తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మంత్రి జూపల్లి కృష్ణారావు విసురుతున్న సవాళ్లు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే.. పునాదులు తవ్వి, బిల్డింగ్ నిర్మించిన వాడిని పక్కనపెట్టి, పైన రంగులు వేసిన వాడు బిల్డింగ్ నాదే అన్నట్టున్నది! నేడు తెలంగాణలో రూపాయి ఆదాయం వస్తున్నదన్నా, ప్రభుత్వం జీతాలు ఇస్తున్నదన్నా.. దానికి మూలస్తంభం కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లపాటు పకడ్బందీగా, ప్రణాళిక ప్రకారం నిర్మించిన అద్భుతమైన ఆర్థిక సామ్రాజ్యమే కారణం. ఆ నాడు శూన్యం నుంచి బంగారు తెలంగాణను నిర్మించిన ఒక మహానేత, సంపదను చేతుల్లో పెడితే, రాష్ర్టాన్ని దివాలా తీయించిన అసమర్థ పాలకుడి అసంబద్ధ రాజకీయానికి తాజా పరిణామాలు పరాకాష్ఠ!
సమైక్య పాలకుల వివక్ష కారణంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కరెంట్ కటకట ఉన్నది. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకొన్నది. రైతుల ఆత్మహత్యలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. బడ్జెట్ అంచనాలు కేవలం రూ.66,000 కోట్లు. అలాంటి దుస్థితి నుంచి 2023 నాటికి దాదాపు రూ.3,50,000 కోట్ల బడ్జెట్ సాధించి తెలంగాణను దేశంలోనే అత్యంత ధనిక రాష్ర్టాల్లో ఒకటిగా నిలిపిన ఘనత కేసీఆర్‌ది. రాష్ట్ర సంపద (జీడీపీ) 177% వృద్ధి సాధించింది. 2014లో తెలంగాణ జీఎస్డీపీ కేవలం రూ.5.05 లక్షల కోట్లు. కానీ 2023-24 బడ్జెట్ నాటికి దానిని సుమారు రూ.14 లక్షల కోట్లకు తీసుకెళ్లారు.
దేశ జనాభాలో కేవలం 2.9% కలిగిన తెలంగాణ.. దేశ జీడీపీకి ఏకంగా 4.9% సంపదను అందించి దేశంలోనే నంబర్‌వన్‌గా రికార్డు సృష్టించింది. తలసరి ఆదాయంలో దేశంలోనే టాప్‌లో నిలిచింది. 2014లో తెలంగాణ పౌరుడి సగటు తలసరి ఆదాయం రూ.1,12,162. దానిని 2023 నాటికి ఏకంగా రూ.3,17,115 కు పెంచి, దేశ సగటు (రూ.1,70,620) కంటే 86% ఎక్కువతో దేశంలోనే అగ్రస్థానం దక్కించుకున్నది. దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత, నాణ్యమైన త్రీ-ఫేజ్ విద్యుత్తు ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌ది. కేసీఆర్ చేసిన అప్పులన్నీ వృథా అయ్యాయంటూ రేవంత్‌రెడ్డి, జూపల్లి ప్రెస్మీట్లలో అడ్డగోలుగా మాట్లాడారు. వారి దుర్మార్గమైన మాటలకు, వ్యవసాయ రంగం సాధించిన విజయాల గణాంకాలే చెంపపెట్టు. 2014లో తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం కేవలం 22.74 లక్షల ఎకరాలు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ జరిగిన తర్వాత, అది ఏకంగా 61.48 లక్షల ఎకరాలకు పెరిగింది. 2023-24 నాటికి వరి ఉత్పత్తిలో 168.75 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డుతో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా అవతరించింది. 2014లో రూ.50 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతుల విలువ.. 2023 నాటికి రూ.2.5 లక్షల కోట్లకు చేరింది.
నాడు కేసీఆర్ తెచ్చిన అప్పులు కాళేశ్వరం ప్రాజెక్టుగా మారి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరుగా మారి, నిరంతర విద్యుత్తు లైన్లుగా మారి ఇవాళ ప్రభుత్వానికి పన్నుల రూపంలో వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇంతటి అద్భుతమైన ఆర్థిక పునాదిని రేవంత్‌రెడ్డి చేతిలో పెడితే, ప్రభుత్వ పనితీరు పిచ్చోడి చేతిలో రాయిలా మారింది.
రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ తన అపరిపక్వ పాలనతో, ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్ల దందాతో రియల్ ఎస్టేట్ రంగాన్ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చింది. పైగా ప్రజలను ఏమార్చే విధంగా, రేవంత్ ప్రభుత్వం చెప్తున్న రూ.8 లక్షల కోట్ల అప్పు అనే కల్పిత కథనం వెనుక ఉన్న అసలు నిజాలను, వారి సొంత పరిపాలనా వైఫల్యాలను అధికారిక లెక్కలే తప్పు అని బయటపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో వెల్లడించిన వివరాల ప్రకారం తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,83,452 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రత్యక్ష, బడ్జెట్ పరిధిలోని అప్పు రూ.3,89,673 కోట్లు. కానీ అప్పు ఖాతాను కలగాపులగం చేసి, రూ.8 లక్షల కోట్లు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేంద్ర ఆర్థికశాఖ, కాగ్ లెక్కల ప్రాతిపదికనే అప్పుల మీద చర్చ జరుగాలన్న కనీస జ్ఞానం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు లేదు.
గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలు కట్టడానికే ఖజానా ఖాళీ అవుతున్నదన్న రేవంత్‌రెడ్డి, జూపల్లి వాదనల్లో ఎలాంటి నిజం లేదు. బీఆర్ఎస్ హయాంలో వార్షిక రుణాల అసలు, వడ్డీల చెల్లింపులు సగటున ఏడాదికి రూ.35,000 కోట్ల నుంచి రూ.38,000 కోట్ల మధ్య ఉండేవి. అధికారిక బడ్జెట్ పత్రాల ప్రకారం కాంగ్రెస్ సర్కార్ వార్షిక అప్పుల చెల్లింపు సుమారు రూ.35 వేల కోట్ల నుంచి రూ. 36 వేల కోట్ల మధ్యనే ఉన్నది. కొత్తగా ఏదో అప్పులభారం పడిపోయిందంటూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ, తమ ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపెట్టుకుంటూ, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ సర్కార్, రాష్ట్ర ఆదాయ వనరులను పెంచడంలో ఘోరంగా విఫలమైంది. రాష్ర్టానికి అప్పు పుట్టడం లేదని చెప్తున్న రేవంత్, ఈ దుస్థితి తలెత్తడానికి తన అసమర్థ పాలనే కారణం అనే సంగతి మర్చిపోకూడదు.
కాంగ్రెస్ గద్దెనెక్కినప్పటి నుంచి రెండున్నరేండ్లలో మార్కెట్ నుంచి దాదాపు రూ.4 లక్షల కోట్ల అదనపు అప్పు సేకరించింది. కానీ ఆ డబ్బు ఎటు పోయిందో ఎవరికీ తెలియదు. ప్రధాని మోదీతో ‘బడే భాయ్ – చోటే భాయ్” అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు చెప్పుకొంటున్నా కేంద్రం నుంచి రాష్ర్టానికి రావలసిన నిధులను సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారు.
కాంగ్రెస్ సర్కార్ నాటకాలు, చాలెంజ్‌ల ప్రెస్మీట్ల వెనుక ఉన్న అసలు రహస్యం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చలేక పోవడమే. రైతులకు రుణమాఫీ సరిగ్గా చేయలేక, పెట్టుబడి సాయం ఇవ్వలేక చేతులెత్తేసిన ఈ ప్రభుత్వం.. ప్రజలకు ఎన్నికల సందర్భంలో చేసిన డిక్లరేషన్స్, 420 వాగ్దానాలు మూసీ నదిలో కొట్టుకుపోయాయి. రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సాయం సక్రమంగా ఇవ్వలేక.. ‘ఖజానా ఖాళీగా ఉన్నది, కేసీఆరే దీనికి కారణం‘ అంటూ తప్పుడు వాదన సృష్టిస్తున్నారు.. రేవంత్‌రెడ్డి, జూపల్లి. రాష్ర్టానికి పైసా ఆదాయం పెంచే తెలివి లేదు, కేంద్రం నుంచి నిధులు తెచ్చే దమ్ము లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు.. కానీ ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ కేసీఆర్‌ను ఆడిపోసుకోవడం అలవాటైపోయింది. ఆర్థిక నిర్వహణ అంటే రేవంత్ బూతు ప్రసంగాలతో సాధ్యం కాదు. కాంగ్రెస్ తన పాలన వైఫల్యాలు, అవినీతి, ఆదాయ క్షీణతను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరంతరం బురదజల్లుతున్నది. లక్షల కోట్ల కొత్త అప్పులు చేస్తూ, మౌలిక వసతుల రంగాన్ని నాశనం చేసిన ఈ ప్రభుత్వానికి ప్రజల ముందు మాట్లాడే నైతిక హక్కు లేదు. గణాంకాలే ఈ ప్రభుత్వ చేతకానితనాన్ని నిరూపిస్తున్నాయి.
రేవంత్ – జూపల్లి చిల్లర సవాళ్లు, సినిమా డైలాగులు ఆపి.. కేంద్ర ప్రభుత్వ రికార్డులను, రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రాన్ని చదువుకోవాలి. కేసీఆర్ పాలనలో సృష్టించిన సంపదను అనుభవిస్తూ, ఆ మహానాయకుడిపైనే బురదజల్లాలని చూస్తే కాంగ్రెస్ నేతలను తెలంగాణ సమాజం క్షమించదు. పాలనలో చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పేరును వాడుకోవడం కాంగ్రెస్ నేతలు ఇకనైనా ఆపాలి. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ కాగితాల మీదే ఉంటాయి, అవి మీ అబద్ధాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటాయి! ‘వట్టి మాటలు కట్టిపెట్టవోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్’ అని మహాకవి గురజాడ అన్నట్టు, రేవంత్‌రెడ్డి బూతు ప్రసంగాలు, హిట్లర్ భాష, దోపిడీస్వామ్యం, నియంతృత్వ పోకడలు, పనికిరాని చాలెంజ్‌లు బందు చేయడం శ్రేయస్కరం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ)
– డాక్టర్ శ్రవణ్ దాసోజు