నాయకులు మర్యాదగా నడుచుకోవాలి, నలుగురు మెచ్చుకునేలా వ్యవహరించాలి. అందునా కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాన్ని నడుపుతున్నవారు ఇంకా జాగ్రత్తగా మెదలాలి. అంతేగానీ అధికారం ఉందనే అహంతో ఒంటెత్తుపోకడలతో, హుందాతనాన్ని మరిచి ముందుకెళ్తామంటే వెగటు పుడుతుంది. జనాల్లో వ్యతిరేకతా పెరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరగణం నెరుపుతున్న వ్యవహారమే అందుకు నిదర్శనం.
రాష్ట్ర ప్రజలందరికీ ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఆదర్శంగా సాగాల్సిన వారు అన్నీ మరిచి పాలన సాగించడం ఆక్షేపణీయం. రేవంత్ సర్కార్ కొలువుదీరిన నాటి నుంచి అరాచక శక్తులు పేట్రేగిపోతున్న ఛాయలు చూస్తూనే ఉన్నాం. కాలం గడుస్తున్నకొద్ద్దీ ప్రవర్తనలో మార్పులు రావాలి. అనుభవం పెరుగుతున్నకొద్ద్దీ నడక, నడవడికలో పరివర్తన కనిపించాలి. అలాకాకుండా దౌర్జన్యాలే హద్దుగా సాగుతామంటే ఓటేసి కూర్చోబెట్టిన వారే సీటు నుంచి దింపి, శంకరగిరిమాన్యాలకు పంపిస్తారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎం ఫొటో ఉండాలని కాంగ్రెస్ అల్లరిమూకలు, ముఖ్యమంత్రి అభిమానులుగా చెప్పుకుంటున్నవారు బలవంతంగా తెలంగాణ జాతిపిత, రాష్ట్ర సాధనలో చావును ముద్దాడి నాలుగు కోట్ల బిడ్డల కోసం వెరవకుండా, వెనుకాడకుండా పోరాడిన ఉద్యమ నేత, రాజకీయ దురంధరుడు కేసీఆర్ క్యాంపు ఆఫీస్‌పై దాడికి దిగడం యావత్ రాష్ర్టానికే కాదు, దేశానికే తలవంపులు తెచ్చే దౌర్భాగ్యపు ఘటన.
ప్రజాసేవలో దేశం అబ్బురపడేలా సాగిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల అరాచక దాడి యావత్జాతికే అవమానం. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ పాలన సాగిస్తున్న రేవంత్ జాతికి అందిస్తున్న అణిముత్యాలే నేడు కార్యాలయంపై దాడి చేసిన మెరికలు అనుకోవచ్చునేమో? ప్రతిపక్షం, అధికార పక్షం సమఉజ్జీలుగా ఉంటేనే పాలన సక్రమంగా సాగుతుంది. పవర్ ఉందని ఒంటెత్తు పోకడలు పోతున్న అధికార పార్టీని గాడిలో పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీపైనే ఉంటుంది. ఈ క్రమంలో అయిన దానికి, కానిదానికి సర్కార్‌లో ఉన్నవారు బాధ్యతను విస్మరించి ప్రతిపక్షంపై పడి నోరుపారేసుకోవడం ప్రజాభీష్టానికి తిలోదకాలు వదలడంగానే భావించాల్సి ఉంటుంది.
ఇప్పుడు సర్కార్‌లో కూర్చున్న కాంగ్రెస్ పెద్దలు కూడా ప్రతి విషయానికి ప్రతిపక్షమైన బీఆర్ఎస్పై పడటం, తప్పులెన్నడానికే చట్టసభలను ఎంచుకుని వల్లెవేయడం సర్వసాధారణమైంది. కేసీఆర్‌ను ప్రతి సందర్భంలోనూ తిట్టడం, బద్నాం చేస్తున్న రేవంత్ అండ్ టీం పెడధోరణిని సమాజం తీక్షణంగా గమనిస్తూనే ఉన్నది. రాజకీయాల్లో హుందాగా నడుచుకుంటూ ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వ తీరును గాడిలో పెట్టడానికి అహర్నిశలు శ్రమిస్తున్న పెద్దాయనపై సీఎంకి ఎంతకీ కోపం చల్లారడం లేదు. అధికారంలో ఉండి ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుకు కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి, ధ్వంసరచన నిదర్శనంగా నిలుస్తుంది.
ఎవరు అవునన్నా..కాదన్నా..తెలంగాణను రోల్‌మోడల్‌గా నిలిపిన నాయకుడు కేసీఆర్. కేవలం పదేండ్లలోనే ప్రతి వర్గానికి ఫలాలు అందించే కార్యక్రమాలు, పథకాల రూపశిల్పిగా ఆయన చేసిన పనులే సజీవ సాక్ష్యం. అంతటి ముందుచూపున్న మహనీయుడిని తూలనాడడం, ఆయన ఆనవాళ్లను తొలగించాలని కుట్రలు పన్నుతూ నేడు స్వయంగా ఆయన క్యాంపు ఆఫీస్‌లోకి మూకలను ఉసిగొల్పి చేతగాని పనికి ప్రేరేపించిన తీరు గర్హనీయం.గతంలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ సర్కార్‌ను ఉద్దేశించి ప్రజలిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని అద్భుతంగా పాలన సాగించి జనాల్లో ఉత్తములుగా ఎదగాలని ఆశీస్సులు అందించిన విషయాన్నైనా ప్రభుత్వ పెద్దలు చెవికి ఎక్కించుకోవాల్సి ఉన్నది. గతంలోనే కేటీఆర్, హరీశ్‌రావు క్యాంపు కార్యాలయాలపై కూడా దాడి ఘటనలు మరువకముందే ఇప్పుడు ఇలా చేయడం మరింత హేయం.
వాస్తవానికి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల్లో సర్కార్ పెద్దలు ముఖ్యమంత్రి లేదా ప్రధాని వంటి వారి ఫొటోలు పెట్టడం తప్పనిసరి అని ఎక్కడా ప్రస్తావించలేదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ఆఫీసు కాదని, శాసనసభ్యుడి వ్యక్తిగత లేదా రాజకీయ కార్యాలయమని, ఇష్టమైన ఫొటోలు పెట్టుకునే అధికారం సంబంధిత ఎమ్మెల్యేకు ఉంటాయని గమనించాలి. గతంలో తమిళనాడు హైకోర్టు సైతం సెక్రటేరియట్, డిస్ట్రిక్ట్ ఆఫీసుల్లో మాత్రమే రాష్ట్రపతి, ప్రధాని, సీఎం వంటి వారికి అధికారిక ఫొటోలు ఉంటాయని, అదీ ఎమ్మెల్యే ఇష్టాయిష్టాలే తప్ప తప్పనిసరి కాదనే తీర్పునూ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలి.
చరిత్రను తిరగరాసిన మహానుభావుడిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే మంటెక్కిపోతున్న ఆయా వర్గాలకు ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ దాడి పుండుమీద కారంగా పరిణమించింది. పాపం పండాలనే సమయం కోసం చూస్తున్న సమస్త తెలంగాణ జనం త్వరలోనే ‘తీర్పు’ అనే ఆయుధంతో తొక్కేయడం తథ్యం. మార్చుకుని కనీసం పార్టీగానైనా మనగలుగుతారు. లేదంటే అధఃపాతాళానికో, అంపశయ్యకో చేరడం తప్పదని ప్రభుత్వ పెద్దలు గమనిస్తే మంచిది.
– గోసుల శ్రీనివాస్ యాదవ్ 98498 16817