తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక చేసిన అప్పులు, ఆస్తుల లెక్కలపై పార్లమెంట్ ఇచ్చిన జవాబుతో తెలంగాణ సమాజానికి మా గొప్ప మేలు జరిగింది. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని చూసి ఆ ప్రశ్న అడిగిన ఎంపీతోపాటు రెండు జాతీయ పార్టీల నేతలు బిత్తరపోయారు. అప్పటినుంచి ఏం మాట్లాడాల్నో తెలియక వారంతా కుక్కిన పేనులా ఉంటున్నరు.
తెలంగాణ సాధకుడిపైనా, ఆయన పరిపాలనపైనా అబద్ధాలాడి, నోటికొచ్చినట్టు వాగి బద్నాం చేసిన నోళ్లన్నీ ఇప్పుడు మూతపడ్డాయి. నిన్నమొన్నటిదాకా సోషల్ మీడియాలో తెగ అరిచిన కాకులు, పిట్టలన్నీ ఇప్పుడెక్కడికి ఎగిరిపోయినయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకరంటే.. కాదు కాదు, రూ.7 లక్షల కోట్లు అని ఇంకొకరు.. నోటికి ఏదొస్తే అది, ఎంతొస్తే అంత… నరం లేని నాలుక ఏం మాట్లాడినా చెల్లుతుందని భావించినవారు ఇప్పుడు కేంద్రం ఇచ్చిన జవాబు మీద చర్చ చేస్తరా? బండన్నలు, కొండన్నలు ఇప్పుడేం మాట్లాడతరు? కేసీఆర్ తెచ్చిన అప్పులకు నెల నెలా రూ.10 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని ఊదరగొట్టిన మొఖాలు ఇప్పుడెక్కడ దాక్కున్నయి? లోక్‌సభలో కేంద్రం ఈ వివరాలు బయటపెట్టినప్పటి నుంచి రెండు జాతీయ పార్టీలు కిక్కురుమనటం లేదు. 2024, మార్చి 31 వరకు తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రూ.3.5 లక్షల కోట్లు అని కేంద్రం తేల్చిచెప్పింది. ఇందులో తెలంగాణకు అవిభాజ్య రాష్ట్రం నుంచి వారసత్వంగా సంక్రమించిన రూ.70 వేల కోట్లతో పాటు 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులూ ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు మొత్తం అప్పుల కంటే దాదాపు యాభై వేల కోట్ల మేర పెరిగాయని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఆ అప్పులతో ఏం చేసిందని లెక్కలు తీస్తే.. అందులో రూ.లక్ష కోట్లు కేవలం ఉచిత విద్యుత్తు కోసమే ఖర్చుచేసింది. రైతుబంధుకు రూ.72 వేల కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.45 వేల కోట్లు, కల్యాణలక్ష్మికి రూ.7,200 కోట్లు, రైతు బీమాకు రూ.5 వేల కోట్లు ఖర్చుచేస్తే.. మిషన్ భగీరథకు రూ.40 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేసింది. వీటిలో సింహభాగం నీళ్లు, విద్యుత్తు మీదనే కదా ఖర్చు చేసింది? మన్నూ మశానంగా మార్చబడిన తెలంగాణ దాని ఫలితంగానే మాగాణంగా మారింది. కలెక్టరేట్లు, వ్యవసాయ వేదికలు, ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు.. ఇలా సృష్టించిన సంపద గురించి ఎన్నని చెప్పేది? ఎంతని వివరించేది? తెలంగాణ సాధకుడిని ఉరితీయాలె, కాల్చి చంపాలె, జైల్లో వేయాలె.. అంటూ ఒక పక్క రోజూ విషాగ్నిని చిమ్ముతుండాలె, ఇంకో పక్క అబద్ధాలు చెప్తూ, జనాలను మభ్యపెడుతూ ఢిల్లీకి సంచులు మోస్తూ అందలమెక్కాలె, అధికారం చెలాయించాలె. కానీ, నిజం నిప్పులాంటిది. నివురుగప్పి కొంతకాలం అణచివేయవచ్చేమో కానీ, ఒకసారి అది ఎగజిమ్మిందంటే.. ఆ అగ్నికీలలను తట్టుకోవడం ఎవరితరమూ కాదు.
– కర్నాటి విద్యాసాగర్, బీఆర్ఎస్ నాయకులు