తెలంగాణలో మేధావులు అనబడేవారు ఏ విషయం గురించి ఏమంటారా అని సమాజం ఎదురుచూస్తుంటుంది. ఆ విధంగా, 2014-15 నుంచి 2023-24 మధ్య పదేండ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన హ్యాండ్‌బుక్‌లో కొద్దిరోజుల క్రితం పేర్కొన్న వివరాల గురించి వారు ఏమంటారోనని కూడా సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉండి ఉంటుంది. కానీ, కనీసం ఇంతవరకైతే వారి నుంచి ఎటువంటి వ్యాఖ్యానాలు వినిపించలేదు. హ్యాండ్‌బుక్ చెప్పిన లెక్కలను ఇంకా పరిశీలిస్తున్నారో, లేక వారి మౌనానికి మరేదైనా కారణం ఉందో తెలియదు.
రిజర్వ్ బ్యాంక్ నివేదికపై మేధావుల అభిప్రాయాలను సమాజం తెలుసుకోవాలనుకోవటానికి సాధారణమైన ఆసక్తి మాత్రమే గాక ఒక ప్రత్యేక కారణం ఉన్నది. పైన పేర్కొన్న పదేండ్ల కాలంలో పాలించిన బీఆర్ఎస్ కాలంలో చాలా అభివృద్ది జరిగిందని ఆ పార్టీ చెప్తుండగా, జరిగిందంతా సర్వనాశనం, ఆర్థిక విధ్వంసం, అంతా అప్పుల కుప్ప, యాభై ఏండ్లు వెనుకకుపోవటమని కాంగ్రెస్ విమర్శిస్తూ వస్తున్నది. ప్రజల స్వానుభావాలు ఏమిటన్నది అట్లుంచితే, ఇటువంటి పరస్పర విరుద్ధ ప్రచారాలు వారిలో కొందరికి అయోమయాన్ని సృష్టించాయి. అట్లాంటి పరిస్థితి తలెత్తినప్పుడు, తటస్థులుగా, సమాజం పక్షాన నిలిచేవారిగా, స్వతంత్ర పరిశీలనలు చేసి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే బాధ్యత మేధావులు అనబడే వారిపై ఉంటుంది. తమ నుంచి సమాజం ఆశించేది అదే. ఆ పని చేయనప్పుడు వారి ఉనికికే అర్థం ఉండదు. లేదా వారు కపటపు మేధావులనే పేరు తెచ్చుకుంటారు.
కనుక, మేధావి బృందాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటూ, రిజర్వ్ బ్యాంక్ నివేదికపై రాగల రోజులలోనైనా తమ ఆలోచనలను వెల్లడించగలరని ప్రజలు ఆశిస్తారు. అయితే, గత పదేండ్లుగా వారి రికార్డులను గమనించినప్పుడు మాత్రం అటువంటి ఆశాభావం అంతగా కలగటం లేదు. ఈ మాట అనేందుకు కొన్ని కారణాలున్నాయి. మొదటిది, బ్యాంక్ వారు పదేండ్ల లెక్కలన్నింటిని క్రోడీకరించి హ్యాండ్‌బుక్ రూపంలో ఇప్పుడు ప్రకటించి ఉండవచ్చు. కానీ, ఆ వివరాలు ఇప్పుడు అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చినవి కావు. జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు ఆ కాలమంతా ఎప్పటికప్పుడు కండ్ల ఎదుట కనిపిస్తుండినవే. అప్పటి ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చినవే. అదిగాక, ఆర్బీఐ తరహాలోనే కేంద్ర ఆర్థిక శాఖ, ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్, పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలు, ప్రైవేట్ వ్యాపారసంస్థల సంఘాలు, వాటి ప్రముఖులు చెప్తూ వచ్చినవే. ఈ సమస్తం కూడా నిజం కాదని ఒకవేళ మేధావులు భావించి ఉంటే తమ వైపు నుంచి స్వతంత్ర పరిశీలనలు చేసి వాస్తవాలేమిటో ప్రజల ముందు ఉంచవచ్చు. వారికి ఒకవైపు పబ్లిక్ డొమెన్లో డేటా కుప్పలుతెప్పలుగా ఉంది. మరొకవైపు క్షేత్రస్థాయి పరిశీలనలకు గ్రామాలు, పట్టణాలు ఎదురుగా ఉన్నాయి. కానీ, వారు అటువంటివేమీ ఎప్పుడూ చేయలేదు.
మేధావుల రికార్డు అంటున్నవాటిలో ఇది ఒక అంశం కాగా, వారు మరొక అడుగు ముందుకువెళ్లి కాంగ్రెస్ ఏమి చెప్తే అది తలపై మోసుకుంటూ అప్పటి ప్రభుత్వంపై నానా ప్రచారాలన్నీ చేశారు. సంక్షేమం అరకొర అన్నారు, అభివృద్ధి శూన్యమన్నారు అప్పులు భయంకరంగా పెరిగాయన్నారు. కొందరు మహాశయులైతే, పరిస్థితి ఇంతకన్న ఉమ్మడి రాష్ట్రంలో బాగుండేదని, తెలంగాణ రాకపోయినా బాగుండేదేమోనని అనేంతవరకు వెళ్లా రు. ఇటువంటి గ్యాంగ్‌లో ఎవరెవరున్నారో అందరికీ తెలిసిందే గనుక ఆ పేర్లు ఇక్కడ రాయటం లేదు. మొత్తానికి ఇది రెండవ అంశం కాగా, ఈ బృందం మేధావులు గత ఎన్నికల్లో ఏకంగా కాం గ్రెస్ ప్రచార రథాలకు జెండాలూపే స్థాయికి పతనమయ్యారు. తమ తీరును తమ హక్కుల వేదికలకే చెందిన ఇతర ప్రముఖులు, సభ్యులు వ్యతిరేకించినా వెనక్కి తగ్గలేదు. ఇది మూడవ అంశం.
చివరిదైన నాల్గవ అంశం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంగా వారు తీసుకుంటూ వస్తున్న వైఖరి ఏమిటన్నది. వందరోజుల గడువుతో బాండ్ పేపర్లపై సంతకాలు చేసి ఇంటింటికీ తిరిగి పంచిన హామీల అమలు విషయంలో గాని, ఈ సరికి ఏడాది కాలం కూడా పూర్తయిన పరిస్థితిలో గాని, ఈ మధ్య కాలంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పింఛన్లు, విద్య, వైద్యరంగాలు, సంక్షేమ హాస్టళ్లు, మానవహక్కులు, హైడ్రా, గిరిజనుల భూములు, ఛప్పన్నారు ఇతర హామీలు, నిరంతరం అసత్యపు మాటలు, బుకాయింపుల వంటి విషయాలలో గాని వీరు అసలేమైనా మాట్లాడారా? మాట్లాడితే ఏమిటన్నది ప్రశ్న. వీటన్నింటిలో రెండే రెండు మాత్రం చూద్దాం. వంద రోజుల గడువు హామీల గురించి ఆ తర్వాత కొన్ని నెలలు గడిచిన మీదట ఈ బృందంలోని ఒక ప్రముఖుడిని ఒక పాత్రికేయుడు ప్రశ్నించగా, తలదించుకుని నీళ్లు నములుతూ, వినిపించీ వినిపించని స్వరంతో, ఆర్థిక ఇబ్బందుల గురించి, గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల భారం గురించి మాట్లాడారు. అమలు చేయలేకపోవటానికి తన మేధావితనంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సాకులు వెతికిపెట్టబూనారు. ఇక్కడ రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందంటూ ఎన్నికల సమయంలో హోరెత్తించిన ప్రస్తుత పాలకులకు వారి మద్దతుదారులైన ఈ మేధావులకు, వాటి అమలుకు నిధులు కష్టమని అప్పుడు తెలియలేదా? పోతే, అప్పుల భారమన్న ప్రచారమే అబద్ధమని ఇప్పుడు ఆర్బీఐ రిపోర్టుతో తేలుతున్నప్పుడు, ఏలినవారు దిక్కులు చూస్తుండవచ్చుగాని ఈ ఘనమైన మేధావులు ఏమంటారు? ఇక రెండవ ది నిరుద్యోగుల సమస్య. జరుగుతున్నదానిని అదే మేధావితో ప్రస్తావించగా అదేవిధంగా నేల చూపు లు చూస్తూ, ఇది ప్రమాదకరంగా ఉంది, ఏమవుతుందోనని నసుగుతారు. మరొక మేధావి, ఏమి జరుగుతుందో చూసి వచ్చే ఎన్నికల సమయంలో మాట్లాడతామంటారు! ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అసాధ్యమని వారికి ముందు తెలియదా?
నిజాయితీ లేని వారిని అసలు మేధావులు అనవచ్చునా అనే మౌలికమైన సందేహాలు అట్లుంచితే, ప్రస్తుతం తెలంగాణ సమాజం ఎదుట గల రిజర్వ్ బ్యాంక్ హ్యాండ్ బుక్ గణాంకాల గురించి ఈ మేధావి గణాలు ఏమనేదీ వినాలని ఎంతో ఉత్సుకతగా ఉంది. అవి వారి గొంతులో పచ్చి వెలక్కాయ వలె మింగలేని, కక్కలేని విధంగా ఇరుక్కుని ఉన్నాయా? లేక , ఆ లెక్కలన్నీ తప్పంటూ తమ ప్రియమైన పార్టీని, ప్రభుత్వాన్ని ఏ విధంగా సమర్థించాలా అని మేధోమథనాలు చేస్తున్నారా? లేక కనీసం ఇప్పటికైనా నిజాయితీపరులుగా పరివర్తన చెంది తెలంగాణ ప్రజలకు నిజాలను చెప్తూ, తమ ఇంతకాలపు నిజాయితీరాహిత్యానికి క్షమాపణలు ప్రకటిస్తారా?
ఆర్బీఐ నిర్ధారించిన వివరాలనేకం ఇదే పత్రిక లో ఈ శని, ఆది, సోమవారాలలో వెలువడినవే అయినందున, అవి ఇక్కడ మళ్లీ రాయవలసిన అవసరం ఉందని భావించటం లేదు. అయినప్పటికీ కొండగుర్తుల వలె రెండు మాటలు చెప్పుకోవాలంటే, ఏడు లక్షల కోట్ల అప్పులనేవి తప్పు లెక్క, అది మూడు లక్షల చిల్లర మాత్రమేనన్న వాస్తవంతో సహా అనేక విషయాలు, ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వపు సోకాల్డ్ శ్వేతపత్రంపై అసెంబ్లీ చర్చ సందర్భంగా మాజీ ఆర్థికమంత్రి హరీశ్‌రావు వెల్లడించినవే. అట్లా వివిధ రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన సాధించిన అభివృద్ధి లెక్కలన్నింటికి కూడా బీరుపోని తీరులో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ తన ఆమో ద ముద్రను వేసిందన్నది ఈ మేధావులు తమ రెండు కళ్ళూ తెరుచుకొని చూస్తారా?
వంద రోజుల గడువు హామీల గురించి ఆ తర్వాత కొన్ని నెలలు గడిచిన మీదట ఈ బృందంలోని ఒక ప్రముఖుడిని ఒక పాత్రికేయుడు ప్రశ్నించగా, తలదించుకుని నీళ్లు నములుతూ, వినిపించీ వినిపించని స్వరంతో, ఆర్థిక ఇబ్బందుల గురించి, గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల భారం గురించి మాట్లాడారు. అమలు చేయలేకపోవటానికి తన మేధావితనంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సాకులు వెతికిపెట్టబూనారు.