బురద కనిపిస్తే అందులో దిగకుండా ఏ దేశ వరాహమైనా నిగ్రహించుకోలేదు. ఆలోచన, ఆశయం, సంఘర్షణల ప్రేరణ నుంచి ప్రభావితమవ్వకుండా, ఉద్రేకాల ప్రోద్బలంతో బరితెగించే లక్షణాలు జంతుజాలానికే కాదు, మానవ సమూహంలో కూడా కొంతమందికి సమృద్ధిగానే ఉంటాయి. అందులోనూ రాజకీయాల్లో మసలే స్వార్థ చింతనాపరుల నుంచి, సమాజ దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొనే పటిమను ఏమాత్రం ఆశించలేం. అవసరాలు, ఆడంబరాల వెంపర్లాటలో నాయకుడికి ఉండాల్సిన మౌలిక లక్షణాలను సైతం పారవిడుచుకొని కాలుజారి, దిగజారిపోతుంటారు. అలాంటి సాధారణ మనుషులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నట్టుగానే, బీఆర్ఎస్లోనూ ఉన్నారు. అలాంటి వారే కొందరు నేడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితర పదవులను అలంకరించుకొని, వేలానికి సిద్ధంగా రోడ్డుపై నిలబడి రాజకీయాల అంతరార్థాన్ని అపహాస్యం చేస్తున్నారు.
Telangana | పదేండ్ల బీఆర్ఎస్ పాలనాకాలంలో ఇతర రాజకీయ పార్టీల నేతలకు, గులాబీ కండువా కప్పడం వెనుక.. రాష్ట్ర అస్తిత్వం ఆదిలోనే ప్రమాదంలో పడిపోరాదనే ఆరాటమున్నది. త్యాగాల తెలంగాణ నవ్వినోడి ముందు జారి బొక్కబోర్ల పడిపోకూడదనే ఆత్మగౌరవ దృష్టికోణం ఉండింది. కానీ, నేడు కాంగ్రెస్ పార్టీ సర్కార్ అమావాస్య నాడు అర్ధరాత్రి వేళనూ వదలకుండా, కండువాల కీచకత్వాన్ని సాగించడం వెనుక ఏ పరమార్థముంది? అంతర్గత కుర్చీ కుమ్ములాటల అపాయం నుంచి రక్షణ కోసం రేవంత్ రెడ్డి పడుతున్న పాట్లు తప్ప, ఏ సహేతుక కారణమూ లేదు. పైగా ఫిరాయింపులకు పసలేని వాదనగా.. ‘మీరు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్పా?’ అంటూ హస్తం పార్టీ ప్రబుద్ధులు వితండవాదం చేస్తున్నారు.
నిజమే రాముడి పక్షాన విభీషణుడి చేరికకు ధర్మముండింది. కానీ, అదే రావణుడి వైపు లక్ష్మణుడు వెళ్లుంటే అర్థముండేదా? పదేండ్ల తెలంగాణ రాజకీయ అవసరాలు, నేటి కాంగ్రెస్ పార్టీ అవసరాలు ఒకటే కాలేవు. మోదీ, మీడియా, బాబు.. తెలంగాణను బలి తీసుకుందామని వేసిన పాచికలను ఎదుర్కోవడానికి కేసీఆర్ సర్కార్ అవలంబించిన రాజకీయ పునరేకీకరణ పంథాను, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల కంపుతో పోల్చిచూడడం అవగాహన లేమితనమో, అనారోగ్య ఆలోచన గుణమో అవుతుంది.
అయినా ప్రజాప్రతినిధులను లాక్కొని, తాత్కాలికంగా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలరేమో గానీ, పరువును పోగొట్టుకున్నారు కదా? గడిచిన దశాబ్దకాలంగా దేశవ్యాప్తంగా చెమటోడ్చి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంపాదించుకుంటున్న రాజ్యాంగ రక్షకుల పాత్రను రేవంత్ రెడ్డి సర్కార్ నవ్వులపాలు చేసేస్తున్నది. ఫిరాయింపులపై పార్లమెంట్ లోపల, వెలుపల ఫిరంగిలా ప్రసంగాలు దంచే గాంధీల స్వరాల్లో పొలిటికల్ సైనేడ్ పడిపోయింది. ‘టెన్ జన్‌పథ్’ పరివారాన్ని పోషించే రాష్ర్టాల సర్కార్లు ఎన్ని అరాచకాలు చేసినా, హస్తం పార్టీ అధిష్ఠానం భాగస్వామిగా మారుతుందే తప్ప, నిలువరించే విలువను ప్రదర్శించదని మళ్లీ నిరూపించారు.
కంటైనర్లలో జీవాలను తరలించినట్లు, ఫ్లైట్లలో పరాయి పార్టీ ప్రజా ప్రతినిధులను హస్తినకు తస్కరించుకొస్తే, గాంధీలు కండువాలు కప్పి వెన్నుతట్టడం వెగటు పుట్టిస్తున్నది. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ చేస్తున్న రాజకీయ వ్యభిచారం, దేశవ్యాప్త చర్చగా మారి, రాహుల్ గాంధీ ప్రసంగాలను పలుచన చేసేస్తున్నది. ఏదేమైనా ఇటీవల కేసీఆర్ అన్నట్టుగా.. తెలంగాణకు దిష్టి తీసినట్టుగా, వర్తమాన పరిణామాలు ప్రయోజనకర భవితవ్యానికి కారణభూతమవుతాయి.
ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి, దేదీప్యమానానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల అన్యాయమైన విధానాలే ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. తెలంగాణను అర్థం చేసుకోవడంలో ఆ రెండు జాతీయ పార్టీలతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా చేసిన చారిత్రక పొరపాట్ల వల్లే తెలంగాణ సమాజం గులాబీ జెండాను ఎత్తుకున్నది.
సుదీర్ఘమైన ప్రభావశీల సంస్కృతి, భిన్నమైన ఆకాంక్షలు, అర్థవంతమైన అలజడికి నెలవైన తెలంగాణ ప్రాంతం దేశంలోనే వైవిధ్యమైనదన్న సంగతి అందరికీ తెలిసిందే. లోహ యుగం నాటికే చలనశీలమైన జీవనశైలి కలిగిన ప్రాంతమిది. ఈ నేల, జనావాసాల స్వాభావికంలోనే యథాతథ స్థితి నుంచి ఏదో మార్పు వైపు నిరంతరం వెల్లువలా కదిలే సహజ స్వాభావికత ఇమిడి ఉంది. ఆ ప్రత్యేక లక్షణమే తెలంగాణమంతటా ఎల్లప్పుడూ ఆరని కొలిమిని రాజేస్తూ ఉన్నది.
ఆ సహజ కొలిమిలో నుంచి శాశ్వత పరిష్కారం కోసం నిలబడేందుకే గులాబీ జెండా అవసరమైంది. ఆ చారిత్రక బాధ్యతలో భాగంగా ప్రత్యేక రాష్ట్ర పోరును దరికి చేర్చడంతో ప్రాథమిక దశను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా దాటింది. తర్వాతి దశలో ప్రత్యేక రాష్ట్రంలో సలుపుతున్న ఉపాంత సమస్యల పరిష్కారం కోసం స్వయంపాలన ద్వారా శ్రమించింది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలతో పాటు అంతా కోల్పోయిన సమూహంగా మారిన బడుగు, అట్టడుగు జనానికి ఆసరాగా నిలిచి, రేపటిపై విశ్వాసాన్ని కల్పించింది.
ఆ క్రమంలోనే వ్యవసాయ, సాగునీటి, విద్యుత్, పారిశ్రామిక, సంక్షేమ రంగాలు ఆరోగ్యకర వ్యవస్థలుగా నిర్మితమయ్యాయి. ఈ పాలనా చర్యల వల్ల ఉపాంత సమస్యల నుంచి తెలంగాణ బయటపడి భద్రమైన జీవన విధానాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నది. ఇదంతా జరగడానికి నెత్తురు, చెమట, కాలమూ ఖర్చు చేయక తప్పలేదు. దేశ రాజకీయ వ్యవస్థే జడిసి, తెలంగాణ ఆకాంక్షలకు తలవంచే స్థితికి రావడం వెనక కేసీఆర్ పోరాటం, వ్యూహం ఎలా పనిచేశాయో సమాజానికి తెలియనిదేం కాదు. ఎక్కడా రొటీన్ రాజకీయాలపై మనసు నిలిపి ఆగక, చారిత్రక కారణంపైనే అర్జునుడిలా గురి చెదరకుండా సుదీర్ఘకాలం కేసీఆర్ శ్రమించడం వల్లనే ప్రత్యేక రాష్ట్రం, ప్రగతి సాకారమైంది.
ఇప్పుడు కూడా రాజకీయాల పైపై మెరుగులు చూసే అలవాటు కలిగిన వారికీ, దాని పవిత్రమైన పరమార్థం అర్థమైన వారికీ మధ్య వ్యవహారశైలిలో సహజంగానే చాలా వ్యత్యాసం ఉంటుంది. తలలు పోగేసుకునే నైజానికి, తండ్లాటను తరిమే ధీరత్వానికి అసలు పోలికే ఉండదు. సామాజిక సవాళ్లను పరిష్కరించే ఉదాత్తమైన ఆశయం కలిగిన కేసీఆర్ లాంటి నాయకుడి సంకల్పాన్ని, వర్తమాన రాజకీయ బలాబలాలు ప్రభావితం చేయజాలవు. సవాళ్ల చిక్కులను చెక్కముక్కలుగా విసిరేసి, సమాజపు కలలకు ఉక్కురెక్కలు తొడిగే నాయకత్వాలకు కాఠిన్య స్థితి కూడా జడత్వం కల్పించలేదు.
నది ప్రవాహంలా నడిచే స్వభావం, నీటిలో చేపలా ప్రజల్లో మెలిగే తత్వం అధికారాతీతమైనది. బీఆర్ఎస్ పరిష్కారం కోసం పుట్టిందేకాని పదవీప్రియుల గుంపేసుకొని లేచింది కాదు. అదే లక్షణంతో మరో సవాల్‌ను స్వీకరించి, పరిష్కారం వెతికే తొవ్వలో కేసీఆర్ నాయకత్వంలోని గులాబీ శ్రేణులు ముందుకు కదలాలి. మొదటి దశలో రాష్ట్ర సాధన, తర్వాతి దశలో ఉపాంత సమస్యల పరిష్కార లక్ష్యాలను విజయవంతంగా సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు అవసరమైన కీలక దశలో అడుగు పెట్టింది.
ఉపాంత సమస్యలు పరిష్కరించిన ఉత్సాహంతోనే పునాది సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తుంది. తెలంగాణ వికాస పరిణామ క్రమంలో అనేక దశలు దాటి, నేడు ప్రతి కుటుంబంలో అక్షరాస్యులు, ఆలోచనాపరులు పెరిగిపోయిన స్థితికి వచ్చి చేరింది. పరిమితమైన జ్ఞాన సమాజం వాంఛించే మార్పులు, విస్తారమైన విజ్ఞాన సమాజం ఆకాంక్షలు భిన్నమైనవి. నిన్నటి సమాజ అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చిన బీఆర్ఎస్ పార్టీ.. పదేండ్ల తెలంగాణ వర్తమాన ఆశయాలను నెరవేర్చే అత్యంత కీలకమైన పాత్రను స్వీకరించి, మిగిలిపోయిన ఆకాంక్షలను నెరవేరుస్తుంది. ఆ చారిత్రక మౌలికమైన పునాది మార్పు కేసీఆర్‌తో మాత్రమే సాధ్యం.
గతితార్కిక భౌతికవాదం వెలుగులో వర్తమానాన్ని అవగాహన చేసుకోవడంలో కమ్యూనిస్టు పార్టీలు విఫలం కావడం వల్లనే సిద్ధాంతం, ఆచరణకు మధ్య క్రమేణా అంతరం పెరిగి, దేశంలో కనుమరుగయ్యే దుస్థితిని తెచ్చిపెట్టుకున్నాయి. కానీ, ప్రాంతీయ పార్టీలు నిరంతర అప్రమత్తతతో, వర్తమాన, చలనశీల ఆకాంక్షలనూ ఒడిసి పట్టుకొని అడుగులు వేస్తూ.. బీజేపీ, కాంగ్రెస్‌లను తట్టుకొని విజయాలు నమోదు చేస్తున్నాయి. తెలంగాణ వర్తమాన అవసరాలపై సంపూర్ణ అవగాహన కలిగిన నాయకుడు కేసీఆర్. ఆ వర్తమాన సామాజిక ఆకాంక్షలకు పరిష్కారం చూపెట్టడం ఖాయం.
రాజకీయ వ్యవస్థలో యథాతథ స్థితి ఎప్పుడూ ఉండదు. అందులోనూ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో అసలే ఉండదు. ఏ ఒక్క ప్రభావశీల అంశమో ప్రస్తుత పరిస్థితిని తలకిందులుగా మార్చి వేసేస్తుంది. కాబట్టి, కాంగ్రెస్ వర్తమాన స్థితిపై ప్రత్యేక అభిప్రాయంతో పనిచేసే విధానమే బీఆర్ఎస్ పార్టీకి గీటురాయిగా ఉంటుందని ఎవరైనా అనుకుంటే భ్రమపడ్డట్టే. సుదీర్ఘ బీఆర్ఎస్ ప్రస్థానాన్ని గమనిస్తే, కేసీఆర్ పని విధానానికి తెలంగాణ పరిరక్షణే కొలమానమవుతుంది కానీ, రాజకీయ సంకుచిత అంశాలు ఎప్పటికీ కొలమానం కావనేది ఎవరికైనా అర్థం అవుతుంది.
ప్రతి నిర్ణయానికీ ఆమోదం కోసం 17 సార్లు ఢిల్లీకి వెళ్లి, రాష్ట్ర ఏర్పాటు ఆశయమైన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దారుణంగా దెబ్బతీసేశాడు సీఎం రేవంత్ రెడ్డి. బాబు చేతిలో మెదడు, మోదీ చేతిలో మెడ, గాంధీల కట్టుబాటులో హస్తాలు పెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ పాలన సాగిస్తున్నది. ఈ ప్రభుత్వ పాలన అన్ని వర్గాల మనసులనూ గాయపరుస్తున్నది. వనరులు, అస్తిత్వంపై ఢిల్లీ ఆధిపత్యాన్ని రుద్దుతున్నది.
మరీ ముఖ్యంగా బీసీ, దళిత వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలానే వంచిస్తున్నది. అందుకే తెలంగాణ పరిరక్షణ పోరు ఇప్పుడు అనివార్యం. రాష్ట్ర పరిరక్షణ పోరులోనే బీసీల ఆకాంక్షలకు పరిష్కారం దొరకాలని బడుగులు ఆశపడుతున్నారు. అసలు తెలంగాణ ఇలా ఉండవచ్చునా? ఇలాగే తెలంగాణను భవిష్యత్ తరాలకు వదిలిపెడితే చరిత్ర ప్రశ్నించే అవకాశం కల్పించినవారమవుతాం. సంపద సృష్టించి పంచిన చేతులే, రాజకీయ ఆకాంక్షలనూ నెరవేర్చగలవు. అది ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యం.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
– డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242