శ్రీశ్రీ దగ్గర ఎవరో ఆరుద్ర గురించి ‘మీ శిష్యరత్నం’ అని ప్రస్తావించారట. దానికాయన ‘శిష్యుడంటే తను ఒప్పుకోడు.. రత్నమంటే నేను ఒప్పుకోను’ అని అన్నారట. చంద్రబాబు-రేవంత్ రెడ్డి అనుబంధం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ చమత్కార సమాధానం సందర్భోచితంగా ఉంటుంది. ప్రస్తుతం రాజకీయంగా ఎన్డీయే, ఇండియా కూటములనే వైరివర్గాల్లో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం జగమెరిగినదే. అంతా రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడిగా చెప్పుకొంటారు. కానీ, ఆ మాటంటే రేవంత్‌కు కోపం. సాక్షాత్తూ ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ పోలికపై చిందులు తొక్కారు. తన అయిష్టతను కొద్దిగా అసభ్యంగా ధ్వనించే భాషలో వెల్లడించారు. ‘సహచరులు’ అని పిలవాలనేది రేవంత్ కోరిక. ఎలా పిలవాలన్న సంగతిని అలా ఉంచితే ఇద్దరూ గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగానో, నిలువుగానో దొరికిపోయి ఇగిలించారు.
ఇద్దరూ ప్రస్తుతం రెండు రాష్ర్టాలకు ముఖ్యమంత్రులు. రెండు కండ్ల సిద్ధాంతంతో తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర ఒకరిది. తెలంగాణ ఉద్యమకారులపైకి ఉన్మాదంతో ఉరికిన మరక మరొకరిది. పదేండ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న విభజన సమస్యలపై ఇద్దరూ భేటీ అయ్యారు. మామూలుగా అయితే అధికారుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో ఏదైనా ఖరారైతే చివరగా సీఎంలు కలిసి కూర్చుని ఓ ఒప్పందానికి రావాలి. అంతకుమించి ఈ భేటీకి పెద్దగా ప్రాముఖ్యం ఉండదు. కమిటీలు వేయాలని తీర్మానించడానికి ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ తన సహచరుడు ఉన్నాడన్న ధీమాతో తెలంగాణలో తన ఉనికిని చాటుకునేందుకు జరిపిన ప్రయత్నంగానే చంద్రబాబు పర్యటన కనిపించింది. ఊరేగింపులు, హోర్డింగులతో హోరెత్తించడం, బాబు అనుకూల మీడియా సంబరాలు చేయడమే ఇందుకు సాక్ష్యం. బిచాణా ఎత్తేసి అమరావతికి పరుగుతీసిన బాబు ధోరణిలో తాజాగా వస్తున్న మార్పును తెలంగాణ ప్రజలు గమనించకపోలేదు.
ఆయనలో ఎక్కడో, ఏ మూలనో ఆశలు చిగురిస్తున్నట్టున్నాయి. లేకపోతే ఆయన నోట మరోసారి రెండుకండ్ల సిద్ధాంతం వినిపించడం ఏమిటి? తెలంగాణలో పూర్తిగా మూసుకుపోయిన రెండోకన్నును తిరిగి తెరిపించేందుకు ప్రయత్నిస్తానని అనడం ఏమిటి? తెలంగాణలో అంతరించిపోయిన పార్టీ పేరిట ఎన్టీఆర్ భవన్లో సమావేశం పెట్టడమేమిటి? ఇక్కడి ప్రజలపై బాబు అధికారంలో ఉన్నప్పడు సాగించిన అణచివేత గురించి తెలియంది ఎవరికి? చివరి నిమిషంలో తెలంగాణకు అడ్డుపడి ఎందరి ప్రాణాలను బలిగొన్నాడో గుర్తుచేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో సైతం తెలంగాణ అనకూడదని శాసించిన సంగతిని సబ్బండవర్గాలు ఇంకా మరిచిపోలేదు. ఆ రోజుల్లో బాబుతో చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన రేవంత్‌కు ఇవన్నీ పెద్ద విషయాలు కాకపోవచ్చు. కానీ, తెలంగాణ ప్రజలకు అదొక చీకటి పాలన, నెత్తుటి జ్ఞాపకం. అందుకే ఆయన పార్టీని ఇక్కడ అంటుకు లేకుండా చేశారు.
జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తే తెలంగాణ వ్యతిరేక శక్తులు మళ్లీ ఒక్కటవుతున్నాయనే విషయం అర్థమవుతున్నది. ఆ శక్తులకు రింగ్ లీడర్‌గా చంద్రబాబు ముందుకు రాజూస్తున్నారు. మరోసారి ఇక్కడి వనరులపై ఆధిపత్యానికి తెరవెనుక కుట్ర ఏదో ఊపిరిపోసుకుంటున్నది. జై తెలంగాణ అనడానికే ఇష్టపడని మనిషి బాబు కోసం ద్వారాలు తెరిచి ఎర్రతివాచీ పరుస్తున్నారు. తెలంగాణ స్వాభిమానానికి, సార్వభౌమాధికారానికి ముప్పు తొంగిచూస్తున్నది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాటు వేసేందుకు కాలనాగులు పొంచిచూస్తున్నాయి. తెలంగాణ అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది.