అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అద్భుతాలు సృష్టించవచ్చు… ప్రజల మెప్పునూ పొందవచ్చు. కానీ డబ్భు ఏండ్ల కాంగ్రెస్ పాలనలో, పదేండ్ల బీజేపీ పాలనలో ఈ దేశానికి ఏం మేలు జరిగిందన్నది సూటి పశ్న. ఆ పార్టీలు ఏ వర్గ ప్రయోజనాలు నెరవేర్చాయన్నది సమాధానం లేని సందేహం. అయితే నాడు తెలంగాణలో నెర్రెలు వారిన నేలలు.. ఇవాళ పచ్చని పొలాలు. చెరువుల్లో పుష్కలంగా నీళ్లు, అందులో జీవరాశుల చప్పుడుతో ఎటూ చూసినా ఆహ్లాదకర వాతావరణంతో తెలంగాణ పల్లెలు విలసిల్లుతున్నాయి. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా కేసీఆర్ విజనరీ నాయకత్వంపై సమగ్ర చర్చ జరుగుతున్నది.
తెగించి కొట్లాడి ఓ రాష్ర్టాన్ని తెచ్చుకోవడం ఒక ఎత్తయితే తెచ్చుకున్న ఆ రాష్ర్టాన్ని వందేండ్లు పదిలంగా ఉండేలా ఎంత సుభిక్షంగా, సుస్థిరంగా కేసీఆర్ కాపాడుతున్నారో యావత్తు దేశం గమనిస్తున్నది. అందుకే కేసీఆర్ గతం లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తీరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా అమలు చేస్తున్న ఆలోచనలు, పథకాలు, పనితీరుపై పెద్ద ఎత్తున అధ్యయనాలు జరుగుతున్నా యి. అరవై ఏండ్ల పరాయి పాలనలో నీళ్ల విషయంలో తెలంగాణ దగా పడిందని అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాగునీటి రంగంలో విజయం సాధించింది. కాళేశ్వ రం తదితర ప్రాజెక్టుల ద్వారా చెరువులు, కుంటలు, వాగు లు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. పరాయి పాలనలో తాగు, సాగునీటి గోస అంతా ఇంతా కాదు. మొన్నటి వరకు అనేక నదుల అనుసంధానం, ట్రిబ్యునళ్ల గొడవలతో సరిహద్దు రాష్ర్టాలతో జల జగడాలు నిత్యకృత్యమయ్యేవి. అందుకే ఉద్యమ సమయంలో బేసిన్లు లేవు…భేషజాలు లేవని కేసీఆర్ పదే పదే చెప్పేవారు. కానీ బేసిన్ల భేషజాలను కేసీఆర్ పూర్తిగా చెరిపేసి కృష్ణా, గోదావరి నీటితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణ చరిత్రలోనే ఓ కలికితురాయిగా చెప్పాలి. ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయంగా ఈ ఎత్తిపోతలను అభివర్ణించక తప్పదు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకం అసాధ్యమని చాలా మంది సీఎంలు చేతులెత్తేసి పాలమూరుకు వలసల గోస పెట్టారు. కానీ నేడు ఈ ప్రాజెక్టుకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినా రాష్ట్ర పభుత్వం సొంత నిధులు దాదాపు రూ.25 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఫలితంగా ఈ ప్రాజెక్టు వల్ల కరువు నేలకు శాశ్వత పరిష్కారం లభించింది.
ఇదంతా కేవలం సీఎం కేసీఆర్ వల్లే జరిగిందని చెప్పక తప్పదు. తెలంగాణ రైతాంగం కోసం ప్రాజెక్టులను తానే రీ డిజైన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించి 19.63 లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టించారు. 18.83 లక్షల ఎకరాలను స్థిరీకరించేందుకు ప్రణాళికలు రచించారు. 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరించి ఉన్నది. శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకానికి సైతం కాళేశ్వరం జలాలను ఉపయోగిస్తున్నారు. రికార్డు సమయంలో భారీ ప్రాజెక్టును పూర్తిచేయడం ఒక విశేషమైతే, దాని ఫలాలు తెలంగాణ అంతటికీ అందించటం మరో విశేషం. ఒకప్పుడు గోదావరి నుంచి 90 టీఎంసీలను కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేని దుస్థితి. నేడు గరిష్ఠంగా 400 టీఎంసీలకు పైగా వినియోగించుకునే స్థాయికి ఎదిగామంటే సాధించిన ప్రగతి ఎంతో అర్థం చేసుకోవచ్చు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా కాకతీయ కాల్వ చిట్ట చివరి భూముల వరకు గోదావరి జలాలు పుష్కలంగా అందుతున్నాయి.
ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో నిర్మించటం విశేషం. కాళే శ్వరం ప్రాజెక్టు కింద 3 ఆనకట్టలు, 22 లిప్టులు, 21 భారీ పంపుహౌజులు, 15 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల మేర సొ రంగ మార్గాలు, 1531 కిలోమీటర్ల పొడ వున కాలువలు కేవలం 36 నెలల స్వల్ప వ్యవధిలో నిర్మించారు. సముద్ర మట్టం నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలు ఎత్తిపోస్తున్నారు.
వివిధ సాగునీటి ప్రాజెక్టుల వల్ల తొమ్మిదిన్నరేండ్లలోనే తెలంగాణ జల మాగాణమైంది. దీనికి కారణం సీఎం కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి మాత్రమే. ఒక నాయకుడి ఆలోచన వెయ్యేండ్ల దూరదృష్టిని ఆవిష్కరిస్తున్నది. కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు, ముఖ్యంగా సాగునీటి రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఇవాళ తెలంగాణ దశను మార్చుతున్నాయి. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను సైతం కేసీఆర్ పూర్తి చేస్తున్నారు.
ఇకపోతే తెలంగాణలో జాతీయ ప్రాజెక్టులు నిర్మిస్తామని, ఉన్నవాటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటిస్తామని నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు చెప్పగా, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఇదే విషయాలను బహిరంగ సభల్లో ప్రకటించి వెళ్లారే తప్ప నేటికీ ఆ ఊసే లేదు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వాల కు వివక్షే తప్ప న్యాయం, సాయం చేద్దామన్న ఆలోచన లేకపోవడం విడ్డూరం. కేంద్ర ప్రభుత్వాలు, జాతీయ పార్టీలు తెలంగాణ ప్రాజెక్టుల పట్ల సవతి తల్లి ప్రేమ కనబరిచినా కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గకుండా తాగు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మి స్తూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడుతుండటం ముదావహం.