ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియపై పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి బూత్ పరిధిలోని దొంగ ఓట్లను ఏరివేయడంతో పాటు స్తానికులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. బుధవారం స్తానిక ఎమ్మెల్యే టీ పద్మారావు గౌడ్ అధ్యక్షతన సీతాఫల్మండిలో జరిగిన సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక నిరంతర సవరణ (సర్), పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై కేటీఆర్ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్/సర్) పై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అత్యంత చురుగ్గా వ్యవహరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉపాధి, చదువుల కోసం ్రప్రజలు కిరాయి ఇళ్లు మారే క్రమంలో ఓట్ల మార్పిడి జరుగుతుందని గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రతి ఒక కార్యకర్త బాధ్యతగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణలో కీలకమైన నాలుగు అంశాలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు.
సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపిస్తూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో 95 లక్షలు, బీహార్‌లో 65 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించడం వలనే అక్కడి ప్రధాన పార్టీలు నష్టపోయాయని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలోనూ ఇటువంటి అక్రమాలు జరగకుండా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) సైనికుల్లా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ‘కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే వాతావరణం ఉందని, దానిని ఓట్ల రూపంలో మార్చాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. బీజేపీ, పార్టీలు దొంగ ఓట్లను చేర్పించి, అక్రమ మార్గాల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని చూస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. వారి కుట్రలు సాగకుండా చూడాల్సిన బాధ్యత మన సైనికులైన బీఎల్ఏలదేనని అన్నారు.
జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే..
ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అనేది ఓటర్ల జాబితాను జల్లడపట్టే వడపోత కార్యక్రమం అని కేటీఆర్ వివరించారు. ఈ యేడాది జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వస్తారని, ఈ సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలన్నారు. చనిపోయిన వారి ఓట్లను తొలగించడం, ఇళ్లుమారిన వారి వివరాలను సవరించడం వంటి 5 రకాల బాధ్యతలను ఏజెంట్లు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అక్టోబర్ 1న వెలవడే తుది జాబితాయే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కీలకం కానుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన ఓట్ల అక్రమాలను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ఒకే ఓటరుకు ఐదు వేర్వే రు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్న ఉదాహరణలను స్క్రీ న్పై ప్రదర్శించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఇటువంటి అనుమానస్పద ఓట్ల జాబితాను పార్టీ తరపున వర్క్ బుక్ రూపంలో ప్రతి ఏజెంట్‌కు అందజేస్తామని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు.
అధికారులే ఇంటికి వచ్చి సమాచారం సేకరిస్తారు..
దేశంలోనే అత్యంత ధనవంతుడైన అంబానీకైనా, సామాన్యుడికైనా ఒకే ఓటు హకు ఉంటుందని, ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కేటీఆర్ అన్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం 18 ఏళ్లు నిండిన వారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఓటుహకు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ, ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో అధికారులే స్వయంగా ప్రతి ఇంటికీ వచ్చి, వివరాలు సేకరించి ఓటు హకును నమోదు చేస్తారని, ఈ అవకాశాన్ని ప్రతి ఒకరూ సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ సలీం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్, బీఎల్ఏలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదు అంతా డిజిటల్..
ఇదే నెలలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో సరికొత్త మొబైల్ యాప్ ద్వారా చేపట్టనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కేవలం ఫోన్ నంబర్, ఫొటో అప్లోడ్ చేస్తే ఓటర్ ఐడీ ఆధారంగా వివరాలన్నీ ఆటోమేటిక్‌గా నమోదు అవుతాయని చెప్పారు. సికింద్రాబాద్‌లో ప్రతి కార్యకర్తకూ బ్రహ్మాండమైన ఫొటో ఐడీ కార్డులు అందించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
మిత్తీతో సహా చెల్లిస్తాం: మాజీ మంత్రి తలసాని

రేవంత్ సర్కార్ రెండున్నరేళ్లుగా హైదరాబాద్‌లో ఒక్క మంచి కార్యక్రమం కూడా చేపట్టలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు లక్షతోపాటు తులం బంగారం, మహిళలకు రూ.2,500, వృద్ధులు, వితంతువులకు రూ.4000 పెన్షన్, నిరుద్యోగులకు భృతి వంటి ఎన్నో హామీలిచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్ అప్పులు చేశారని, కానీ వాటితో సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రజాభవన్, ప్రతి జిల్లాలో కలెక్టరేట్, కాళేశ్వరం ప్రాజెక్టు, జిల్లాల్లో మెడికల్ కళాశాలలు నిర్మించారని కొనియాడారు. కాంగ్రెస్ సర్కార్ 4.5 లక్షల కోట్లు అప్పుచేసి ఏమిచేసిందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మన అస్తిత్వంపై దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. స్థానిక నాయకులు సికింద్రాబాద్ ప్రజల మధ్యే ఉండాలని పిలుపునిచ్చారు. అధికారం, పోలీస్‌లు మని చేతిలో ఉందికదా అని ఏదిపడితే అది చేస్తామంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని.. అప్పుడు మిత్తీతో సహా చెలిస్తాం.
కార్యకర్తలకు కేటీఆర్ సూచించిన నాలుగు ముఖ్య సూత్రాలు
1. కొత్త ఓట్ల నమోదు : గత ఎన్నికల సమయంలో 16 ఏళ్లు ఉండి, ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన యువతీయువకులను గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితాలో తప్పనిసరిగా నమోదు చేయించాలి.
2. మరణించిన వారి ఓట్ల తొలగింపు : నియోజకవర్గంలో చనిపోయిన వారి వివరాలను సేకరించి, వారి ఓట్లను జాబితా నుంచి తొలగించేలా చూడాలి.
3. వలస వెళ్లిన వారి ఓట్ల సవరణ : ఉదాహరణకు అంబర్పేట్ నుంచి ఎల్బీనగర్ లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లను ఇకడ తొలగించి, వారు ప్రస్తుతం నివసిస్తున్న చోట నమోదు చేయించాలి.
4. కొత్తగా వచ్చినవారి ఓట్ల నమోదు : ఇతర నియోజకవర్గాల నుంచి మన ప్రాంతానికి వలసవచ్చినవారి వివరాలను సేకరించి, వారికి ఓటు హకు కల్పించేలా చర్యలు చేపట్టాలి.