ఫార్ములా- ఈ రేస్ విషయంలో తనపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరైన సందర్భంలో, సరైన రీతిలో స్పందించారు. స్పందించడమే కాదు, ఏకంగా చర్చ పెట్టాలని స్పీకర్‌కు లేఖ రాసి విజ్ఞప్తి చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టారు. అంతేకాదు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి, సభలోనే చర్చ పెట్టాలని సీఎం రేవంత్‌కు బహిరంగంగా సవాల్ విసరడం మరో డేరింగ్ స్టెప్. బహుశా కేటీఆర్ నుంచి ఇలాంటి సవాల్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ గాని, రేవంత్‌రెడ్డి అండ్ కోటరీ గాని ఊహించలేదేమో.
కేటీఆర్ సవాల్‌తో ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్ మొదలైంది. అసలే ఏడాదిగా అధికార పార్టీ అనేక ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వ వ్యూహాలన్ని బూమరాంగ్ అవుతున్నాయి. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో అధికార కాంగ్రెస్ విఫలమవుతోంది. ఇదెవరో గాలినపోయే గన్నారావు చెబుతున్న మాటలు కావు, ఏకంగా తెలంగాణలో ఏఐసీసీ ఇన్చార్జీ, హైకమాండ్ దూత అయిన దీపాదాస్ మున్షీ అనేక సందర్భాల్లో చెప్పిన మాటలివి. నిన్నటికి నిన్న హైదరాబాద్‌లో కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని.. కేటీఆర్, హరీశ్‌రావును దీటుగా ఎదుర్కొనే నాయకుడు కాంగ్రెస్‌లో లేడని ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అంతేకాదు, హైదరాబాద్ ప్రజలను, వారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడారు. అది వేరే సంగతి. అంతకుముందు ఢిల్లీ నుంచి వచ్చి రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే క్రమంలో కాంగ్రెస్ ఎ లా వెనుకబడి పోతోందో వర్క్‌షాప్ పెట్టి మరీ చెప్పారు.
ప్రజల దృష్టిలో విపక్షాలను విలన్లుగా, విఫల నేతలుగా చిత్రీకరించే ప్రయత్నంలో అధికార పార్టీ నేతలే విలన్లుగా మిగిలిపోతున్నారు. ఈ అంశం, ఆ అంశం అన్న తేడా లేకుండా ప్రతి విషయంలోనూ అధికార పార్టీపై ప్రతిపక్షం పైచెయ్యి సాధిస్తోంది. ఇప్పుడు ఫార్ములా- ఈ రేస్ విషయంలో కేటీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకున్నది. కానీ, జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మళ్లీ ఆ పార్టీకి చుక్కెదురు అవుతుందనిపిస్తోంది. కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాల అంశంలో కేసీఆర్‌ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఫార్ములా-ఈ రేస్ విషయంలో కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని చేతులు కాల్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఫార్ములా- ఈ రేస్‌లో అవినీతి జరిగిందని, అందులో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఎప్పటినుంచో కాంగ్రెస్ ప్రచారం చేస్తొంది. లీక్ వార్తలతో ప్రాపగాండా చేస్తోంది. ఇదిగో కేటీఆర్ అరెస్టు, అదిగో అంటూ కొన్ని నెలలుగా పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం ఆనవాళ్లు లేకుండా చేస్తానని, కేసీఆర్ గుర్తులు లేకుండా చేస్తానని రేవంత్ ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే మొదటి ఏడాది గత ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేసిన పథకాలపై విష ప్రచారం, తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టులంటూ ఊదరగొట్టారు. ఆ ప్రయత్నాలన్నీ బూమరాంగ్ కావడమే కాదు, మళ్లీ కేసీఆర్ పాలన కావాలని ప్రజలు బలంగా కోరుకునేలా చేశాయి. ఇప్పుడేమో పర్సనల్‌గా కేటీఆర్‌ను టార్గెట్ చేశారు.
అయితే తాజాగా ఫార్ములా- ఈ రేస్ కేసు విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం, మంత్రులపై ఇంటాబయట కేటీఆర్ పోరు ఎక్కువైంది. ఆ ఫ్రస్టేషన్ ముఖ్యమంత్రి, మంత్రులు మాటల్లో అనేక సందర్భాల్లో బయటపడుతూనే ఉంది. ఒకవైపు ఇంటి పోరు, మరోవైపు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయాలని ప్రజల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మధ్య ప్రభుత్వ పెద్దలు కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్రస్టేషన్లో మనిషి విచక్షణ కోల్పోయి మాట్లాడతాడని, ఎప్పుడూ ఏ నిర్ణయం తీసుకుంటారో.. సమయం, సందర్భం లేకుండా వారి వ్యవహారశైలి ఉంటుందని సైకాలజిస్ట్‌లు చెబుతుంటారు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా మనుషులే కదా.
ఫార్ములా- ఈ రేస్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని, అధికారుల పాత్ర కూడా ఏమీ లేదని, తానే స్వయంగా తన మంత్రిత్వ శాఖ నుంచి నగదును నిర్వాహకులకు ట్రాన్స్ఫర్ చేసినట్టు కేటీఆర్ పలుమార్లు చెప్పారు. ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని కేటీఆర్ చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే, తాజాగా కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, విద్యుత్ ఒప్పందాలపై విచారణ కమిషన్ల పేరుతో కాంగ్రెస్ మొదటి ఏడాది కాలం వెళ్లదీసింది. ఒట్లు, తిట్లు, బూతులతో పాలనను గాలికొదిలేశారు. ఇప్పుడు ఫార్ములా- ఈ రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ రాజకీయాలు తిప్పుతూ రెండో ఏడాది కూడా గ్యారెంటీలు అమలు చేయకుండా కాలం వెళ్లదీసే వ్యూహాల్లో అధికార పార్టీ నేతలు ఉన్నారు.
ఫార్ములా-ఈ రేస్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కేటీఆర్ మొదటి నుంచి సవాల్ విసురుతూనే ఉన్నారు. లీక్ వార్తలతో కేటీఆర్‌ను భయపెట్టేందుకు సర్కారు ఎంత కఠినంగా వ్యవహరించాలని చూస్తుందో అంతే కఠినంగా తప్పు చేస్తే అరెస్టు చేసుకోవాలని కేటీఆర్ ధైర్యంగా సవాల్ చేస్తున్నారు. తాజాగా కేసుకు ముందే దమ్ముంటే అసెంబ్లీ సమావేశాల్లో ఫార్ములా- ఈ రేస్‌పై చర్చ పెట్టాలని ఏకంగా స్పీకర్‌కు, సీఎంకు లేఖ రాసి అధికార పార్టీని కేటీఆర్ ఇరుకున పెట్టారు. ఈ క్రమంలో అధికార పార్టీని డిఫెన్స్‌లో పడేశారు.
కేటీఆర్ డిమాండ్ చేసినట్టు సభలో చర్చ పెడితే వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలుస్తాయి. ఒకవేళ సభలో చర్చకు పెట్టకపోతే ఇన్ని రోజులు కేటీఆర్‌పై ప్రభుత్వం చేసిందంతా తప్పుడు ప్రచారం అని జనాలకు అర్థమైపోతుంది. అందుకే, అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయంలో కేటీఆర్‌పై కేసు పెట్టించి, లగచర్ల రైతుల విడుదల విషయం మీడియాలో ప్రచారానికి నోచుకోకుండా మరో డైవర్షన్ ఎత్తుగడకు కాంగ్రెస్ సర్కార్ పాల్పడింది.
– తోటకూర రమేశ్ 98661 68676