికక్కడ ప్రజలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ తెలంగాణ రాకముందు జరిగినవే.
పర్యావరణ రక్షణ అంటే కేవలం నీటి వనరుల రక్షణే కాదు. కొండలు, గుట్టలు, అడవులు కూడా రక్షించాలి. వాయు కాలుష్యం కూడా నివారించాలి. తమాషా ఏమిటంటే నగరాల్లో నీటి కుంటల రక్షణ పేరిట గగ్గోలు పెట్టే పాత్రికేయ మేధో సమూహాలు.. అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకునేవారికి మాత్రం పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తాయి. అనేక ఏండ్లుగా సాగు చేస్తున్నారని సపోర్టింగ్ సర్టిఫికెట్లు కూడా ఇస్తాయి. చెరువుల ఆక్రమణ పర్యావరణ విధ్వంసమే అయినపుడు అడవుల నరికివేత మాత్రం విధ్వంసం ఎందుకు కాదు? అంటే వారి దగ్గర జవాబుండదు. ఖమ్మం జిల్లాలో అయితే పోడు భూములకు పట్టాలు అనేది చాలామంది నాయకులకు ఒక జీవితకాలపు ఆదాయ మార్గంగా మారుతున్న వైనాన్ని మాత్రం పొరపాటుగా ఈ సమూహాలు ఎత్తిచూపవు. తెలంగాణ రాకముందే గిర్గ్లానీ కమిషన్ ఖమ్మం జిల్లా సహా రాష్ట్రంలో ఎంత అడవి ఎలా అన్యాక్రాంతమైందో ఒక నివేదిక కూడా ఇచ్చింది. అందులో సింహభాగం ఖమ్మం జిల్లా అడవుల అన్యాక్రాంతంపైనే చర్చించింది. తెలంగాణ వచ్చిన నాటికి కాగితాల మీద ఉన్న అడవులకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతనే లేదు. మరి ఆ అడవంతా ఎవరు మింగేసినట్టు? ఎవరి హయాంలో మింగేసినట్టు? ఇక కొండలు, గుట్టల పరిస్థితి ఏమిటనేది అందరి అనుభవంలో ఉన్నది. మన కండ్లముందే ఎన్ని గుట్టలు మాయమయ్యాయో చూశాం. అలా గుట్టలను క్వారీలకు లీజు ఇవ్వడం అనే జీవో ఎప్పుడు ఎవరి హయాంలో వచ్చింది? అందరికీ తెలుసు.
చెరువులు- ఆక్రమణలు-కాలుష్యం- ప్రక్షాళన అంటూ అలవాటు లేని భారీ డైలాగులు వల్లిస్తున్న కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన జవాబు ఒకటుంది. కాకతీయులు, కుతుబ్‌షాహీల కాలంనుంచి తెలంగాణవ్యాప్తంగా నిర్మించిన సముద్రాల్లాంటి చెరువులన్నీ ఎవరి హయాంలో ఆనవాళ్లు లేకుండా ధ్వంసమైపోయాయి? ఎక్కడికక్కడ ఆ చెరువులను కబ్జాలు పెట్టింది ఏ పార్టీ నాయకులు? చిన్న నీటిపారుదల శాఖను పట్టించుకోకుండా చెరువులకు మరమ్మతులే లేకుండా గాలికి వదిలేసిన అసమర్థ పాలకులెవరు? అసలు కాంగ్రెస్ పాలనలో ఏ చెరువును బతుకనిచ్చారు. ఏ చెరువును మిగలనిచ్చారు. రాష్ట్రంలో సింహభాగం బస్స్టాండ్లన్నీ చెరువుల్లో కట్టినవే. కరీంనగర్ బస్టాండ్, కలెక్టరేట్ కట్టింది చెరువులో కాదా? సిరిసిల్ల బస్ డిపో, బస్ స్టాండు కట్టింది చెరువులో కాదా? నగరంలోని ఎంజీబీఎస్ బస్టాండు మూసీ నది మధ్యలో కట్టారు కదా! జీహెచ్ఎంసీని హుస్సేన్‌సాగర్ నాలా మీదే కట్టా రు కదా? ఎవరు కట్టారో, ఎవరు ప్రారంభించారో శిలాఫలకాల మీద సజీవంగానే ఉంది.
ఇలా లెక్కపెడుతూ పోతే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్లు ఇలా అన్నిటికన్నీ ప్రభుత్వాల నిర్మాణాలే, నిర్వాకాలే. వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? అలాగే పచ్చని పంట పొలాలు పర్యావరణ రక్షణ కాదా? మరి ట్రిపుల్ ఆర్ పేరిట వేల ఎకరాలు సేకరించి రహదారులు వేస్తే జరిగే పర్యావరణ విధ్వంసం మాటేమిటి? వ్యవసాయ వర్సిటీలోని అరుదైన లక్షల వృక్షజాలాన్ని తొలగించి నిర్మాణాలు చేపట్టాలను కోవడం పర్యావరణ విధ్వంసం కాదా? దాన్ని ఎట్లా సమర్థిస్తారు? దానికి కాంగ్రెస్ దగ్గర జవాబుందా?
ఇక్కడ ఒకటే ప్రశ్న! ఎఫ్టీఎల్లు, బఫర్జోన్ల ఆక్రమణ కాలుష్య ప్రక్షాళనంటూ.. దానికి కూల్చివేతే సరైన శిక్షగా ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. బుల్డోజర్లు పంపితే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్న సచివులు.. మరి ఆ ఇండ్లకు అనుమతులు ఇచ్చిన అధికారులను ఎందుకు శిక్షించరు? సదరు ఇండ్లకు దశాబ్దాలుగా పన్నులు వసూలు చేసిన జీహెచ్ఎంసీని ఎందుకు శిక్షించరు? విద్యుత్, రహదార్లు, మంచినీరు అందించిన ప్రభుత్వ శాఖలను ఎందుకు శిక్షించరు. అసలు ఆక్రమణల నుంచి ప్రారంభించి సదరు స్థలాలకు పట్టాలిచ్చి.. అనుమతులు, సౌకర్యాలు కల్పించి పన్నులు వసూలు చేసిన సదరు ప్రభుత్వాలను ఎందుకు శిక్షించరు? ఆ ప్రభుత్వాల్లో పనిచేసిన మంత్రుల మీద కేసులెందుకు పెట్టరు? రాష్ట్రవ్యాప్తంగా వేలాది చెరువులను ధ్వంసం చేసిన ప్రభుత్వాలను ఎందుకు శిక్షించరు? ఎందుకు అభిశంసించరు? తెలంగాణను సర్వనాశనం చేసి, నీటివనరులు ధ్వంసం చేసి, రైతులను వలస జీవులను చేసిన విధ్వంసక ప్రభుత్వాలను.. ఎందుకు నడిరోడ్డు మీద నిలబెట్టరు? ఆ ప్రభుత్వాలను నడిపిన పార్టీలకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదంటూ గుర్తింపును ఎందుకు రద్దు చేయరు? అది వదిలేసి నోరు లేని పేదల మీద, మధ్య తరగతి ప్రజల మీద పడతారా?
ఎక్కడి నుంచో ప్రజలను ఖాళీచేసి ఇంకెక్కడికో తరలించడమంటే ఆ ప్రజల జీవికను ధ్వంసం చేయడమే. పేద ప్రజలకు నగరాల్లో ఇల్లు అంటే కేవలం తలదాచుకునే చోటు కాదు. ఆ ప్రాంతం చుట్టూనే వారి జీవితం అల్లుకుపోయి ఉంటుంది. ఆ ప్రాంతానికి దగ్గర్లోనే ఆ కుటుంబసభ్యులు జీవనాధారమైన ఏవో పనులుంటాయి. ఆ సంపాదనతోనే ఇల్లు గడుపుకుంటారు. ఆ ఇంటి పిల్లలు ఆ చుట్టు పక్కలే ఏదో స్కూల్లో చదువుకుంటారు. రోగమో, నొప్పో వస్తే ఆ చుట్టుపక్కలే ఉండే చిన్న చిన్న దవాఖానలను ఆశ్రయిస్తారు. కష్టాల్లో సుఖాల్లో చుట్టుపక్కల వారి సహాయం, మద్దతు పొందుతారు. ఇపుడు వారందరినీ ఊరి బయట ఎక్కడికో పంపేస్తే కొత్త ప్రదేశాల్లో వారి జీవనాధారం ఏమిటి? వారి సంపాదన ఏం కావాలి? పిల్లల చదువులేం కావాలి? రోగమో, నొప్పో వస్తే వారికి ఎవరు సాయంగా రావాలి? రేకుల గుడిసె నుంచి తరలించి డబుల్‌బెడ్ ఇల్లు ఇచ్చినా ఆ చోట వారి జీవితం ముందుకు సాగుతుందా?
ఎపుడో చరిత్రలో చదువుకున్నాం.. రజాకార్లు ఊళ్ల మీద పడి ఇండ్లు కూల్చేసే వారని. ఇపుడు కండ్లముందు చూస్తున్నాం. కాంగ్రెస్ చరిత్రను పట్టించుకోదో.. లేక లక్ష్యపెట్టదో తెలియదు కానీ, ఇలా కూల్చివేతల పర్యవసానం ఏమిటో ఆ పార్టీ అనుభవంలో ఉన్నది. ఎమర్జెన్సీలో ఢిల్లీలో తుర్క్‌మన్‌గేట్ ప్రాంతంలో రహదారి నిర్మాణం కోసం వందల ఇండ్లను కూల్చేసిన పాపం, దానిపై జరిగిన ప్రచారం.. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఘోర పరాజయానికి… ఇందిర, ఆమె కుమారుడు సంజయ్‌గాంధీ ఓటమికి కూడా దారితీసింది. ఒక పక్షి కూడా తన గూడు చెరిపేస్తే తిరగబడుతుంది. ఇక్కడున్నది ఆలోచనాశక్తి ఉన్న ప్రజలు. ఢిల్లీ పెద్దల మేలు కోసం రాత్రికి రాత్రి వేలాది మంది ప్రజల గూడు లాగేస్తామంటే కుదరదు. అంతేకాదు, ప్రజలు వ్యక్తిగత నష్టం జరిగితేనే స్పందిస్తారని, ఇది కొద్దిమంది సమస్య కాబట్టి ఇతరులు పట్టించుకోరనేది తప్పుడు అంచనా. సమాజానికి సామూహిక స్పందన అనే లక్షణం ఉంటుంది. సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తారు. మంచిని మంచి.. చెడును చెడు అంటారు. ఎక్కడో ఢిల్లీలో ఓ అమ్మాయి మీద అత్యాచారం జరిగితే దేశమంతా స్పందించింది. ఇంకెక్కడో ఎవరో నాయకుడు అవినీతికి పాల్పడితే చీదరించుకుంది. ఇది సమాజ లక్షణం. ఇండ్లను కూల్చేసే బుల్డోజర్ విన్యాసాలను… పేదల ఇండ్లు కూలి వారు కుమిలి కుమిలి కన్నీరు కారుస్తున్న వైనాన్ని, గుండెలు పగిలేలా చేస్తున్న ఆక్రందనలను చూస్తున్నారు. వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు ఎలా ఇబ్బందులు పడుతున్నారో కూడా చూస్తున్నారు. బీజం చిన్నదే కావచ్చు. కానీ మొక్కై, మానై పెరగడానికి పెద్దగా సమయం పట్టదు. బెల్లప్పేదో, నల్లప్పేదో కాలం చెప్తది.
70వ దశకంలో ఇందిర హయాంలో చూసేవాళ్లం..
ఎండకాలం దొంగల బెడదతో
ఊళ్లో వంతులు వేసుకొని తెల్లార్లూ కాపలా గస్తీ తిరిగేవారు.
ఇపుడు మూసీ తీరంలో ప్రజలు
అదే చేస్తున్నారు. నిజమే..
ఇందిరమ్మ రాజ్యం మళ్లీ వచ్చింది!
పీఆర్ స్టంట్లు ప్రతిసారీ వర్కవుట్ కావు. చెరువుల ఆక్రమణల తొలగింపు, కాలుష్య నివారణ, ప్రక్షాళన అనే ఆదర్శ ట్యాగ్లు అంత తొందరగా ఒళ్లో వచ్చి వాలవు. ఈ ఆక్రమణలన్నీ ఏదో కేసీఆర్ హయాంలోనే జరిగినట్టు, మూసీ నది మొత్తం కేసీఆర్ ప్రభుత్వమే కాలుష్యమయం చేసినట్టుచిత్రీకరిద్దామనుకుంటే కుదరదు.
నగరంలోని చెరువుల ఆక్రమణ చరిత్ర, మూసీ కాలుష్య చరిత్ర ఇదే నగరంలో నివసించే ప్రజలకు తెలియదా? అసలు ఈ రాష్ర్టాన్ని దశాబ్దాల పాటు ఏలిందెవరు? నగరంలోని వేల కొద్దీ చెరువులన్నీ ఎవరి హయాంలో కబ్జాదారుల పాలయ్యాయి; అనే విషయం తెలియనంత అమాయకులా ప్రజలు? కేసీఆర్ ప్రభుత్వం 2020లో సేకరించిన వివరాల ప్రకారం తెలంగాణ వచ్చేనాటికి హెచ్ఎండీఏ పరిధిలో మాయమైనవి పోనూ మిగిలినవి 3,778 చెరువులు. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే చెరువుల్లో సగానికిపైగా ఆక్రమణల్లోనే ఉన్నాయని ఆ సర్వేలో తేలింది. అందులో 350 చెరువుల ఆక్రమణ కేసులు కోర్టులో ఉన్నాయని కూడా తెలిసింది. మరి ఈ ఆక్రమణలన్నీ ఎవరి హయాంలో జరిగినట్టు? ఎవరి హయాంలో జరిగిన ఆక్రమణల మీద కోర్టులో వందలాది కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు?
ఒక పక్షి కూడా తన గూడు చెరిపేస్తే తిరగబడుతుంది. ఇక్కడున్నది ఆలోచనాశక్తి ఉన్న ప్రజలు. ఢిల్లీ పెద్దల మేలు కోసం రాత్రికి రాత్రి వేలాది మంది ప్రజల గూడు లాగేస్తామంటే కుదరదు. అంతేకాదు, ప్రజలు వ్యక్తిగత నష్టం జరిగితేనే స్పందిస్తారని, ఇది కొద్దిమంది సమస్య కాబట్టి ఇతరులు పట్టించుకోరనేది తప్పుడు అంచనా. సమాజానికి సామూహిక స్పందన అనే లక్షణం ఉంటుంది. సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తారు.