2 లక్షల రూపాయల దాకా ఉన్న రైతుల పంట రుణాలను ఆగస్టు 15లోగా మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల వేళ పదే పదే ప్రకటించారు. కానీ, ఆచరణకు వచ్చేసరికి ఆయన మాటలకు, చేతలకు పొంతనే లేదు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల జీవో నెం.567 ద్వారా ఈ విషయం స్పష్టమవుతున్నది. రైతులందరికీ, వారి పేరిట బ్యాంకు ఖాతాలో ఉన్న రుణం ప్రకారం మాఫీ వర్తిస్తుందని చెప్పిన హామీకి ఇప్పుడు ‘కుటుంబం’ అనే మాట అడ్డు తగులుతున్నది. వ్యవసాయ భూమి ఉన్నవారికి పట్టా పాస్‌బుక్ ఆధారంగా బ్యాంకు పంట రుణాలను మంజూరు చేస్తుంది. ఒక్క కుటుంబంలో ముగ్గురి పేరిట భూమి ఉంటే బ్యాంకు ఆ ముగ్గురికి విడివిడిగా రుణం ఇస్తుంది. పంట రుణానికి, కుటుంబానికి, కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్యకు అసలు ఎలాంటి సంబంధం లేదు.
రుణమాఫీ కోసం రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్‌కార్డు ప్రామాణికమని ప్రభుత్వ ఉత్తర్వులో ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. పౌరసరఫరాల శాఖ నిర్వహించే ఆహార భద్రతకార్డు (పీడీఎస్) డేటాబేస్ ప్రామాణికమని అందులో ఉంది. నిజానికి రేషన్‌కార్డుకు పంట రుణానికి సంబంధమే లేదు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉండటం లబ్ధిదారుల ప్రాథమిక అర్హత. అదే తెల్లకార్డు పరిమితిని పంట రుణమాఫీకి వర్తింపజేయడం గందరగోళాన్ని సృష్టిస్తున్నది. రుణమాఫీకి తెల్ల రేషన్‌కార్డు ప్రామాణికమని కొన్ని పత్రికలు పతాక శీర్షిక పెట్టగా.. వార్తల్లో మాత్రం కుటుంబాన్ని గుర్తించడానికే రేషన్‌కార్డు అని మంత్రి తుమ్మల అన్నట్టు ఉంది. అంటే అన్నిరకాల రేషన్‌కార్డులను కేవలం రైతు కుటుంబ సభ్యుల లెక్కింపు కోసం పరిగణనలోకి తీసుకుంటామనే అర్థం ఆయన మాటల్లో కనిపిస్తున్నది.
బ్యాంకుల నుంచి పంట రుణాల వివరాలు సేకరించి, రేషన్‌కార్డు ఆధారంగా వారి కుటుంబాన్ని నిర్ధారించి, ఆ కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి బ్యాంకు ఇచ్చిన రుణంలో రెండు లక్షల దాకా రుణమాఫీ వర్తించేటట్టు ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల స్వల్పకాలిక పంట రుణమాఫీ అన్న హామీ మొదటికే మోసమై.. ఇప్పుడు రైతు కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణమాఫీగా మారిపోయింది. ఇంతవరకు ఏ రుణమాఫీలో పెట్టని నిబంధన ఇది. దీని వల్ల రెండు రకాలుగా రైతులు నష్టపోతారు. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, పాత వాటిలో మార్పులు, చేర్పులకు అవకాశం లేనందు వల్ల విడిపోయిన రైతు కుటుంబాల పేర్లు ఒకే కార్డులో ఉన్నాయి. ఉదాహరణకు ఒక కుటుంబంలోని అన్నదమ్ములు విడిపోయి, భూమి పంచుకొని సొంత కుటుంబాల కోసం వ్యవసాయం చేస్తున్నా.. కార్డులో మాత్రం కలిసే ఉంటారు. బ్యాంకుల ద్వారా తండ్రి, ఇద్దరు కొడుకులు విడిగా చెరో రెండు లక్షలు అప్పు తీసుకున్నా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తండ్రి తీసుకున్న రుణం మాఫీ అవుతుంది. కానీ, కొడుకులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం చేకూరదు. ఈ లెక్కన బ్యాంకులో అప్పు తీసుకున్న ప్రతి రైతుకు రెండు లక్షల దాకా మాఫీ అవుతుందని నమ్మినవారు దెబ్బతిన్నట్టే. మాఫీ కోసం వెంటనే కొత్త రేషన్‌కార్డు పొందే అవకాశమూ లేదు. గత కొన్నేండ్లుగా తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, పాత వాటిలో మార్పులు జరగలేదు. అంటే కుటుంబాలు విడిపోయినా, రేషన్‌కార్డులో మాత్రం కలిసే ఉన్నారు. కొత్త రేషన్‌కార్డు కోసం రాష్ట్రంలో ప్రస్తుతం 9 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతి రైతు రుణానికి మాఫీ వర్తింపజేయకపోగా పదేండ్ల కిందటి రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడమంటే దగా చేయడమే. కుటుంబం ప్రాతిపదికను పక్కనబెట్టి బ్యాంకులో రుణం తీసుకున్న ప్రతి రైతుకు ఈ ప్రయోజనం అందాలి.
అంతేకాదు, రీషెడ్యూల్ అయిన పంట అప్పులకు, జాయింట్ లయబిలిటీ గ్రూపులకు, లోన్ ఎలిజిబిలిటీ కార్డు ద్వారా రుణం పొందినవారికి రుణమాఫీ వర్తించదని జీవోలో ఉంది. కరువు ప్రాంతాలుగా ప్రకటించిన మండలాల్లో బ్యాంకులు పాత రుణాలను రీషెడ్యూల్ (వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం) చేసి కొత్త పంట రుణాలను ఇస్తాయి. అంటే రీషెడ్యూల్ చేసిన పంట రుణాలకు న్యాయంగా ఈ మాఫీ వర్తించాలి. ఇక జేఎల్‌జీల విషయానికొస్తే.. ఎకరంలోపు భూమి ఉన్న రైతులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి తీసుకొనే పంట అప్పు విధానం అన్నమాట. పది, పదిహేను మంది సన్నకారు రైతులకు విడివిడిగా రుణాలు ఇవ్వడం వల్ల బ్యాంకులపై పనిభారం పెరుగుతుందని, దాన్ని తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ గ్రూపుల ఏర్పాటుకు అనుమతునిచ్చింది. వీటికి అర్హత లేకపోవడమంటే చిన్నరైతుల నడ్డి విరవడమే.
కౌలు రైతులు బ్యాంకు రుణాలు పొందడానికి లోన్ ఎలిజిబిలిటీ కార్డు (ఎల్ఈసీ)ని రెవెన్యూ అధికారులు అందజేస్తారు. తమ భూమిలో ఆ యేడు పంటలు వేసేందుకు సదరు కౌలు రైతుకు అనుమతినిస్తున్నామని భూ యజమాని ఇచ్చే ధృవీకరణతో ఎల్ఈసీ జారీ చేస్తారు. ఆ కార్డులోని వివరాల ఆధారంగా సదరు కౌలురైతుకు బ్యాంకులు ఒక సంవత్సరం కాలానికి పంట రుణం మంజూరు చేస్తాయి. బ్యాంకు ద్వారా కౌలు రైతులు పంట రుణం పొందేందుకు కేంద్రం ఇచ్చిన వెసులుబాటు ఇది. అయితే అనవసర భయంతో భూ యజమాని ధృవీకరణకు నిరాకరిస్తుండటంతో ఈ విధానం ఆచరణకు నోచుకోవడం లేదు. నిజానికి ఈ మూడు విధాలుగా బ్యాంకుల్లో ఉన్న రుణ బకాయిలు చాలా తక్కువగానే ఉంటాయి. పైగా రుణమాఫీ పొందేందుకు పూర్తి అర్హత వీరికుంది. నమ్మి ఓటేసిన రైతులకు హామీ మేరకు లబ్ధిని చేకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కాబట్టి కుటుంబ నిబంధనను తొలగించి పైన పేర్కొన్న వర్గాలకు కూడా రుణమాఫీ వర్తించేలా ‘పంట రుణమాఫీ పథకం- 2024’లో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– బి.నర్సన్
94401 28169