కేంద్రంలో రెండు పర్యాయాలు అప్రతిహతంగా అధికార పీఠాన్ని దక్కించుకోగలిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠ రోజురోజుకు మసకబారుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఆయన హ్యాట్రిక్ సాధించడం అనుమానమే. ఈ నేపథ్యంలో భావి ప్రధాని ఎవరనే ఆసక్తికర చర్చ సాగుతున్నది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా చతికిలబడినందున.. తదుపరి ప్రధానిగా ప్రాంతీయపార్టీల అధినేతలకే అవకాశం ఉండవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం 12 రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ వీటిలో ఐదారు పెద్ద రాష్ర్టాలు మినహా మిగతావన్నీ చిన్న రాష్ర్టాలే. బీజేపీ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం లోక్‌సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయినట్టే. యూపీలో ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ రెండోసారి అధికారంలోకి రాగలిగితే బీజేపీలో నరేంద్రమోదీ తర్వాత పెద్ద నాయకుడిగా ఎదుగుతారే తప్ప ఆయన భావి ప్రధాని అభ్యర్థిగా ముందుకొచ్చే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు మోదీ తర్వాత భావి ప్రధాని ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తే అది కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాగల అవకాశాలు చాలా తక్కువేనని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్ట్, జాతీయ రాజకీయాల విశ్లేషకులు, ‘ది ప్రింట్’ ప్రధాన సంపాదకుడు శేఖర్‌గుప్తా తాజాగా ‘మోదీ వర్సెస్ సీఎం టు పీఎం’ శీర్షికతో విడుదల చేసిన కథనంలో ఈ అంశాన్ని విశ్లేషించారు. గతంలోనూ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ప్రధాని ఎవరు అన్న చర్చ జరిగింది. ఇదేరకంగా ప్రస్తుతం మోదీ తర్వాత ఎవరు అనే చర్చను శేఖర్ గుప్తా లేవదీశారు.
ఈ నేపథ్యంలో భావి ప్రధాని ఎవరు అంటే బలమైన ప్రాంతీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రుల పేర్లే వినిపిస్తున్నాయి. ఆయా ప్రాంతీయ పార్టీల సామర్థ్యం, ఆ పార్టీల సారథుల శక్తిసామర్థ్యాలు, శక్తియుక్తులు చర్చనీయాంశం అవుతున్నాయి. దేశచరిత్రలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా పని చేసిన ప్రాంతీయ పార్టీల నేతలు పలువురు ప్రధాని పీఠం అధిష్ఠించారు. మహారాష్ట్ర-గుజరాత్ విడిపోవడానికి ముందు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పని చేసిన మొరార్జీ దేశాయ్ 1977 నుంచి 1979 వరకు జనతాపార్టీ నుంచి ప్రధాని అయ్యారు. ఆ తర్వాత సీఎంగా పని చేసి ప్రధాని అయిన రెండో వ్యక్తి విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్. 1980లో యూపీ ముఖ్యమంత్రిగా పని చేసిన వీపీ సింగ్ జనతాదళ్ పార్టీ నుంచి 1989లో ప్రధాని అయ్యారు. మూడో వ్యక్తి హెచ్డీ దేవెగౌడ. ఈయన 1994-1996లో కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 1996 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సీట్లు రాకపోవడంతో యునైటెడ్ ఫ్రంట్ తరఫున దేవెగౌడకు ప్రధాని (1996-97) అయ్యే అవకాశం లభించింది. దేవెగౌడ జేడీఎస్ పార్టీ అధినేత.
పార్టీకి దక్కిన సీట్లు ఎన్ని అన్నది ప్రతి సందర్భంలోనూ ప్రాముఖ్యం సంతరించుకోదు. సమీకరణాలన్నీ కుదిరితే తక్కువ సీట్లతోనూ విపక్ష కూటమికి సారథ్యం వహించి ప్రధాని పదవిని చేపట్టవచ్చునని దేవెగౌడ, ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్ ఉదాహరణలు తెలియజేస్తున్నాయి.
ప్రస్తుతం భావి ప్రధాని ఎవరన్న ప్రశ్నకు ప్రాంతీయ పార్టీలకు అధినేతలుగా ఉన్న ముఖ్యమంత్రులే ఆశాజనకంగా కనిపిస్తున్నారు. అయితే, మోదీ తర్వాత ప్రధా ని అయ్యేందుకు కేవలం పేరు ప్రఖ్యాతులు ఉన్నంత మాత్రాన సరిపోదు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పార్లమెంట్ సీట్లలో గణనీయమైన భాగం కలిగిన రాష్ట్రం అయినా ఉండాలి. లేదా విపక్ష కూటమిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి దేశ ప్రజల అభిమానాన్ని చూరగొనగల నాయకత్వ సామర్థ్యం ఉన్న నేత అయినా అయి ఉండాలి.
ఎంపీ సీట్లు ఎక్కువ, మధ్య, తక్కువ కలిగిన రాష్ర్టాలుగా రాష్ర్టాలను మూడు విభాగాలుగా విభజించి చూడాలి. 40 లేదా అంతకంటే ఎక్కువ ఎంపీ సీట్లు కలిగిన రాష్ర్టాలలో ఉత్తరప్రదేశ్ (80), మహరాష్ట్ర (48), పశ్చిమ బెంగాల్ (41), బీహార్ (40), తమిళనాడు 39+1 (పాండిచ్చేరి) ఉన్నాయి. రెండోవిభాగంలో 22 నుంచి 40 ఎంపీ సీట్లు కలిగిన రాష్ర్టాలలో మధ్యప్రదేశ్ (29), కర్ణాటక (28), గుజరాత్ (26), రాజస్థాన్ (25), ఆంధ్రప్రదేశ్ (25) ఉన్నాయి. మూడో విభాగంలో 10 నుంచి 21 ఎంపీ సీట్లు కలిగిన రాష్ర్టాలలో ఒడిశా (21), కేరళ (20), తెలంగాణ (17), అస్సాం (14), జార్ఖండ్ (14), పంజాబ్ (13), హర్యానా (10) ఉన్నాయి. వీటి కంటే తక్కువ ఎంపీ సీట్లు కలిగిన రాష్ర్టాలలో ఢిల్లీ (7) మినహా ఒకటి, రెండు ఎంపీ సీట్లు కలిగిన రాష్ర్టాలు పరిగణనలోకి తీసుకోదగ్గవి కాదు.
పెద్ద రాష్ర్టాల నుంచి ప్రధాని రేసులో ఉండే వారిలో యూపీ, పశ్చిమ బెంగాల్, మహరాష్ట్ర, బీహార్, తమిళనాడు ముఖ్యమంత్రులుంటారు. వీరిలో యూపీ బీజేపీ పాలిత రాష్ట్రం. అలాగే బీహార్ ఎన్డీఏలో కొనసాగుతుండటంతో ఇక్కడి నుంచి పరిగణనలోకి తీసుకోలేం. ఇక మహారాష్ట్ర పెద్దదైనప్పటికీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఆయన సొంతరాష్ట్రం పైనే పూర్తి పట్టు లేదు. మిగిలిన వారిలో తమిళనాడు సీఎం స్టాలిన్ సొంత రాష్ర్టానికే పరిమితమైన నేత. ఉత్తరాది రాష్ర్టాలతో సంబంధాలు లేకపోవడం, హిందీ రాకపోవడం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమే జాతీయ స్థాయిలో పేరున్న నాయకురాలు. బీజేపీని ఎదుర్కొనగల నాయకురాలిగా ఎన్నికల్లో తన సత్తా చాటుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కావడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. త్రిపుర, గోవా వంటి రాష్ర్టాలకు తన పార్టీని విస్తరించే దిశగా పావులు కదుపుతున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సొంత రాష్ర్టాన్ని వదిలి జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి కనబరచని నాయకుడు. పైగా వయసు పైబడటం మరో కారణం. ఇక ఢిల్లీ చిన్న రాష్ట్రమైనప్పటికీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పాపులర్ సీఎంగా పేరు గడించారు. తన పార్టీని పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రలకు విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జాతీయస్థాయి గుర్తిం పు, దేశ రాజకీయాల పట్ల ఆసక్తి, జాతీయ దృక్కోణం కలిగిన ముఖ్యమంత్రులుగా, భావి ప్రధానమంత్రి కాగలిగిన శక్తియుక్తులు ఉన్న వారిలో మమత బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ ప్రముఖంగా కనిపిస్తారు. దేశంలో ఏ ప్రతిపక్ష నాయకునితోనైనా నేరుగా మాట్లాడగలిగే విస్తృతమైన పరిచయాలు, హిందీ, ఆంగ్ల భాషల్లో మంచి పట్టు, ప్రావీణ్యం కేసీఆర్‌కు అదనపు బలం. స్వాతంత్య్రం అనంతరం దేశం ఎదుర్కొంటున్న సమస్యలు-పరిష్కారాలపై స్పష్టమైన అవగాహన, ప్రతిరంగంపై లోతైన అధ్యయనం చేసిన కొద్దిమంది నాయకుల్లో కేసీఆర్ ఒకరు. కాబట్టి మమత, కేజ్రీవాల్కన్నా కేసీఆర్‌కే రానున్న రోజుల్లో ప్రధాని అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు
భావిస్తున్నారు.
–వెల్జాల చంద్రశేఖర్
98499 98092