‘వచ్చే ఐదేండ్లు, పదేండ్లూ తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ముఖ్యమంత్రిని నేనే’ అని పదేపదే వల్లించే రేవంత్‌రెడ్డి.. మరోవైపు అధికారం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకొనే కోట్లాది రూపాయల ప్రణాళికలు వేస్తున్నారు. ఒకవైపు హామీలు తీర్చండి మహాప్రభో.. అని ప్రజలు పబ్బతి పడుతుంటే.. మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఆటపాటలతో సంబురాలు చేసుకుంటున్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకొనేందుకు గత ప్రభుత్వాన్ని నిందించే హస్తం పార్టీ నేతలు ఉదారంగా కోట్లకొద్దీ ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి దుబారాతో రేపటి రోజుల్లో ప్రజలు ఎంత ఆర్థిక భారాన్ని మోయవలసి వస్తుందో కాంగ్రెస్ నేతలు ఆలోచించడంలేదు. రేవంత్ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు, తెస్తున్న అప్పులు చూస్తుంటే మళ్లీ గెలిచే ఆశలు సన్నగిల్లి, సంపాదన మీద దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతున్నది. సీఎం ఖర్చులు, సంతర్పణలతో ఖజానాపై పడే భారం గురించి ఆయనకు చింతనే లేదనిపిస్తున్నది.
ఆర్టీసీ వాళ్లు సమ్మెకు వెళ్తామంటే ‘నన్ను కోసినా పైసలు లేవు’ అని సీఎం రేవంత్‌రెడ్డి మొండిగా మాట్లాడారు. తాము పొదుపు చేసుకున్న సొమ్ము కూడా ప్రభుత్వం నుంచి మంజూరుకాక ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు విడుస్తున్నారు. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌లో ‘తులం బంగారం వచ్చుడు కల్ల’ అని ప్రజలు ఆశలు వదులుకొన్నారు. ఒక పంటకు ఇచ్చే రైతు భరోసా చేతికందేసరికి మరో పంట కాలం వస్తున్నది. రాష్ట్ర ఆదాయం పాత అప్పుల వడ్డీకే సరిపోతున్నదని అబద్ధాలు, తప్పుడు లెక్కలు చెప్తూ ఏడాదికి రెండు లక్షల కోట్లు కొత్త అప్పులు తెస్తున్నారు.
రాష్ట్రం రోజువారీ ఖర్చు రిజర్వ్ బ్యాంక్ చేబదుళ్లతో నడుస్తున్నదని కాగ్ నివేదిక తేటతెల్లం చేస్తున్నది. 2023-24లో కేవలం 12 రోజులు మినహా ఏడాదంతా ఆర్బీఐ దయతోనే సర్కార్ గట్టెక్కిందట. కానీ రేవంత్ మాత్రం ఖజానా వంక చూడకుండానే తమ ఇష్టారాజ్యాన్ని కొనసాగిస్తున్నారు. సంబంధిత మంత్రితో సంప్రదించకుండానే తన ఇష్టారీతిన ఆర్థిక సంబంధ మైన ప్రకటనలు చేస్తున్నారు. ఏదైనా సంక్షేమ పథకం ప్రకటన చేసేముందు కేసీఆర్ తనను సంప్రదించేవారని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉండి, ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ ఓ చోట చెప్పారు. బడ్జెట్ సరిపోదు అని తాను చెప్పినా ఏదో సర్దుబాటు చెయ్ అని కేసీఆర్ కోరుతూ ముందుకు వెళ్లేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే, ఈ సమన్వయం కాంగ్రెస్ ప్రభుత్వంలో లోపించింది. రేవంత్ మాటకు అధిష్ఠానమే మొగ్గు చూపుతున్నవేళ మనకెందుకులే అనే దోరణితో అమాత్యుల్లో చాలామంది సర్దుకుపోతున్నారు.
ఉగాది నాడు జరిగిన గద్దర్ సినీ అవార్డు సంబురాల ఖర్చుకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ నియమాలు, విధానాలు, పద్ధతులు అన్నీ పక్కకు పెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనం సెలబ్రిటీల వశమైంది. రూ.10 కోట్లతో ముగిస్తామని చెప్పి ఈ సంబురాలకు సుమారు రూ.30 కోట్ల దాకా ఖర్చు అయిందని తెలుస్తున్నది. సినిమా పాటల ప్రదర్శనకు వచ్చిన కళాకారులకు రూ.3 కోట్లు చెల్లించారట. ఖర్చు సంగతి పక్కన పెడితే.. తెలంగాణ సంస్కృతి, గద్దర్ ఆదర్శాలు ఆ వేదికపై మచ్చుకైనా కానరాలేదు. ఇక్కడ విచారకరమైన విషయమేమిటంటే..అక్కడి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలంగాణ జీవనాడిపై అవగాహన కొరవడింది. ఆ సోయి ఉండి ఉంటే జనం మధ్య ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరిపేవారు.
2024 డిసెంబర్లో తొమ్మిది మంది తెలంగాణ కవులు, కళాకారులకు కోటి రూపాయలు ఇచ్చి, తెలంగాణ సాహిత్యం, కళలపై తనకు ఆసక్తి ఉన్నదని చెప్పుకొనేందుకు సీఎం యత్నించారు. తెలంగాణ తేజోమూర్తులైన కాళోజీ, దాశరథి పేరిట కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ కళాకారులకు పురస్కారాలు ప్రవేశపెట్టింది. వీటిని కొనసాగిస్తే సరిపోతుంది. ఒక మహనీయుని పేరిట జ్ఞాపికతో కూడిన సత్కారం చేయడం అనేది చాలా గౌరవప్రదంగా ఉండేది.
2025 జులైలో బోనాల పండుగ సందర్భంగా ఒక గాయకుడికి ముఖ్యమంత్రి ఏకంగా కోటి రూపాయల నగదు ప్రకటించారు. అవార్డు నిర్ణేతలు ఆయనకు ఏ పురస్కారం ఇవ్వనందున తానే ఈ నిర్ణయం తీసుకొన్నానని వేదికపై ఆయన అన్నారు. ముందున్న గాయకుడు కనిపించినంత తేలిగ్గా రోజూ పేపర్లో వచ్చే బాట లేని గ్రామాల బాధ వార్త పాలకుడికి కనిపించకపోవడం విషాదకరమే.
మూసీ సుందరీకరణ పేతో ప్రభుత్వం లక్షన్న కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్లు వేస్తున్నది. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో మరో కొత్త డ్రామాకు రేవంత్ తెరతీశారు గుడి పునరుద్ధరణ చేస్తామంటూ హడావుడిగా శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్లు ఖర్చు చేస్తామని నమ్మబలికారు. లేని అభివృద్ధి, రాని పెట్టుబడుల పేరిట బీరాలు పలికే కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు రెండేండ్లుగా వింటూనే ఉన్నారు. తమ జీవితా ల్లో ఎంత దుర్భర మార్పు వచ్చిందో గమని స్తున్నారు. తమలో గూడుకట్టుకున్న ఆగ్రహం, ఆవేదనను ప్రజలు సరైన టైమ్‌లో చూపిస్తారు.
– బద్రి నర్సన్