అమ్మ కడుపులో బిడ్డను తిరుగనీయలె
అసెంబ్లీలో జై తెలంగాణ అననీయలె
చినుకును కురువనీయలె
కోలాటం పాటనెత్తనీయలె
కుట్రల కేసులు.. పోలీసు కంచెలు
నిర్బంధాల పహరాలు
ఉద్యమం
ఉవ్వెత్తున ఎగిసేకొద్దీ విద్రోహపు చర్యలు
ఆశయం ప్రజ్వరిల్లకుండా అనేక విద్రోహాలు
చావో రేవో సత్యాగ్రహానికి చాటింపు
అవని అంబరాన చీకటి మబ్బులు
తెలంగాణ స్వతంత్రతకై
చీకట్లను చీల్చుకొని వెలుగునివ్వాలనే ఆకాంక్ష
మలుపు మలుపులో ఉద్యమ ద్రోహాలు
కమిటీలు, కమిషన్లు, ఒప్పందాలు పెట్టుబడుల మోసాలు
నెత్తిన బరువు దించనీయరు
భుజాన కావడినెత్తుకోనీయరు
ఒడ్డును తెంచినట్టు పాలెగాళ్ల పారలు
దండుపాళెం దండులు
తాను
ఎండిన కొమ్మకు చిగురై
రావి తరువై నిలబడ్డాడు
వట్టిపోయిన బీళ్లు పూడిన చెరువుల కన్నీరు
కరువు కోరల్లో ఆత్మహత్యలు, కరెంటు చావులు,
ఆకలి చావులు భూమంతా దుక్కం దుక్కం
పదవులు గడ్డిపోసలని, తనువంతా అమరుల శ్వాసై
మిసైళ్లలా దూసుకుపోయే మాటల ధాటి
విద్రోహపు గుండెల్లో అలజడి
అరవై ఏండ్ల ఉద్యమ చరిత్రను
మలుపు తిప్పిన ఉక్కు సంకల్పం
నాలుగు కోట్ల పిడికిళ్లు
నిప్పుల గుండాలై శివమెత్తిన అస్తిత్వం
ధాన్యపు గుమ్మిగా, పూలరాసిలా జన సముద్రం
గమ్యాన్ని ముద్దాడే సాహస పౌరుషం
వంచకులను ఢీకొట్టి, కాలానికి ఎదురీది, అగ్నిపరీక్షల్లో
నిలిచి గెలిచిన ఉద్యమ దీప్తి
సిద్దిపేట కార్యక్షేత్రం
అల్గునూరు చౌరస్తా మాటుగాసిన దుండగులు
భగ్గుమన్న యూనివర్సిటీలు
బంద్‌లతో బందూకుల జల్లెడలు
దిక్కులన్నీ దిగ్బంధం
శ్రీకాంతాచారి ఆత్మాహుతి
తెలంగాణ వస్తే జైత్రయాత్ర,
లేకుంటే నా శవయాత్రని ప్రతినబూని
నడుస్తూ నిలదీస్తూ ఉరుకుతూ ఉద్యమిస్తూ
పిడికిలెత్తుతూ విప్లవిస్తూ
ప్రతికూలతలను అధిగమిస్తూ ప్రతిఘటనలనెదిరిస్తూ
ప్రజల ఆకాంక్షకై విడివిడి దారులొక్కటైన చేతనం
అందరినీ కలుపుకొనే సత్యాగ్రహ సమరం
ఉద్యమ అంబరాన పొగలు సెగలు
కదలిన కాంగ్రెస్ చిదంబరాలు
తెలంగాణ పక్రియ ప్రారంభమవుతున్నదనే
పావురం లాంటి వార్త తెల్లారకముందే
అర్ధరాత్రి అపచారమని అడ్డుపడిన
మొండిచేతుల తొండాట
నమ్మించారు నిమ్మకు నీరెత్తించారు
తూకాలకు జరిగిపోయారు, కలలను అమ్ముకున్నరు
అయినా తెలంగాణ నిప్పుల క్రాంతి
పాటా మాటా, ఆటా బాటా తెలంగాణ
కలం పొలం హలం రణం తెలంగాణ
దిక్కులు దిశలు తెలంగాణ
గుండె బావుటాన్నెగురేసి
తెలంగాణ ప్రకటనను సాధించిన దీక్షా దివస్
(నవంబర్ 29న కేసీఆర్ దీక్షా దివస్)
– వనపట్ల సుబ్బయ్య 94927 65358