రాష్ట్రంలో గత రెండేండ్లుగా ప్రతిపక్షాన్ని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మక కుట్రలు అమలు చేస్తూనే ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా రాజకీయాలు చేయడంలో రేవంత్-బీజేపీ రహస్య బంధం బయటపడుతూనే ఉన్నది. బీఆర్ఎస్ను రాజకీయంగా బలహీనపర్చి, ఆ రాజకీయ స్పేస్‌ను అక్రమించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే, కేసీఆర్ కుటుంబంపై రాజకీయ కక్షతో ప్రధాని మోదీ ఆదేశాలను సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారు.
తెలంగాణలో కేటీఆర్ టార్గెట్‌గా బడే భాయ్, చోటే భాయ్ రాజకీయాలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని బీఆర్ఎస్ నేతలపై రాజకీయ ప్రేరేపిత కేసులు పెడుతున్నారు. పొలిటికల్ వెండెట్టాతో వేధింపులకు గురిచేస్తున్నారు. సహజంగా దేశంలో కాంగ్రెస్, బీజేపీలు రాజకీయంగా బద్ధ శత్రువులు, సైద్ధాంతిక విరోధులు. కానీ, తెలంగాణలో మాత్రం వారిది పేగుబంధం. చీకటి ఒప్పందాలతో రహస్యంగా పనిచేసే బహిరంగ మిత్రులు వారు.
దేశంలోని ప్రాంతీయ పార్టీలంటే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు గిట్టదు. ప్రాంతీయ పార్టీలను, యువ నాయకత్వాన్ని రాజకీయంగా నిర్మూలించడం, ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడమే జాతీయ పార్టీల ఎజెండా. ఇప్పటికే ఉత్తరాదిలోని ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్, బీజేపీలు నిర్వీర్యం చేశాయి. నిన్నటికి నిన్న బీహార్‌లో ఆర్జేడీని కాంగ్రెస్, బీజేపీలు కలిసి మట్టికరిపించాయి. అంతకుముందు యూపీలో సమాజ్‌వాదీ పార్టీని, కర్ణాటకలో జేడీఎస్‌ను, ఢిల్లీలో ఆప్‌ను, మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేనలను ఇంకా అనేక ప్రాంతీయ పార్టీలను పూర్తిగా బలహీనపర్చాయి. వాస్తవానికి దేశంలో యువ నాయకత్వం ఎదుగుదలను నిరోధించడమే మోదీ-బీజేపీల ఎజెండా. అందుకే అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, కేటీఆర్, ఉదయనిధి స్టాలిన్ వంటి యువ నేతలను బీజేపీ టార్గెట్ చేసింది. ఉత్తరాదిలో అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణలోనూ బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్నాయి. అందులో భాగంగానే తెలంగాణలో మోదీ ఎజెండాను రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ బడే భాయ్, చోటే భాయ్ ఉమ్మడిగా ఎత్తులు వేస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేందుకు జాతీయ స్థాయిలో బద్ధ విరోధులైన వారు సైతం ఆప్తమిత్రులుగా వ్యవహరిస్తున్నారు. అందుకే మోదీ, రేవంత్‌రెడ్డి వేర్వేరు గొంతుకల నుంచి ఒకే స్వరం వినిపిస్తున్నారు. జాతీయ పార్టీల వైఫల్యాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలనను విమర్శిస్తూ ఆయన నిత్యం ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. బీజేపీ మత రాజకీయాలను, కాంగ్రెస్ విధ్వంసక పాలనను కడిగిపారేస్తున్నారు. దీంతో తెలంగాణలో రేవంత్‌రెడ్డికి, బీజేపీకి కేటీఆర్ టార్గెట్ అయ్యారు. బడే భాయ్, చోటే భాయ్లకు కేటీఆర్ ఉమ్మడి శత్రువుగా మారారు. తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ పార్టీగా ఎదగడం, ఆ పార్టీకి ఉద్యమ నేపథ్యం ఉండటం; యువ నాయకుడిగా, విజనరీగా, పరిపాలనాదక్షుడిగా కేటీఆర్‌కు దేశవిదేశాల్లో మంచి పేరుండటం, ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉండటంతో ఎప్పటికైనా కాంగ్రెస్, బీజేపీలకు ప్రమాదకరంగా మారుతారన్న భయంతోనే కేటీఆర్‌ను వారు టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు.
దక్షిణాదిలో పవన్ కల్యాణ్, లోకేష్ వంటి యువ నేతలను బీజేపీ ప్రోత్సహిస్తున్నా, వారు కేటీఆర్ ఇమేజ్ను, చరిష్మాను అందుకోవడం లేదు. అందుకే నేరుగా కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, రేవంత్‌రెడ్డి ఆ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ బీజేపీ ఎజెండానే ఆయన అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికారుల పొరపాట్లను కేటీఆర్‌కు, కేసీఆర్‌కు అంటగడుతూ రేవంత్‌రెడ్డి, బీజేపీలు వెండెట్టా రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ- రేస్‌ను పదే పదే తెరపైకి తెస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పేరుతో కేసీఆర్‌ను వేధింపులకు గురిచేస్తున్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంచుతూ, ప్రజల్లో సీరియస్‌గా తిరుగుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై కేటీఆర్ నిరంతరం పోరాటం చేస్తున్నారు. దాంతో ఢిల్లీలోని బీజేపీ సర్కార్ ఆదేశాల మేరకు తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్‌ల వ్యక్తిత్వ హననానికి రేవంత్‌రెడ్డి పాల్పడుతున్నారు. ఒకవైపు అక్రమ కేసులతో కేటీఆర్‌ను, కేసీఆర్‌లను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఇబ్బందులకు గురిచేస్తూనే, రాజకీయంగా వారు యాక్టివ్‌గా లేకుండా ఒక క్రమపద్ధతిలో కుట్రలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్న కేటీఆర్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు. అందుకే పార్టీని, క్యాడర్‌ను రాజకీయంగా డీమోరలైజ్ చేసేందుకు ప్రతీ సందర్భంలోనూ అక్రమ కేసులను తెరపైకి తెస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇదే విధంగా చేశాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఇలాగే అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాయి. రేవంత్, మోదీ ఏకమై కేసీఆర్, కేటీఆర్‌లపై అక్రమ కేసులు పెట్టించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ములేక కేసులు, విచారణలు అంటూ కుతంత్రం పన్నారు. మరీ ముఖ్యంగా కాళేశ్వరం పేరిట కేసీఆర్‌ను, ఫార్ములా ఈ-కార్ రేస్ పేరుతో కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్పై, కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా తమ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న కేటీఆర్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి లీక్ వార్తలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. బీఆర్ఎస్ బలపడుతుందని గ్రహించిన ప్రతీసారి, అసెంబ్లీ సమావేశాలకు ముందు, ఏదైనా ఎన్నికల సమయంలో.. ఇలా కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇది రేవంత్‌రెడ్డికి దీర్ఘకాలిక ఎజెండాగా మారింది.
తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ పార్టీలో మాత్రం ఆ ఉత్సాహం లేదు. టెక్నికల్‌గా కాంగ్రెస్ గెలిచినా, అక్కడ నైతిక విజయం మాత్రం బీఆర్ఎస్ పార్టీదే అన్నది బహిరంగ రహస్యం. అంతేకాదు, గతంలో కంటే గులాబీ పార్టీ అక్కడ మరింత స్ట్రాంగ్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కోల్పోయిన ఓట్ షేర్‌ను తిరిగి సాధించింది. దీంతో రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకుపుట్టింది. కాంగ్రెస్, బీజేపీ బంధం కూడా తెలంగాణ ప్రజలకు స్పష్టమైంది. అటు డిపాజిట్ కోల్పోవడం, బీఆర్ఎస్ మరింత స్ట్రాంగ్‌గా మారడం బీజేపీకి మింగుడుపడటం లేదు. తామే ప్రత్యామ్నాయమని చెప్పుకొనే కాషాయ పార్టీకి జూబ్లీహిల్స్ ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్, బీజేపీలు కలిసి మళ్లీ ఈ-కార్ రేస్‌ను తెరపైకి తీసుకువచ్చారు.
జూబ్లీహిల్స్‌లో కష్టంమీద గెలిచిన కాంగ్రెస్‌కు, డిపాజిట్ కూడా దక్కని బీజేపీకి స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్‌గా మారాయి. పార్టీని బలోపేతం చేసుకునేందుకు వారికి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. కాగా, జూబ్లీహిల్స్‌లో ఓడిపోయినా, భవిష్యత్తు బీఆర్ఎస్దే అన్న భరోసాతో ఆ పార్టీ క్యాడర్ మరింత బలోపేతమైంది. అందుకే ఆ భరోసాను దెబ్బకొట్టేందుకు ఫార్ములా రేస్‌ను మరోసారి బీజేపీ, రేవంత్‌రెడ్డి వాడుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలంగా ఉంది. పార్టీ మొత్తాన్ని మళ్లీ యాక్టివ్ చేసే పనిలో కేటీఆర్ నిమగ్నమయ్యారు. అటు హరీశ్‌రావు కూడా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ కృష్ణార్జునులుగా చెప్పుకొనే కేటీఆర్, హరీశ్‌రావు రైతు సమస్యలపై పోరాటం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వంలో మళ్లీ భయం మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని లీక్‌లు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో బీఆర్ఎస్ను, కేటీఆర్‌ను నిలువరించేందుకు ఈ-రేస్ డ్రామాను మరోసారి రక్తి కట్టించేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి గొంతుకోసింది. ఇచ్చిన హామీని తుంగలో తొక్కి, మాటమార్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయించింది. అంతేకాదు, రాజ్యాంగబద్ధంగా కాకుండా, పార్టీపరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని బీసీ సమాజాన్ని తడిగుడ్డతో గొంతుకోసింది. దీంతో బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్‌రెడ్డి చేసిన ద్రోహంపై బీసీ సమాజం భగ్గుమంటున్నది. అటు బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటం చేస్తున్నది. అందుకే డైవర్షన్ రాజకీయాలు, డ్రామాల పాలిటిక్స్ చేయడంలో ఆరితేరిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ-రేస్‌ను తెరపైకి తీసుకువచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ద్రోహంపై, రేవంత్ నయవంచక పాలనపై ప్రజల్లో చర్చ జరగకుండా మీడియా అటెన్షన్ మొత్తం ఈ-రేస్ చుట్టే ఉండాలని రేవంత్ కుట్రలు చేశారు. దీనిపై చర్చ లేకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. అంతేకాదు, పార్టీ క్యాడర్ మొత్తం ఈ అంశం చుట్టే ఉండేలా పన్నాగం పన్నారు.
– తోటకూర రమేష్