విద్య, ఉద్యోగాల కోసం చాలామంది భారతీయులు అమెరికాకు వెళ్తున్నారు. అమెరికన్ డ్రీమ్, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి సాధించాలనే తపనతో, ఉత్తమ పనితీరు కలిగిన ఐటీ, ఆరోగ్య సంరక్షణ, కార్మిక నిపుణులుగా రాణిస్తున్నారు. విజయవంతమైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు హెచ్1బీ వీసాలను ఉపయోగించుకున్నారు. భారతీయ విద్యార్థులు అమెరికాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలనే కోరికతో ఖర్చుకు వెనుకాడకుండా అక్కడికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సఫలమైతే మరికొందరు విఫలమవుతున్నారు. కానీ ఇటీవల భారతీయుల్లో అమెరికా కల చెదిరిపోతున్నది. అమెరికాలో ఉండలేమని, ఇండియాకు తిరిగి వస్తామని చాలామంది చెప్తున్నారు.
ఎన్నో కష్టానష్టాలను భరించి అమెరికా వెళ్లిన భారతీయులు అక్కడి స్థానికుల నుంచి అవమానాలు, ఆటంకాలను అధిగమించి, మెరుగైన పనితీరుతో రాణిస్తున్నారు. సముచిత స్థానాన్ని సంపాదించుకున్నారు. అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా, వ్యవస్థాపకులుగా టెక్నాలజీ, ఫైనాన్స్, తయారీ రంగాల్లోని సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారు. భారతీయ సంతతి కుటుంబాల సగటు ఆదాయం అత్యధికం 119000 అమెరికా డాలర్లు. 2026 నాటికి అమెరికాలో జన్మించిన, అమెరికాకు వలస వెళ్లిన వారు కలిపి 54 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇది అమెరికా జనాభాలో 1.5%. సంఖ్యాపరంగా, ఆర్థికపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా సమూహాల్లో భారత సంతతి ఒకటి. కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ జెర్సీ, న్యూయార్క్‌లలో భారత సంతతి ప్రజలెక్కువ. అమెరికాలోని వైద్యుల్లో 10% మంది భారతీయులే. అమెరికాలో మన వాళ్లు ఎంతగా రాణించినప్పటికీ వారు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
కార్నెగి నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అమెరికాను వదలాలని అక్కడి భారత సంతతిలోని 40% మంది కోరుకుంటున్నారని అధ్యయనం వెల్లడించింది. ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగం సంపాదించడం, స్థిర నివాసం ఏర్పరచుకోవడం చాలామంది కల, కానీ ప్రస్తుతం ఆ కల చెదిరిపోతున్నది. అగ్రరాజ్యంలో ఉండలేని దుస్థితి నెలకొన్నదని భారతీయుల వేదన. అక్కడి పరిస్థితుల కారణంగా రోజురోజుకు వారిలో ఆందోళన, భయం పెరిగి, భారత్‌కు రావాలని కోరుకుంటున్నారు. అక్కడి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులే కారణమని చెప్తున్నారు.
యూగవ్, కార్నెగి ఎండోమెంట్స్ సంస్థ 1,000 మంది భారతీయులను సర్వే చేసి అభిప్రాయం సేకరించగా 40% భారతీయ అమెరికన్లు భారత్ వెళ్లిపోతామని వెల్లడించగా, 14% మంది వెళ్లిపోవాలని తరచుగా ఆలోచిస్తున్నామని, 28% మంది అప్పుడప్పుడు అలా అనిపిస్తుందని చెప్పారు. ప్రస్తు తం అమెరికాలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై అక్కడ ఉన్న భారతీయుల్లో 58% మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పెరిగిన జీవన వ్యయాన్ని భరించలేకపోతున్నామని 54% మంది తెలిపారు. రోజు రోజుకు వ్యక్తిగత భద్రత కష్టంగా ఉన్నదని 41% చెప్పారు.
మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు అతడు భారతదేశం పట్ల సానుకూలంగా ఉంటారని అక్కడి ఎన్ఆర్ఐలు భావించారు. కానీ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, వలస విధానాలు, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రభుత్వ నిర్ణయాలు తమకు నచ్చడం లేదని 71% మంది వెల్లడించారు. ట్రంప్ జాత్యహంకార మాటలు మాట్లాడుతూ, అమెరికన్స్ ఫస్ట్ అంటూ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రకరకాలుగా ప్రకటనలు చేస్తూ అమెరికన్లనే కాకుండా అమెరికాలో స్థిరపడిన, పనిచేస్తున్న, చదువుకుంటున్న విదేశీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని పలువురు చెప్తున్నారు. ట్రంప్‌కు అమెరికా ప్రజల్లో 38% గా ఉన్న ఆదరణ 30% కి పడిపోయిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక మరి కొన్ని సంస్థల అధ్యయనంలోనూ (రాయిటర్స్ ఇప్సోస్-35%, ఏపీ-ఎన్వోఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్-35%, స్ట్రెంత్ ఇన్ నంబర్స్ వెరా సైట్-33%) ట్రంప్‌కు మద్దతు తగ్గుతున్నట్టు వెల్లడయింది.
ఇరాన్‌తో యుద్ధం, పడిపోతున్న ఆర్థిక వ్యవస్థల నిర్వహణ, వలసలు వంటి విషయాల్లో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజామోదం లేదని పైన పేర్కొన్న 3 సంస్థలు తెలిపాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అమెరికన్లకు అసంతృప్తి అధికంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉన్నదని ఈ వారం ప్రారంభంలో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 70% మంది ప్రజలు తెలిపినట్టు ఏపీ ఎన్వోఆర్సీ సంస్థ వెల్లడించింది దేశం సరైన పంథాలో సాగడం లేదని 72% మంది అభిప్రాయపడినట్టు తెలియజేసింది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో మార్చి నెలలో ట్రంప్‌కు ఉన్న ప్రజాదరణ 38%, కానీ ఏప్రిల్ నాటికి అది 30%కు పడిపోయింది. జీవన వ్యయం విషయంలో కేవలం 23% మంది మాత్రమే ట్రంప్‌కు అనుకూల, 76% మంది ట్రంప్‌కు వ్యతిరేక అభిప్రాయం చెప్పారు. వీటికి తోడు ఈ మధ్యనే జార్జియా, ఫ్లోరిడా రాష్ర్టాలలో కార్చిచ్చు కమ్మేసింది.
భారత్ నుండి అమెరికా వెళ్లే వారిని అన్ని మాఫియా గ్యాంగ్ స్టర్ల కంటే ఎక్కువ నష్టం చేసి, మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చేసి దోచుకొని అమెరికాకు నష్టం కలిగిస్తున్న ‘గ్యాంగ్ స్టర్స్ విత్ లాప్టాప్” అని, మైకేల్ శావెజ్ అనే రాజకీయ విశ్లేషకుడు చేసిన పాడ్‌కాస్ట్‌ను ట్రంప్ సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్‌లో రీపోస్ట్ చేశారు. దాదాపు 10 నిమిషాల నిడివిగల వీడియోలో జాత్యహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. తమ పిల్లలు అమెరికాలో పుట్టేలా 9 నెలల గర్భంతో ఉన్న వారిని చైనా/ ఇండియా నుంచి అమెరికాకు తీసుకొస్తున్నారు. ఇక్కడ పుట్టి అమెరికా జాతీయ పౌరులైపోతున్నారు. ఇక్కడ పుట్టిన బేబీకి చట్టబద్ధంగా లభించే పౌరసత్వాన్ని ఆధారంగా చేసుకొని తమ మొత్తం కుటుంబాన్ని భారత్/చైనా నుంచో, భూగోళంపైనున్న మరో నరకప్రాయ దేశం నుంచో ఇక్కడికి తెస్తారు. అందుకే అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్లో మార్పులు చేయాలి. అమెరికా రాజ్యాంగాన్ని సవరించాలి అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే భావప్రకటనా స్వేచ్ఛ ప్రకారం తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెలువరించిన ఒక రాజకీయ విశ్లేషకుని పోస్టును బాధ్యత గల అమెరికా అధ్యక్షుడు రీపోస్ట్ చేయడమంటే ఆ అధ్యక్షుని మదిలో విదేశీయులపై ఉన్న దురభిప్రాయం ఇట్టే తెలిసిపోతుంది. గతంలో నేను భారతీయులకు మద్దతుదారుడుగా ఉండేవాన్ని.
అది ఎప్పటివరకంటే శ్వేత జాతీయులకు కాలిఫోర్నియాలో ఉండే హైటెక్ కంపెనీలలో ఒక్క ఉద్యోగం కూడా రావడం లేదని తెలియనంత వరకు. అక్కడ ఉద్యోగం పొందాలంటే భారత్/ చైనా నుంచి వచ్చిన వారై ఉండాలి అనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ కంపెనీల సీఈవోలందరూ కూడా భారత్/చైనా వారే అని ట్రంప్ పేర్కొన్నారు. ఎంతో కష్టపడి ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన భారతీయులు ఇలాంటి పరిస్థితులను జీర్ణించుకోలేక చాలామంది స్వదేశానికి తిరిగి రావాలని అనుకుంటున్నారని సర్వేలో తేలింది.
– డాక్టర్ కావలి చెన్నయ్య 90004 81768