Congress-BJP | ఫార్ములా-ఈ పేరిట జరుగుతున్న దర్యాప్తుల తతంగం వెనుకనున్న మర్మం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఓ అంతర్జాతీయ ఈవెంట్‌ను రాష్ర్టానికి రప్పించి పేరుప్రతిష్ఠలు పెంచేందుకు, పారిశ్రామికంగా తోడ్పాటు అందించేందుకు జరిగిన సదాశయ ప్రయత్నమిది. పైగా అందులో ఎలాంటి గోప్యత లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు చుట్టూ ఏదో కథ అల్లాలనే కుతంత్రం స్పష్టంగా గోచరిస్తున్నది. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం కేంద్ర-రాష్ర్టాల సయోధ్య. ఒకరు ఇదిగో పులి అంటే ఇంకొకరు అదిగో తోక అంటున్నారు. కేవలం రూ.55 కోట్ల వ్యవహారం. అదీ ఖాతా నుంచి ఖాతాకు మధ్య జరిగిన లావాదేవీ. ఇటు రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలోని ఏసీబీ కేసువేస్తుంది. అటు కేంద్రం కనుసన్నల్లో పనిచేసే ఈడీ దర్యాప్తు అంటూ రంగంలోకి దిగుతుంది.
తానా అంటే తందా నా అన్నట్టు చెట్టపట్టాలేసుకుని కేసులు పెడుతున్నారు. బీజేపీ-కాంగ్రెస్ మిలాఖత్కు ఇంతకన్నా రుజువులేమి కావాలి. రెండింటి మధ్య కేసులు, దర్యాప్తుల విషయంలో కనిపిస్తున్న సమన్వయం విస్మయం కలిగిస్తున్నది. దర్యా ప్తు పేరిట ఏదో తవ్విపోస్తున్నట్టు హంగామా చే స్తుండటం విచిత్రం. ఇది రాజకీయ కక్షసాధింపు వ్యవహారమని పైకి తెలిసిపోతూనే ఉంది. బీజేపీ ప్రతిపక్ష పాత్రను పోషించి ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ అలా చేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నది. ఇది బీజేపీ-కాంగ్రెస్ మిలాఖత్కు మరో నిదర్శనం. రాష్ట్రంలో ఓ మంత్రికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో ఈడీ దాడులు చేసింది. నోట్ల లెక్కింపు యంత్రాలూ వినియోగించినట్టు వినికిడి. కానీ సోదాలు ఎందుకు జరిపిందీ, ఎంత డబ్బు దొరికిందీ బయటకు రాలేదు. దర్యాప్తుల్లో మనవాళ్లు, పైవాళ్లు అనే తేడాలున్నాయా? రాత్రికిరాత్రే పార్టీలు, విధేయతలు మారితే అవినీతిపరులు పులుకడిగిన ముత్యాలు అవుతారా?
11 ఏండ్ల మోదీ పాలనలో జరిగిన సంస్థల దుర్వినియోగం ఒక ఎత్తయితే రేవంత్ ఏడాది పాలనలో జరుగుతున్న కేసుల బనాయింపు మరొక ఎత్తు. విపక్ష రాజకీయ వేత్తలను ఇరకాటంలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం చేతిలో సీబీఐ, ఈడీ వంటి సంస్థలు సాధనాలుగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ దర్యాప్తులు దరిజేరవు. కేసులు కడతేరవు. వేధింపులు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉదంతమే తీసుకుందాం. ఇదివరకే ఆయన జైలుకు వెళ్లి అతికష్టం మీద బెయిలుపై బయటపడ్డారు. ఇప్పుడు ఎన్నికల వేళ మరోసారి ఆయనపై ఈడీ విచారణకు కేంద్రం అనుమతించడం ఎందుకో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.
మనసులో ఏదో పెట్టుకుని బురద జల్లుతున్నారు. అక్కడ ఎన్నికల్లో ప్రచారం చేసుకోకుండా అడ్డుకుంటే, ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నించకుండా గొంతు నొక్కుతున్నారు. అసలు ఒకటే కేసులో రెండ్రెండు విచారణలు కొనసాగడం వింతల్లోకెల్లా వింత. గతంలో కేంద్ర సంస్థల దర్యాప్తు అంటే ఉగ్రవాదం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లోనే ప్రధానంగా జరిగేది. కానీ ఇప్పుడు ఇసుక తవ్వకాలు, పేపరు లీకులపై కూడా సీబీఐ, ఈడీ దర్యాప్తులు సాగిస్తున్నాయి.
ఆ రెండు సంస్థల కేసుల్లో కొసకంటా కొనసాగి, నేరం రుజువై, శిక్షలు పడ్డవి ఎన్ని? ఈడీ గత పదేండ్ల కాలంలో 5,297 కేసులు దాఖలు చేస్తే అందులో ఇప్పటివరకు విచారణ పూర్తి చేసుకున్నవి కేవలం 43. అందులోనూ శిక్ష పడినవి 40 మాత్రమే. మిగతా వేలమంది విషయం ఏమిటనే ప్రశ్న ఎదురవుతున్నది. ప్రత్యర్థి పార్టీల నేతలను రాజకీయంగా లొంగదీసుకోవడమే కేసులు, విచారణలు, దర్యాప్తుల పరమోద్దేశం. బీఆర్ఎస్ నేతలకు కేసులు కొత్తకాదు. రాష్ట్ర సాధన కోసం జరిగిన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న చరిత్ర వారికి ఉంది. రెండు జాతీయ పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్సే. అందుకే కక్షకట్టారు. కేసులు పెట్టారు. కాకలు తీరిన యోధులను తాటాకు చప్పుళ్లతో బెదిరించాలని చూస్తున్నారు. ప్రత్యర్థులను అష్ట దిగ్బంధనం చేస్తే ప్రశ్నించే గొంతులు మూగపోతాయని ఆశ పడుతున్నారేమో. అది జరిగే పని కాదు. ఎన్నటికైనా ధర్మం నిలిచి వెలుగుతుంది. సత్యం గెలిచి తీరడం తథ్యం.