ఇరాన్ యుద్ధం ప్రభావం ఇంట్లోకి వచ్చేసింది. వంటింట్లో మంటలు పుట్టిస్తున్నది. దేశవ్యాప్తంగా హోటళ్లు, దాబాలు, హాస్టళ్లు, క్యాంటీన్లు మొత్తంగా మూతపడుతున్నాయి. లేదా వంటకాలను పరిమితం చేస్తున్నాయి. బడిపిల్లల మధ్యాహ్న భోజనానికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంటికి సమయానికి రావాల్సిన సిలిండర్ ఆలస్యం కావడంతో ప్రజలు ఆందోళనతో గ్యాస్ గోదాములకు పరుగులెత్తుతున్నారు. సిలిండర్ల కోసం బారులు తీరిన జనాల దృశ్యాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
డీలర్లు కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ సరఫరాపై చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో వంటగ్యాస్ ప్రత్యామ్నాయాలపై ఆలోచనలు జరుగుతున్నాయి. అవకాశం ఉన్నచోట్ల కట్టెలపొయ్యిలకు మారిపోతున్నారు. ఆన్లైన్ సేల్స్ నుంచి ఇండక్షన్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు మాయమయ్యాయని వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు రైల్వే క్యాటరింగ్లోనూ ప్రత్యామ్నాయాల కోసం వెంపర్లాడుతున్నారు. వాణిజ్య సరఫరాను పునరుద్ధరించకపోతే హైదరాబాద్‌తో సహా తెలంగాణ అంతటా దాదాపు 90 శాతం హోటళ్లు, తినుబండారాల కేంద్రాలు 48 గంటల్లోపు మూసివేయవలసి వస్తుందని తెలంగాణ రాష్ట్ర హోటల్ అసోసియేషన్ హెచ్చరించింది. వాణిజ్య సంస్థలన్నిటినీ ఒకేగాటన కట్టి సరఫరా జరుపుతుండటం వల్ల హోటళ్ల వంటి నిత్యావసర వ్యవస్థ కుప్పకూలింది.
సందట్లో సడేమియా బ్లాక్ మార్కెట్ దందా విజృంభిస్తున్నది. మరోవైపు ఆటోలు, ఇతర వాహనాలు కూడా గ్యాస్ ఫిల్లింగ్ కోసం బంకుల ముందు బారులు తీరుతున్నాయి. తక్షణం సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర పెట్రోలియం మంత్రికి రాసిన లేఖలో సూచించారు. ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ’దేశవ్యాప్తంగా సంక్షోభం లేదంటూ’ సమస్యను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించడం విడ్డూరం. తక్షణం 10% గ్యాస్ ఉత్పత్తి పెంచమని రిఫైనరీలకు ఆదేశాలు జారీ చేయడాన్ని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడమేనని చెప్పక తప్పదు.
కేంద్రం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వంటి పథకాలు పెట్టి వంట గ్యాస్ ఉపయోగాన్ని కేంద్రం ప్రోత్సహించింది. ప్రధాని వ్యక్తిగత ప్రచారానికి గ్యాస్ సిలిండర్‌ను వాడుకున్నారు. మరోవైపు గట్టుచప్పుడు కాకుండా సబ్సిడీలకు మంగళం పాడుతూ తాను మోయాల్సిన భారాన్ని ప్రజలకు బదిలీ చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నది. అంతేకాక ధరలు పెంచింది.
తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను … పెంచింది. అయినప్పటికీ పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా స్థిరమైన సరఫరాలు, నిల్వలు నిర్వహించడంలో అసమర్థతను చాటుకున్నది. యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నవేళ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయిందన్నది వాస్తవం. ఫలితంగా దేశం వంటగ్యాస్ కొరతతో సతమతం అవుతున్నది. పైగా ప్రభుత్వం ముక్తసరి ప్రకటనలతో, అప్పుడప్పుడు ట్వీట్ల ద్వారా మాత్రమే సమాచారాన్ని చేరవేస్తున్నది. దీనివల్ల ఇంధన లభ్యతపై హామీల కంటే వేగంగా భయాందోళనలు వ్యాపించాయి. అంటే సరఫరాను మెరుగుపర్చేందుకు సకాలంలో తగిన చర్యలు తీసుకోవడం, సర్కారు పెద్దల ద్వారా నేరుగా భరోసా కల్పించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది.
ఈ సమస్య ఇప్పటికిప్పుడు వచ్చిపడింది కాదు. విదేశాంగ విధానంలో తప్పటడుగులు సమస్యకు ఆజ్యం పోస్తున్నాయి. యుద్ధం దాదాపుగా అనివార్యమని తేలిపోయిన తరుణంలో ప్రధాని మోదీ హుటాహుటిన ఇజ్రాయెల్‌కు వెళ్లి ఆ దేశానికి మద్దతు తెలుపడం విమర్శల పాలైంది. ఇరాన్ దగ్గర అపారమైన చమురు నిల్వలున్నాయి. హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌దే ఆధిపత్యం. ఇప్పుడు భారత్‌కు చమురు రవాణా చేస్తున్న నౌకలపై అక్కడ క్షిపణి దాడులు జరుగుతున్నాయి.
ఇలా ఇరాన్‌ను వ్యూహాత్మకంగా దూరం చేసుకోవడంతో ఇప్పుడు దేశం మెడకు సమస్యల ఉచ్చు బిగిస్తున్నది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి జరిపితే ఎదురయ్యే పరిణామాల్లో చమురు, సహజవాయువు కొరత ముఖ్యమైనదని ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. దేశ చమురు అవసరాల్లో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నప్పుడు మరింత అప్రమత్తత అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం చమురు దిగమతుల విషయంలో బయటి ఒత్తిళ్లకు తలొగ్గి ఊగిసలాట ధోరణి ప్రదర్శించడం మనం చూస్తున్నాం.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు విషయంలో అమెరికా దాష్టీకం ప్రదర్శిస్తున్నది. ఇది దేశ సార్వభౌమాధికారానికి సవాల్‌గా మారింది. ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించడానికి అమెరికా ఇప్పుడు భారతదేశం మళ్లీ రష్యన్ చమురును దిగుమతి చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నది. అయతే గతంలోలాగా చమురు ధరలపై రాయితీలు ఉండబోవని రష్యా స్పష్టం చేయడంతో భారత్ పరిస్థితి ఇరకాటంలో పడింది. ఇలా అగ్రరాజ్యాల ఆటలో పావుగా మారడం భారత్‌కు ఏమాత్రం క్షేమకరం కాదు.