గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టుపై రాష్ర్టానికి చెందిన పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. 2016 సెప్టెంబర్ 21న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే గోదావరి-బనకచర్లకు బీజం పడిందని అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు సాక్ష్యంగా మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశపు మినిట్స్‌లో గోదావరి జలాల వినియోగంపై నమోదైన కేసీఆర్ అభిప్రాయాలను చదివి వినిపించారు. ఆ వాక్యాలను మరొక్కసారి పాఠకుల కోసం ఇక్కడ ఉటంకించదలచాను.
పేజీ 6లో ముఖ్యమంత్రి చదివిన వాక్యాలు ఇవి. For the existing, ongoing and future projects in both the states in Krishna River, more than 1,000 TMC of water is required. On the other hand more than 3,000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between two states by sitting together by amicably settling the issues.”
ఏటా మూడు వేల టీఎంసీలు నిరుపయోగంగా సముద్రంలోకి పోతున్నాయన్న విషయం బ్రహ్మ పదార్థం కాదు. కేసీఆర్ మెదడులో పుట్టిన ఆలోచన అసలే కాదు. కేంద్ర జలసంఘం వారు గత 50 ఏండ్లుగా నమోదు చేసిన గోదావరి ప్రవాహాలపై కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉన్నది. ఆ నీటిని రెండు రాష్ర్టాలు తమ ప్రయోజనాల కోసం, కృష్ణా నదిలో ఎదురవుతున్న లోటును భర్తీ చేసుకోవడానికి వినియోగించుకోవచ్చన్న అవగాహన ఆయనకు ఉద్యమ కాలం నుంచే ఉన్నది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకొని ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు కర్ణాటక రాష్ర్టానికి కలుగుతుంది. దాంతో తెలంగాణకు కృష్ణా జలాల రాక మరింత ఆలస్యమవుతుంది. లేదా ప్రవాహాలు తగ్గిపోతాయన్న అవగాహన కూడా కేసీఆర్‌కు ఉన్నది. పై వాక్యాల్లో గోదావరి జలాల వినియోగానికి సంబంధించి ఒక స్థూలమైన అభిప్రాయం వ్యక్తం అయ్యిందే తప్ప, బనకచర్ల ప్రస్తావనే లేదు. నిజానికి ఆనాటికి బనకచర్ల ఊసే లేదు.
తెలంగాణతో తొలినాళ్ల నుంచి ఘర్షణ వైఖరి అవలంబించిన చంద్రబాబుతో గోదావరి జలాల తరలింపుపై చర్చలకు సానుకూల వాతావరణం లేకుండా ఉండింది. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి జగన్ మోహన్‌రెడ్డి పాలన మొదలైన తర్వాత తెలంగాణలో రెండవసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏపీకి స్నేహహస్తాన్ని చాచారు. ఈ క్రమంలోనే గోదావరి జలాల వినియోగంపై కూడా ఇరు రాష్ర్టాల ముఖ్యమంతులు చర్చించుకున్నారు. వారితోపాటు ఇరు రాష్ర్టాల ఇంజినీర్లు కూడా పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించడానికి గోదావరి నదీ మార్గాన్ని ఉపయోగించి సఫలం చేసినట్టుగానే కృష్ణాలో కూడా ఆ ప్రయోగం సఫలం చేయగలమన్న విశ్వాసం కేసీఆర్‌కు ఉన్నది.
తన ఆలోచనలను తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లతో పంచుకొని ఒక ప్రాథమిక నివేదికను తయారు చేయాలని కోరారు. వారు ఒక అద్భుతమైన ప్రాజెక్టుకు రూపకల్పన చేసి కేసీఆర్ ముందుంచారు. పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి, అక్కడి నుంచి ఎగువన వైకుంఠాపురం వద్ద ఒక కొత్త బ్యారేజీని నిర్మించి నీటిని ఎత్తిపోయడం, ఒక టన్నెల్ ద్వారా పులిచింతల జలాశయానికి నీటిని తరలించడం, అక్కడ నుంచి నాగార్జునసాగర్ టెయిల్ డ్యామ్‌లో నీటిని ఎత్తిపోయడం, అక్కడ ఇదివరకే ఏర్పాటైన రివర్సిబుల్ పంపింగ్ వ్యవస్థను ఉపయోగించుకొని శ్రీశైలం డ్యామ్‌కు నీటిని తరలించడం.. ఇదీ స్థూలంగా ఆనాడు గోదావరి జలాలను నదీ మార్గం ద్వారా కృష్ణా నదీ వ్యవస్థలోకి తరలించడానికి తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు రూపొందించిన ప్రతిపాదనలు.
ఈ ప్రతిపాదనలను జగన్ మోహన్‌రెడ్డికి కేసీఆర్ వివరించారు. దీనిపై అధ్యయనం చేసి మరొక సమావేశంలో తమ అభిప్రాయం చెప్తామని అన్నారు. కానీ, కొన్ని నెలల తర్వాత ఏపీ భూభాగంలో నుంచే గోదావరి జలాలను తరలించడానికి గోదావరి-పెన్నా లింకు ప్రాజెక్టును తమ ప్రభుత్వం చేపడుతున్నట్టు జగన్ అసెంబ్లీలో ఏకపక్షంగా ప్రకటించారు. దీనికి కేసీఆర్ ప్రతిపాదించిన నదీ మార్గం స్కీమ్‌కు ఏ పోలికా లేదు. జగన్ పాలనా కాలంలో ఈ స్కీమ్ ముందుకుసాగలేదు.
అయితే, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు రెండు రాష్ర్టాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరి ప్రాజెక్టులపై మరొకరు కేంద్రానికి ఫిర్యాదులు చేయడం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేయడం దాకా సాగింది. ఈ ఘర్షణలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రాయలసీమ లిఫ్ట్ పథకంపై, మన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై స్టే విధించింది. రెండు రాష్ర్టాలకు ప్రయోజనకారిగా ఉన్న గోదావరి వరద జలాల తరలింపు పథకం మూలనపడింది. ఇదీ దాని పూర్వరంగం.
ఇప్పుడు చంద్రబాబు తనకు అలవాటైన పద్ధతిలోనే విభజన చట్టాన్ని తుంగలో తొక్కి ఏకపక్షంగా పోలవరం-బనకచర్ల పథకాన్ని ప్రకటించడమే కాదు, దూకుడుగా ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో తనకున్న పరపతిని వినియోగించి అనుమతులు, ఆర్థిక సహాయం పొందడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏకాణా ప్రయోజనం లేకపోగా గోదావరి జలాల్లో మన వాటాను, హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రతిపక్షాలు, ఇంజినీరింగ్ మేధావులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ ఒత్తిడికి ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ, అది మరొక రాజకీయ రగడకు దారితీసింది. గోదావరి-బనకచర్ల పాపమంతా కేసీఆర్‌దేనని ముఖ్యమంత్రి నిరూపించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. నాడు జగన్ మోహన్‌రెడ్డి ముందుంచిన నదీ మార్గం ప్రతిపాదనకు, ఈ రోజు చంద్రబాబు చేపట్టదలచిన పోలవరం-బనకచర్ల లింకు పథకానికి ఏ పోలికా లేదు. ఈ సంగతి తెలియక ఈ పథకానికి కేసీఆర్ 2019లోనే ఆమోదం తెలిపారని ఆరోపించి తప్పులో కాలేశారు.
2025 జూన్ 19న తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ నదీ మార్గం ప్రాజెక్టు వివరాలను మ్యాప్ సహా వివరించారు. పోలవరం-బనకచర్ల పథకానికి బదులుగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఇందులో ఖర్చు తక్కువ, భూసేకరణ తక్కువ, మూడు పెద్ద జలాశయాలు.. పులిచింతల (45 టీఎంసీలు), నాగార్జునసాగర్ (315 టీఎంసీలు), శ్రీశైలం (215 టీఎంసీలు) ఇదివరకే నిర్మాణమై అందుబాటులో ఉన్న కారణంగా బొల్లపల్లి (150 టీఎంసీలు) లాంటి పెద్ద జలాశయం నిర్మించే అవసరం రాదు.
కాబట్టి, పునరావాసం అసలే లేదు. కృష్ణా నది సజీవమవుతుంది. భూగర్భజలాలు పెరుగుతాయి. దేశీయ నౌకయానం, పర్యాటక, మత్స్యరంగాలు అభివృద్ధి చెందుతాయి. రెండు రాష్ర్టాలు గోదావరి అదనపు జలాలను తమకు ఇష్టమైన రీతిలో వినియోగించుకునే అవకాశం ఉన్నది. ఇన్ని ప్రయోజనాలున్న ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విశ్రాంత ఇంజినీర్లు కోరారు. వారి ప్రతిపాదనలను పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఇక 2020 అక్టోబర్ 2న కేంద్ర జలశక్తి మంత్రికి కేసీఆర్ రాసిన లేఖలో గోదావరి జలాల వినియోగంపై తన స్పష్టమైన ఆలోచనలను తెలియజేశారు. కేసీఆర్ రాసిన లేఖలోని 13వ పేజీలోని 13వ పేరాను పాఠకుల కోసం యధాతథంగా ఉటంకిస్తున్నాను. In this context, it is worth noting that as per 53 years of Central Water Commission (CWC) gauge records at the last gauging station on Godavari River (Annexure-8) at least 3,000 TMC of water flows into the Bay of Bengal after the utilisation of both the States of Telangana and Andhra Pradesh. The erstwhile State of Andhra Pradesh itself had allocated 65.13 % of the Godavari waters to Telangana region. The 3,000 TMC of water flowing into the sea annually can also be used on pro-rata basis. Based on the total water requirement for irrigation, industry and drinking water, Telangana will use 1,950 TMC water per year in comparison to present allocation of 967.15 TMC. This additional water will be required for meeting the water requirements of more than one crore population of Mega- Metro city of Hyderabad which also has 30 to 40 lakh migrant workers. The needs of Hyderabad city are growing due to the expansion of IT and Pharma industries and the growth of its urban agglomerations.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 968 టీఎంసీలకు అదనంగా ఏటా సముద్రంలోకి పోయే 3 వేల టీఎంసీలలో 1950 టీఎంసీల నీటిని తెలంగాణ ఇప్పటి అవసరాలకు, భవిష్యత్తు అవసరాలకు వాడుకుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
1950 టీఎంసీల వరద నీటిపై కూడా తెలంగాణకు హక్కు ఉన్నది. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి రెండు రాష్ర్టాల ప్రయోజనాలకు ఉపయోగపడే, ఆర్థిక భారం పడని ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించాలి. దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మధ్యవర్తిగా ఒక త్రైపాక్షిక ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా రాజకీయాలకు తెరదించి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలి.
అంతకుముందు మరొక విస్తృత స్థాయి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ డిమాండ్లను చర్చించాలి. సమావేశపు తీర్మానాలను అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో చేర్చాలని కేంద్రాన్ని కోరాలి. లేని పక్షంలో రాష్ట్రంలో అవాంఛనీయమైన రాజకీయ రగడ కొనసాగుతూ ఉంటుంది. సందట్లో సడేమియాలాగా చంద్రబాబు కేంద్రం అండతో గోదావరి నీటిని తన్నుకుపోతారు. గోదావరి జలాలపై తెలంగాణ సమాజం ఏకతాటిపై నిలబడి హక్కులను సాధించుకోవలసిన సమయం ఇదే. ఆలస్యం అమృతం విషం అన్న సంగతి తెలిసిందే కదా!
-విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్ ,శ్రీధర్‌రావు దేశ్‌పాండే