గౌరవనీయ మంత్రి గారికి,
దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణ, సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాల ప్రారంభం నేపథ్యంలో, తెలంగాణలోని కాజీపేటను ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మీ ముందుంచుతున్నాను. ప్రస్తుత పునర్వ్యవస్థీకరణ వల్ల కొన్ని సెక్షన్లు పంపిణీ అయినప్పటికీ, సికింద్రాబాద్ డివిజన్‌పై విపరీతమైన నిర్వహణ భారం పడుతున్నది. తాజా గణాంకాల ప్రకారం, ఈ డివిజన్ ప్రస్తుతం 2755 ట్రాక్ కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది.
వాడిరాయచూర్, విష్ణుపురంబీబీనగర్ డబ్లింగ్ సెక్షన్లు తోడైతే, ఇది దాదాపు 3150 ట్రాక్ కిలోమీటర్లకు చేరుకుంటుంది. భారతీయ రైల్వేల పరిధిలో సమర్థవంతమైన పరిపాలన కోసం ఉండాల్సిన పరిమితి కంటే ఇది చాలా ఎక్కువ. ఉదాహరణకు, సౌత్ కోస్ట్ రైల్వేలోని విజయవాడ, గుంతకల్ డివిజన్లు సుమారు 2200 ట్రాక్ కిలోమీటర్లు ఉండగా, గుంటూరు డివిజన్ 900 కిలోమీటర్ల లోపే ఉన్నది. పరిమాణం, సంక్లిష్టత, రద్దీ పరంగా సికింద్రాబాద్ డివిజన్ అసాధారణమైన భారాన్ని మోస్తున్నది. ఈ నేపథ్యంలో, కాజీపేట డివిజన్ ఏర్పాటు అత్యవసరం.
ప్రతిపాదిత కాజీపేట డివిజన్ పరిధిలోకి ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్లోని కాజీపేట బల్లార్షా, పెద్దపల్లి నిజామాబాద్, కాజీపేట యెర్రుపాలెం, డోర్నకల్ మణుగూరు, సత్తుపల్లి సెక్షన్లతోపాటు మోటమర్రి విష్ణుపురం, కాజీపేట వంగపల్లి సెక్షన్లను చేర్చాలని కోరుతున్నాను. సుమారు 15002000 ట్రాక్ కిలోమీటర్లతో కూడిన ఈ విభాగం ఒక స్వతంత్ర డివిజన్‌గా ఉండటానికి అన్ని విధాలా అర్హత కలిగి ఉన్నది. అలాగే, కొన్ని మార్పులను కూడా కోరుతున్నాను. పెద్దపల్లినిజామాబాద్ సెన్షన్ను హైదరాబాద్ డివిజన్‌కు మార్చే ప్రతిపాదనను ఉపసంహరించుకొని, దాన్ని ప్రతిపాదిత కాజీపేట డివిజన్లోని ఉంచాలి.
అలాగే, లాతూర్ రోడ్-పర్లీ వైజ్నాథ్ సెక్షన్‌ను నాందేడ్ డివిజన్‌కు మార్చకుండా సికింద్రాబాద్ డివిజన్‌లోనే ఉంచడం వల్ల నిర్వహణ సామర్థ్యం దెబ్బతినకుండా ఉంటుంది. డివిజన్ కేంద్రంగా ఉండటానికి కాజీపేట అన్ని రకాలుగా అనువైనది. ఇది ప్రధాన రైలు మార్గాల కూడలిలో ఉండటమే కాకుండా, ఇటీవల ఇక్కడ బల్లార్షా, విజయవాడ వైపు మూడో లైన్ పనులు పూర్తి కావడం, సికింద్రాబాద్కాజీపేట మధ్య నాలుగో లైన్ మంజూరు కావడం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగింది. ఇవి ఈ ప్రాంతాన్ని అధిక సామర్థ్యం గల రైలు కారిడార్‌గా మార్చాయి. కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్, మహబూబాబాద్‌లో లోకో మెయింటెనెన్స్ సౌకర్యాలు ఈ ప్రాంత ప్రాముఖ్యతను మరింత పెంచుతున్నాయి.
ప్రతిపాదిత కాజీపేట డివిజన్ ప్రధానంగా బొగ్గు (సింగరేణి), సిమెంట్, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా ద్వారా అధిక ఆదాయాన్ని అందించే అవకాశం ఉన్నది. దీనికి ప్రస్తుతం ఉన్న చాలా డివిజన్ల కంటే ఎక్కువ ఆదాయ సామర్థ్యం ఉన్నది. సికింద్రాబాద్ డివిజన్‌పై ప్రస్తుతం ఉన్న భారం వల్ల నిర్ణయాల్లో జాప్యం, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నాయి. కాజీపేట డివిజన్ ఏర్పాటుతో పాలన వికేంద్రీకరణ జరిగి నిర్వహణ మరింత మెరుగుపడుతుంది. దీనివల్ల ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి, ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుంది. కావున, నిర్వహణ సామర్థ్యం, ఆర్థిక లాభదాయకత, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు తక్షణమే అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈ నిర్ణయం భారతీయ రైల్వేల సంస్థాగత సామర్థ్యాన్ని పెంచుతుందని విశ్వసిస్తున్నాను.
– ధన్యవాదాలతో
కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్