గౌరవనీయులు ముఖ్యమంత్రి
శ్రీ ఏ రేవంత్‌రెడ్డి గారికి…
నమస్కారం,
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ తరుణంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరిచ్చిన హామీల గురించి తెలంగాణ ప్రజల పక్షాన గుర్తుచేసేందుకే ఈ లేఖ రాస్తున్నాను. తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట మభ్యపెట్టి రెండేండ్లు గడిచినా ఇప్పటికీ అమలుకు నోచుకోని నేపథ్యంలో, కనీసం ఈ సారి బడ్జెట్లోనైనా అవసరమైన నిధులు కేటాయించాలని నాలుగు కోట్ల ప్రజల పక్షాన మిమ్మల్ని కోరుతున్నాను. వృద్ధులు, వితంతువులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్‌ను నాలుగు వేలకు పెంచడానికి ఎన్ని నిధులు కావాలో లెక్కగట్టి ప్రతి పైసాను ఈ సారి బడ్జెట్లో కేటాయించాల్సిన బాధ్యత మీపై ఉన్నది. అలాగే రాష్ట్ర జనాభాలో సగభాగంగా ఉన్న ప్రతీ ఒక్క మహిళకు మహాలక్ష్మి కింద నెలకు రూ.2500లు అందజేస్తామని హామీ ఇచ్చారు.
25 నాలుగు గడిచిపోయినా ఇప్పటికీ ఒక్క లబ్ధిదారుకు ఒక్క పైసా దక్కలేదు. అందుకే ఈ సారి బడ్జెట్ కేటాయింపుల్లో ఈ గ్యారెంటీ అమలుకు అడుగులు పడకపోతే ఆడబిడ్డలు ఊరుకునే ప్రసక్తే లేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నాను. అలాగే పంజాబ్‌ను తలదన్నేలా, దేశానికే ధాన్యాగారంగా కేసీఆర్ గారి హయాంలో తెలంగాణను తీర్చిదిద్దిన రైతులకు రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని మాటిచ్చి మోసం చేసినందుకు ముందుగా క్షమాపణలు చెప్పి, ఆ మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించాలని అన్నదాతల పక్షాన కోరుతున్నాను. ఇప్పటికే మూడుసార్లు పెండింగ్‌లో పెట్టిన రైతుబంధు బకాయిలను కూడా చెల్లించాలన్న రైతుల డిమాండ్‌ను మీ ముందు ఉంచుతున్నాను. అలాగే కౌలు రైతులకు, రైతు కూలీలకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వారి ఖాతాల్లో నిధులు జమ చేయాలని కోరుతున్నాను.
రైతులు, మహిళలకే కాదు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ కూడా రెండేండ్ల నుంచి పెండింగ్‌లోనే ఉన్నది. తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాల భర్తీతోపాటు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుకు కూడా కేటాయింపులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న ఆర్థిక సాయం అందజేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ పక్షాన కోరుతున్నాను.
ఈ బహిరంగ లేఖను రాయడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతున్నా, ఇప్పటికీ మీరిచ్చిన హామీల్లో 95 శాతం పెండింగ్‌లోనే ఉన్న నేపథ్యంలో.. ఈ సారైనా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని, లేకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని గుర్తుచేస్తున్నాను. ప్రస్తుతం మీడియాలో, ఇతర మాధ్యమాల ద్వారా వస్తున్న వార్తలు, సమాచారం ప్రకారం రానున్న బడ్జెట్లో కూడా అభయహస్తంలో హామీ ఇచ్చిన గ్యారెంటీలు, హామీలకు నిధుల కేటాయింపు చేస్తున్నట్టు కనబడటంలేదు. ప్రజాపాలన పేరిట మరొక్కసారి ప్రజలను మభ్యపెట్టడానికి, నిట్టనిలువునా మోసగించడానికే సన్నాహాలు చేస్తున్నట్టు కనబడుతున్నది. అలాగే పనికిరాని అంశాలను తెరపైకి తెచ్చి ప్రతిసారీ అటెన్షన్ డైవర్ట్ చేయాలని మీరు చేస్తున్న కుట్రలు తెలంగాణ సమాజానికి అర్థమైపోయాయి.
2023 ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత లోక్‌సభలో ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్‌గాంధీ, శ్రీమతి సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ అభయహస్తం పేరిట దాదాపు 420 హామీలు ఇచ్చిన విషయాన్ని గాలికొదిలేయడం అత్యంత దుర్మార్గం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని, మొదటి క్యాబినెట్లోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని నాడు పీసీసీ అధ్యక్షుడిగా మీరు హామీ ఇచ్చిన విషయాన్ని మీరు మరిచిపోయినట్టు నటించినా, ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయనే విషయాన్ని స్పష్టంచేస్తున్నాను.
ఇంటింటికీ గ్యారెంటీ కార్డులను కూడా పంపిణీ చేసి, ఇన్నేండ్లపాటు దగా చేయడాన్ని తెలంగాణ సమాజం సహించదు. అప్పటి సీఎల్పీ నాయకుడు, ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క ఈ గ్యారెంటీ కార్డులను భద్రం గా దాచిపెట్టుకోవాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్యారెంటీ కార్డులోనిప్రతి ఒక్క గ్యారంటీనీ అమలు చేస్తామన్న వాగ్దానానికి ఇన్నాండ్లు పాతరేయడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమే. నాటి గ్యారెంటీ కార్డులే ఇవాళ బాకీ కార్డులై మీ పాపాలను ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్నాయి. ప్రజల నోట్లో మట్టి కొట్టిన మీ పాపాల ప్రక్షాళన జరగాలంటే ఈ సారి బడ్జెట్లోనైనా హామీల ఆధారంగా కేటాయింపులు చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఒక్కో అక్క చెల్లెమ్మకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ.62,500 బాకీ పడింది.
అవ్వాతాతలకు, బీడీ కార్మికులకు నెలకు పెన్షన్ రూ.4 వేలు చేస్తామన్నారు. కానీ, ఈ 25 నెలల్లో ఒక్కొక్కరికి రూ. లక్ష రూపాయల వరకూ బాకీ పడ్డారు. దివ్యాంగులను దారుణంగా దగాచేశారు. కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ కింద ఈ రెండేండ్లలో పెండ్లి చేసుకున్న ఆడబిడ్డల తల్లులందరికీ తులం చొప్పున బంగారం బాకీ పడ్డారు. యువ వికాసం కింద రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వనేలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వేల కోట్లు బాకీ పేరుకుపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం పొంచి ఉన్నది. ఇలా 42 పేజీల మ్యానిఫెస్టోలోని 420 హామీల్లో 5 శాతం కూడా అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన ఘనచరిత్ర కాంగ్రెస్‌కే దక్కుతుంది.
కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం ప్రతిష్ఠాత్మక పథకాలు అమలు చేసిన విషయం గుర్తుచేస్తున్నాను. ఖరీఫ్, రబీ సీజన్లు ప్రారంభానికి ముందే క్రమం తప్పకుండా రైతుబంధును వారి ఖాతాల్లో జమ చేసిన విషయం మీకు గుర్తులేనట్టు నటించినా, ప్రతి రైతుకూ గుర్తున్నది. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుబంధు నిధులు జమ చేస్తామని వాగ్దానం చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసి 10 రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ కాలేదు. మీ ప్రకటనలన్నీ గాలి మాటలేనని, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ సర్కార్ నైజమని మరొకసారి రుజువైంది.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌లో మీరు ఇచ్చిన హామీపై మాటమార్చి, ఐదేండ్లలో భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొనడం నిరుద్యోగ యువత గొంతుకోయడమే. అంతేకాదు నిరుద్యోగులకు ప్రతినెలా రూ. 4 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న వాగ్దానాన్ని పూర్తిగా గంగలో కలిపి, ఇప్పటివరకు నయాపైసా కూడా చెల్లించకుండా యువతను మోసగించారు. కేసీఆర్ గారి హయాంలో నియామక ప్రక్రియ పూర్తిచేసిన వాటికి కాగితాలిచ్చి ఫొటోలకు పోజులివ్వడం తప్ప పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం అత్యంత దారుణం.
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందజేస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. ఈ రెండేండ్లలో హామీల అమలుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఉపాధి లేక రోడ్డునపడ్డ ఒక్కో ఆటోడ్రైవర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.24 వేలు బాకీ పడిన నేపథ్యంలో ఆ బకాయిలను కూడా ఈ బడ్జెట్లో కేటాయించాలని కోరుతున్నాను. అభయహస్తంలో పొందుపరిచిన గ్యారెంటీలు, 420 హామీల అమలుకు ఎన్ని నిధులు అవసరమో ప్రకటించి బడ్జెట్లో ప్రతిపైసాకూ లెక్క కట్టాలని తెలంగాణలోని సకల జనుల తరపున డిమాండ్ చేస్తున్నాను.
2026-2027 బడ్జెట్లో మరోసారి 6 గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే, మోసకారి కాంగ్రెస్‌ను ప్రజలపక్షాన ఎక్కడికక్కడ నిలదీస్తామని గుర్తుచేస్తున్నాను. తెలంగాణ ప్రజాగ్రహానికి ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని కూడా స్పష్టంచేస్తున్నాను.
– శ్రీ కల్వకుంట్ల తారకరామారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్