సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో బీజేపీ ఈసారి ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ వంటి క్లిష్టమైన కార్యాలను తలకెత్తుకోదని అనుకున్నారు. సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయాల్సిరావడమే అందుకు కారణం. అయితే, ఈ అంచనాలను పటాపంచలు చేస్తూ ప్రధాని మోదీ గత ఆగస్టు 15 నాటి ప్రసంగంలో ఏకకాల ఎన్నికల గురించి ప్రస్తావించారు. అంతులేని ఎన్నికల చక్రభ్రమణంలో నుంచి దేశాన్ని బయటపడేయాల్సి ఉందని నొక్కిచెప్పారు. అన్నట్టే బిల్లులను సిద్ధం చేసి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడం, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపడం చకచక జరిగిపోయాయి. అయితే, నాలుగు చట్ట సవరణలు, 18 రాజ్యాంగ సవరణలు చేస్తే గానీ జమిలి ఎన్నికలు సాధ్యం కావనే విషయం గమనార్హం.
మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ, గత మార్చిలో సమర్పించిన నివేదికలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ భావనను బలంగా సమర్థించింది. ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పాలనాపరమైన సుస్థిరత, విధానపరమైన స్పష్టత ఏర్పడి దేశానికి మేలు కలుగుతుందని ఆ కమిటీ అభిప్రాయపడింది. ఈ ప్రక్రియ ఓటర్లకు సౌకర్యంగా ఉంటుందని, అనవసరమైన హైరానా తప్పుతుందని, అధిక ఓటింగ్ నమోదుకు అవకాశం ఉంటుందని, దేశంపై ఎన్నికల నిర్వహణ వ్యయభారం కూడా తగ్గుతుందని ఆ కమిటీ సూచించింది.
పార్లమెంటుకు, అన్ని రాష్ర్టాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని, అదేవిధంగా 100 రోజులలోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. సూత్రప్రాయంగా అనేక పార్టీలు ఈ మార్పులకు అనుకూలమే అయినప్పటికీ అవి జరిగే తీరుతెన్నులపైనే అనేక అనుమానాలున్నాయి. వాటి నివృత్తికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. బిల్లులు ఓటింగ్‌కు వచ్చేది బడ్జెట్ సమావేశాల్లోనే కనుక దేశంలోని అన్ని వర్గాల అభిప్రాయాలను రాబట్టాలి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల అనుసంధానం ఎప్పుడు, ఎలా జరుగుతుందనే విషయంలో స్పష్టత రావాలి. అందుకు దేశవ్యాప్తంగా లోతైన చర్చ జరగాలి.
నిజానికి ఏక కాల ఎన్నికల విషయమై దేశంలో ఏకాభిప్రాయం లే దు. దీన్ని సమర్థించేవారు ఉన్నట్టుగానే వ్యతిరేకించేవారు కూడా బహుళ సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల వ్యయం తగ్గడం మొదలుకొని ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం దాకా పలు కారణాలను దీని సమర్థకులు చూపిస్తుంటారు. ప్రాంతీయ అస్తిత్వాలు, ఆకాంక్షలు వెనుకతట్టు పడతాయని, సమాఖ్యవాదానికి ముప్పు ఏర్పడుతుందని, లోక్‌సభతో పాటు అసెంబ్లీలకూ ఎన్నికలు జరిపితే జాతీయవాద ఎజెండా ముందుకువచ్చి రాష్ర్టాల ప్రాధాన్యాలు నిర్ణయాత్మకం కాకుండా పోతాయనేవి వ్యతిరేకుల ప్రధాన అభ్యంతరాలు. ఈ నేపథ్యంలో జమిలి వంటి సుదూర పర్యవసానాలు కలిగిన మార్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగువేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ముందు ఈసీకి ఎన్నికలు పెట్టండి
‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ సంగతి తర్వాత గానీ, ముందు ఎలక్షన్ కమిషన్‌కు ఎన్నికలు నిర్వహించండి. రాష్ట్రపతిని ఎన్నికల ద్వారా నియమిస్తున్నప్పుడు ఎన్నికల కమిషనర్లను ఎందుకు ఎన్నుకోకూడదు?
– ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం