తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గ్రామ పంచాయతీలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి సాధించాయి. దేశంలో 20 పంచాయతీలను ఆదర్శ పంచాయతీలుగా ఎంపికచేస్తే తెలంగాణ ఏకంగా 19 అవార్డులు సాధించింది. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన సర్పంచులు దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. హరితహారం ఒక విప్లవం లాగా సాగింది. ప్రతి పల్లెలో తడి, పొడి చెత్తకు ట్రాక్టర్ కొనుగోలు చేసినం. చెత్తను వేరు చేసేందుకు డంపింగ్ యార్డ్ నిర్మించాం. ప్రతి గ్రామంలో వైకుంఠ ద్వారాలు నిర్మించాం. ప్రతి పల్లెలో ప్రకృతి వనాలు నిర్వహించాం.
రెవెన్యూ గ్రామ పంచాయతీల్లో రైతు వేదికలు, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాం. మన ఊరు-మన బడి కార్యక్రమాలు చేపట్టాం. అలాగే, ప్రతి పల్లెలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీరోడ్లు, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశాం. 30 రోజుల ప్రణాళిక ద్వారా చెత్తాచెదారం తొలగించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు యజ్ఞంలా పనిచేశాం. 2019 నుంచి 24 వరకు మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం ద్వారా సీసీరోడ్లు, భవనాలు నిర్మించాం. అయితే, ఇప్పుడు నిధుల విడుదలలో జాప్యం వల్ల ఇబ్బందులు పడుతున్నాం.
అప్పట్లో కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేక ప్రతినెల గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధుల్లో జాప్యం జరిగింది. దీంతో అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్… సర్పంచుల వైపు ఉన్నట్టు నమ్మించి, మాయమాటలు చెప్పి ఇందిరాపార్క్ వద్ద సర్పంచ్‌లతో ధర్నా చేయించింది. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి మా వైపున మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బిల్లులపై ఆయనకు వినతిపత్రం ఇస్తే కనీసం స్పందించలేదు. ఇప్పటికి మూడుసార్లు వినతిపత్రం అందించాం. ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమంలో బిల్లుల గురించి దరఖాస్తు చేసుకోవాలని చెప్తే అక్కడా చేసుకున్నాం. దరఖాస్తు చేసి మూడు నెలలైనా స్పందనలేదు.
ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అందరికీ మా సమస్యను చెప్పి బిల్లులు విడుదల చేయాలని అడిగితే రేపు, మాపు అంటూ దాటవేస్తున్నారు. ఎంపీడీవోలు మొదలు కలెక్టర్లు, పంచాయతీరాజ్ కమిషనర్‌కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి బిల్లుల కోసం మొరపెట్టుకున్నాం. అడిగినప్పుడల్లా నెల రోజులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల తర్వాత బిల్లుల కోసం సీఎంను కలిసినా స్పందించలేదు. ఇక లాభం లేదని 3 వేల మంది సర్పంచులతో కలిసి సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటై ‘చలో హైదరాబాద్’ నిర్వహించి హైదరాబాద్ గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపాం. తెచ్చిన డబ్బులకు అప్పులు పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వానికి విన్నవించినా స్పందన లేకపోవడంతో పార్లమెంటు ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయిస్తే సీతక్క అడ్డుకున్నారు. త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికి 9 నెలలు గడిచాయి. బిల్లులు రాకపోవడంతో నిర్మల్ జిల్లాకు చెందిన సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ సర్పంచ్ భర్త అప్పుల బాధతో మరణించాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాలా శంకర్ నాయక్ వైద్యానికి డబ్బుల్లేక మరణించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. డిసెంబర్ లోపు పంచాయతీలకు బిల్లులు చెల్లిస్తామని మంత్రి పొన్నం చెప్పినా ఇప్పటి వరకు విడుదల కాలేదు.
మా సమస్యలు పరిష్కారం కాకుంటే గాంధీ మార్గంలో ‘చలో సెక్రటేరియట్’ నిర్వహించి శాంతియుతంగా నిరసన తెలుపుతామని పిలుపునిస్తే అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేశారు. సర్పంచులను ఇండ్ల దగ్గర అరెస్ట్ చేసి హైదరాబాద్ రాకుండా అడ్డుకున్నారు. ఇంకెన్నాళ్లు మాకీ గోస? గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా, అభివృద్ధి పనులను అడ్డుకోవడం సీఎంకు సరికాదు. మేం చేసిన అభివృద్ధి పనుల బిల్లులు వెంటనే చెల్లించాలి. లేదంటే ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటాం. మా పదవీకాలం అయిపోయి 13 నెలలు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అప్పులు భరించలేక సర్పంచ్ కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి పెండింగ్ బిల్లులు ఇప్పించాలని వేడుకుంటున్నాం.
– సుర్వి యాదయ్య గౌడ్
తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు