పాలమూరు అంటే ఒకప్పుడు కరువు పాట. బతుకు పల్లేర్ల బాట. సాగుభూమి దండిగా ఉండీ చుక్క నీరందని దైన్యం.. పాలమూరు బిడ్డలు దేశవిదేశాల్లో అడ్డాకూలీలుగా మారిన హైన్యం. స్వరాష్ట్ర సాధనతో, బీఆర్ఎస్ పాలనతో పాలమూరు కష్టాలు గతచరిత్ర అయ్యాయి. గోస తెలిసిన నేత పరిపాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే పాలమూరు సమస్యలకు మూలమైన నీటి సమస్యపైనే ప్రత్యేకంగా దృష్టి నిలిపారు. ఉమ్మడి పాలనలో పాలకులు పడావు పెట్టిన ఎత్తిపోతల పథకాల దుమ్ము దులిపారు. ఆగమేఘాల మీద పనులను పరుగులు తీయించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ భీమా, కోయిల్ సాగర్ నాలుగు ఎత్తిపోతలతో నెర్రెలు వారిన భూమి దాహం తీర్చారు.
పదేండ్లలో నికరంగా పది లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటిని సమకూర్చి చరిత్రలో నిలిచారు. అబ్బురపరిచే ‘తిరుగు వలస’లతో కూడిన పాలమూరు పునరుజ్జీవనానికి అద్దం పట్టింది ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)’ తాజా నివేదిక. కేసీఆర్ తదేక దీక్షతో పూర్తిచేసిన ఆ నాలుగు ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలపైనే ప్రత్యేక దృష్టితో శాస్త్రీయమైన రీతిలో జరిపిన సర్వే ఆధారంగా రూపొందించిన ఆ నివేదిక కేసీఆర్ పాలన అందించిన జలకళతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు బాగుపడిన వైనాన్ని ఆధారాలతో సహా ధ్రువీకరించింది.
కేసీఆర్ కల నెరవేరింది. నీరు పారింది. పాలమూరు తీరు మారింది. పొలం పచ్చగా నవ్వింది. పంటల విస్తీర్ణం పెరిగి ఉపాధి మెరుగైంది. ఒకనాటి వలసల జిల్లా నేడు ప్రగతికి చిరునామా అయ్యింది. పని వెతుక్కుంటూ పరసీమలకు పోయినవాళ్లు సొంతూళ్లకు తిరిగి రావడం మొదలైంది. ఇవన్నీ పాలమూరు ముఖచిత్రం మారిన తీరుకు అద్దం పట్టాయి. రైతుల సంఖ్య 58 శాతం నుంచి 84 శాతానికి పెరగడం, మెట్ట సాగు 44 శాతం నుంచి 16 శాతానికి తగ్గడం నీటిపారుదల పెరిగిన చలువే. మరోవైపు భూగర్భ జలాలు పెరుగడంతో వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన రైతుల సంఖ్య 45 శాతం నుంచి 20 శాతానికి తగ్గిపోయింది. సంప్రదాయ సాగు తగ్గి వాణిజ్య పంటలైన వరి, పత్తి సాగు పెరిగింది. తద్వారా రైతుల ఆదాయాలూ పెరిగాయి. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణను నిలబెట్టడంలో పాలమూరు అండదండలు అందించే స్థాయికి ఎదిగింది.
సెస్ అధ్యయనం పూర్తిగా సాగుకు మాత్రమే పరిమితం కాలేదు. కరువు ప్రాంతంగా పేరుపడిన గడ్డపై రెండు సీజన్లలో పంటలు వేసే పరిస్థితి రావడం వల్ల ఇతర రంగాల్లోనూ ఉపాధి ఉగ్గడించడం వల్ల కూడా వలసలు తగ్గుముఖం పట్టాయని నివేదిక తేల్చిచెప్పడం గమనార్హం. వలసల నుంచి తిరిగివచ్చిన వారిలో 57 శాతం మంది కూలీలు, 28 శాతం మంది రైతులతో పాటుగా 14 శాతం మంది సంప్రదాయ కులవృత్తులవారు ఉండటమే అందుకు నిదర్శనం. సర్వేతోపాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచురించిన నివేదికలనూ విశ్లేషించి రూపొందించిన నివేదిక ఉమ్మడి పాలమూరు సాధించిన సమగ్ర వికాసాన్ని ఆవిష్కరించింది. నివేదిక నిగ్గు తేల్చిన నిజాలు కేసీఆర్ దార్శనికతకు, పరిపాలనా దక్షతకు జేజేలు పలికాయి. కేసీఆర్ కీర్తి కిరీటంలో ఇది మరో కలికితురాయి అని చెప్పక తప్పదు.