వెనుకటికెవరో… పంచ పాండవులు నాకు తెల్వదా.. మంచం కోళ్ల తీరు ముగ్గురే కదా అని రెండు చూపించి, ఒకటి రాయబోయి సున్నా సుట్టిండట! నా చిన్నప్పుడు మా హైస్కూల్ తెలుగు మాష్టారు తూపురాణి లక్ష్మణాచారి సార్ చెప్పేవారు. సార్ అప్పట్లో ఏ సందర్భంలో చెప్పారో నాకు గుర్తులేదు కానీ, ఇప్పుడు రైతు రుణమాఫీకి అచ్చు గుద్దినట్టు సరిపోయింది.
రూ.2 లక్షల పంట రుణాల హామీతో కాంగ్రెస్ పార్టీ కొలువు మీదికొచ్చింది. రేవంత్ రెడ్డి కూటమెక్కి పంట రుణమాఫి రూ.40 వేల కోట్లని లెక్కలేసి, ‘ఇదెంత పని ఏడాది పాటు కడుపు గట్టుకుంటే తీసి అవతల పారేత్తం’ అని చెప్పి రూ.31 వేల కోట్లుగా నిర్ధారించి, బడ్జెట్లో 26 వేల కోట్లు పెట్టి, 17.9 వేల కోట్లే ఇచ్చి, పేద రైతులకు సున్నా సుట్టి తొడగొడుతున్నడు. ఇక రాజీనామా చెయ్ హరీష్రావు అని సవాల్ జేస్తున్నడు.
Telangana | సంపూర్ణ రైతు రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే..! నేను సిద్ధమే అంటుండ్రు కేటీఆర్, హరీష్ రావు. నా నియోజకవర్గమో.. నీ నియోజకవర్గమో.. చెప్పు లెక్కలు తేలుద్దాం అంటున్నరు. ఇప్పటివరకు దొరికిన లెక్కల ప్రకారం ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లి. ఆ ఊరు కల్వకుర్తి సహకార సంఘం బ్యాంక్ పరిధిలోకి వస్తుంది. ఈ బ్యాంకులో 1,407 మంది రైతులకు పంట రుణాలుంటే 2వ విడత నాటికి ఒక్కరికీ రుణమాఫీ కాలేదు. మూడో విడత లబ్ధిదారులను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇటువంటి ఉదాహరణలు రాష్ట్రవ్యాప్తంగా లెక్కకు మించి ఉన్నాయి.
బ్యాంకర్ల నివేదికల ప్రకారం.. ఇంకా 14.5 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. వీళ్లంతా వ్యవసాయాధికారుల సుట్టూ తిరుగుతున్నరు. రోడ్ల మీదికి వస్తున్నరు. బ్యాంకుల ముందు ఆందోళన చేస్తున్నరు. రాజకీయ సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎట్లా ఉన్నా… పెసరి చేలో పోగొట్టుకొని కూరటికల దేవులాడుకున్నట్టు ఉంది తెలంగాణ రైతాంగం అవస్థ. ఎవడు విసిరిన పాచికో.. ఏ కొనుగోళ్ల మాయలో పడ్డమో, ఏమో! మార్పు కావాలి.. మార్పు కావాలి అని పాలిచ్చే బర్రెను కాళ్ల తన్నుకున్నం. బతుకును బజాట్లె వేసుకున్నం.
ఈ నేపథ్యంలో ఓ సందర్భం గుర్తుకువస్తున్నది. ‘నా వయస్సు ఇప్పుడు 64 ఏండ్లు. తెలంగాణ కావాలనుకున్నా.. తెచ్చినా. ఈ కీర్తే నాకు వెయ్యి జన్మల పుణ్యఫలం. కొట్లాడి తెచ్చుకున్నం. ఈన గాసి నక్కల పాలు కావద్దు. అది బంగారు తున్క గావాలె. కర్షకుని కన్నీళ్ల తుడిచే రైతురాజ్యం అవ్వాలె. అది రామరాజ్యంగా మారాలె. దుఃఖం లేని రైతు ముఖం చూడాలన్న ఆకాంక్ష తప్ప, నాకు ఎవరితో పంచాయితీ లేదు. కొట్లాట లేదు.’ తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ఆవిర్భావం వేళ ఓరుగల్లు వేదిక నుంచి కేసీఆర్ ఉద్వేగంగా ప్రసంగించారు.
వరంగల్ రైతుహిత సభ అనంతరం రాష్ట్రంలో సాగు విప్లవం వచ్చింది. మిషన్ కాకతీయ నీళ్లు పంట పొలాలకు అందినయి. దీనికితోడు కేసీఆర్ 2018లో పంట రుణాలకు లబ్ధిదారుల సంఖ్య పెంచారు. 36.68 లక్షల మంది రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ కోసమే రూ.19,198 కోట్లు ఖర్చుచేశారు. రైతుహిత సభ జరిగిన మరుసటి ఏడాదే.. అంటే, 2018లో రైతుబంధు పెట్టిండు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రైతుబంధుకు రూ.12 వేల కోట్ల బడ్జెట్ను పెట్టిండు. ఈ లెక్క కేసీఆర్ దిగిపోయేనాటికి రూ.64,940 కోట్లకు చేరుకున్నది.
రైతులను అప్పుల భారం నుంచి విముక్తం చేస్తూ.. మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ రైతుబంధు పథకం తెచ్చిండు. రైతుబంధును కాంగ్రెస్ పార్టీ బద్నాం చేస్తూ వచ్చింది. కలిగినోళ్లకు కూడా రైతుబంధు పడుతుందనే విమర్శ చేస్తూ వచ్చింది. ఈ విమర్శ సన్న, చిన్నకారు రైతులను ఆకర్షించింది. అదే సమయంలో రాజకీయ వ్యూహకర్తల ముసుగులో బ్రోకర్లు పల్లెల్లోకి చొరబడ్డరు. ప్రత్యర్థి రాజకీయ పార్టీతో వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నరు. సోషల్మీడియా వేదికగా విషం చిమ్మిండ్రు. తెలంగాణ ఓటరును ఏమార్చిండ్రు. బ్రోకర్ల మాయలో సగటు ఓటరు దగా పడ్డడు.
కాంగ్రెస్ వచ్చీరావటంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టింది. 24 గంటల నిరంతర కరెంటును పండబెట్టింది. రైతుబంధు బందైంది. రైతు రుణమాఫీ ఎక్కిరిస్తున్నది. 14.5 లక్షల మంది రైతులను పక్కనపడేసి సంపూర్ణ రుణమాఫీ చేసినమని గప్పాలు కొట్టుకుంటున్నరు. కేసీఆర్ రూ.ఒక లక్ష రుణమాఫీనే 36 లక్షల మంది రైతులకు ఇస్తే… ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీకి కేవలం 22.37 లక్షల మందే అని చెప్పటం మోసం కాదా? సర్కారు చేతిలో మోసపోయిన రైతాంగం దిక్కుతోచక మళ్లీ ఆత్మహత్యల వైపు మొగ్గితే, ఆ ఉసురు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే తాకుతుంది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పంటచేను కాడి కాపలాదారుడై సాగు విప్లవం తీసుకొస్తే… మలి ప్రభుత్వం పంటను సావు సంకటంగా మారుస్తున్నది.
బ్యాంకర్ల నివేదికల ప్రకారం.. ఇంకా 14.5 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. వీళ్లంతా వ్యవసాయాధికారుల సుట్టూ తిరుగుతున్నరు. రోడ్ల మీదికి వస్తున్నరు. బ్యాంకుల ముందు ఆందోళన చేస్తున్నరు. రాజకీయ సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎట్లా ఉన్నా… పెసరి చేలో పోగొట్టుకొని కూరటికల దేవులాడుకున్నట్టు ఉంది తెలంగాణ రైతాంగం అవస్థ.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు