పితృస్వామిక హైందవ సమాజంలో అనాదిగా మహిళలు వివక్షకుగురయ్యారు. ద్వితీయశ్రేణి సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక, రాజకీయరంగాల్లో స్త్రీలు అణచివేయబడ్డారు. ఇలాంటి సామాజిక పరిస్థితుల నుంచి మహిళలు ప్రగతి పథం వైపు నడవటానికి విద్యను అందించడమే సమస్యకు పరిష్కారం.
ఆధునిక సమాజంలోనూ స్త్రీ, పురుష అక్షరాస్యతలో అసమానతలు స్పష్టంగా కనపడుతున్నాయి. ‘జాతీయ గణాంకాల సంస్థ-2021’ ప్రకారం దేశంలో పురుషుల అక్షరాస్యత 84.70 శాతం కాగా, మహిళల అక్షరాస్యత 70.30 శాతం. ప్రాథమిక పాఠశాల స్థాయిలో దేశవ్యాప్తంగా మెరుగైన రీతిలో బాలికల నమోదు జరుగుతుండగా, ఉన్నత విద్యకు వచ్చేసరికి క్రమంగా తగ్గిపోతున్నది. ప్రాథమిక స్థా యిలో విద్యార్థినుల సంఖ్యకు, ఉన్నత విద్యకు వచ్చేసరికి దాదాపు 70 శాతం పడిపోయింది. ఇందులో 50 శాతం పాఠశాల స్థాయిలోనే చదువుకు దూరమవుతున్నారు. ఇందుకు కా రణాలు లేకపోలేదు. లింగవివక్ష, మత సంప్రదాయాలు, ఆర్థి క, సామాజిక, సాంస్కృతికరంగాల్లో అసమానతలు కారణం.
మహిళా ఉన్నత విద్య కోసం అవకాశాలు విస్తృతపరచటం కోసం కోఠి మహిళా కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. 2014 రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉన్నతవిద్యలో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో 60 శాతం పైగా మహిళా విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడం విప్లవాత్మకమైన పరిణామం.
ఈ నేపథ్యంలో పూలే దంపతుల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం బాలికావిద్యను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. తెలంగాణలో విద్యా విప్లవానికి గురుకుల విద్యావ్యవస్థ నాంది పలికింది. నిరుపేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్యాబోధనతో పాటుగా సంతులిత ఆహారాన్ని అందించే సంకల్పంతో గురుకుల వ్యవస్థను బలోపేతం చేసింది. మొత్తంగా 973 గురుకులాల్లో బాలికలకు 52 శాతం (506) పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, 53 బాలికా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు, ఒక ఫార్మసీ కళాశాల, 12 మహిళా పాలిటెక్నిక్ కళాశాలలు, 2 ఇంజినీరింగ్ కళాశాలలు, 5 పీజీ కళాశాలలు నడుపుతూ ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్యనందిస్తున్నది. ఇంతటి భారీ స్థాయిలో బాలికల కోసం విద్యాలయాలు నడుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. వీటితోపాటుగా బాలికలకు విద్యారంగంలో మరింత విస్తృత అవకాశాలు కల్పించేందుకు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను బలోపేతం చేసింది. నూతనంగా మరో 126 కస్తూర్బా పాఠశాలలు స్థాపించింది. వీటిల్లోనూ మెరుగైన మౌలిక సదుపాయాల కల్పించింది. మోడల్ స్కూళ్లలో విద్యార్థినుల కోసం కొత్తగా 100 హాస్టళ్లను ఏర్పాటుచేసింది.
క్షేత్రస్థాయిలో బాలికా విద్యాభివృద్ధిలో ప్రభుత్వ పాఠశాలలు కీలకభూమిక పోషిస్తున్నాయి. గ్రామీణ బాలికలు విద్యాబుద్ధులు పొందాలంటే ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కావాలి. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పేరిట బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న 26,065 ప్రభుత్వ పాఠశాలల్లో సురక్షిత తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుద్ధీకరణ, ఫర్నీచర్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.7,300 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో వారిలో ఆత్మస్థయిర్యం పెరగనున్నది. 2020లో కేంద్రం వెలువరించిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో బాలికల స్థూల నమోదు నిష్పత్తి 27.3 శాతమే కాగా, తెలంగాణ స్థూల నమోదు నిష్పత్తి 36.4 శాతం. ఈ జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, ఢిల్లీ వంటి రాష్ర్టాలు వెనకబడి ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ కల సాకారమైనట్టే కనిపిస్తున్నది.
ఏడున్నర దశాబ్దాల కాలంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో కేంద్రం విఫలమైంది. ఇక గుణాత్మక విద్య కోసం మరెన్ని దశాబ్దాలు నిరీక్షించాల్సి వస్తుందో? సమాజంలో 50 శాతం పైగా ఉన్న మహిళల విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. లింగ, వర్గ, కుల, మత అసమానతల్లేని విద్యావ్యవస్థ స్థాపనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. బ్రింగమ్ యంగ్ అన్నట్టు.. ‘ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఒక తరం విద్యావంతులవుతారనే’ సత్యాన్ని మనం గుర్తించాలి. మహిళా విద్యతోనే సామాజిక వికాసం, ప్రగతి సుసాధ్యమవుతుంది.
(వ్యాసకర్త: వైస్‌ఛాన్స్‌లర్, కేయూ)
ప్రొఫెసర్ తాటికొండ రమేష్
97016 82924